Tirumala : శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడ
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:56 AM
తిరుమలలోని వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో మసాలా వడ వడ్డింపు మొదలైంది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో...

నిత్యం 35 వేల మందికి వడ్డింపు
శ్రీవారి భక్తులకు వడ్డింపు ప్రారంభం
తిరుమల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో మసాలా వడ వడ్డింపు మొదలైంది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం ఉదయం భక్తులకు మసాలా వడలను వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీవారి చిత్రపటం వద్ద వడలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఓ పదార్థాన్ని వడ్డించాలనే ఆలోచన తనకు కలగడంతో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా అంగీకారం తెలిపారన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో రుచికరమైన అన్నప్రసాదాలను అందిస్తున్నామని చెప్పారు. వడ తయారీలో శెనగపుప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీన, సోంపు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 35 వేల వడలను వడ్డిస్తామని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. కాగా, వడలు చాలా రుచిగా ఉన్నాయంటూ పలువురు భక్తులు ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బోర్డు సభ్యుడు శాంతారామ్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, క్యాటరింగ్ అధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.