Share News

Chittoor Police: ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆస్తంతా కొట్టేశాడు

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:42 AM

ఆస్తిపాస్తులు ఉన్నా.. భర్త, కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చరమాంకంలో తనకు ఆసరా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. అతడు ఆమెను నిండా ముంచేశాడు. దీనిపై బాధితురాలు సోమవారం చిత్తూరులోని...

Chittoor Police: ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆస్తంతా కొట్టేశాడు

  • మొదటి భార్య చనిపోయిందని నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించిన ఘనుడు

  • రెండో భార్య నుంచి రూ.28 కోట్లు స్వాహా చేసి పరార్‌

చిత్తూరు అర్బన్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఆస్తిపాస్తులు ఉన్నా.. భర్త, కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చరమాంకంలో తనకు ఆసరా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. అతడు ఆమెను నిండా ముంచేశాడు. దీనిపై బాధితురాలు సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజేఆర్‌స్)లో ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేసింది. వివరాలివీ.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణి భర్త కర్ణాటకలో విద్యుత్‌శాఖలో డీఈ కేడర్‌లో పనిచేశారు. వీరి కుమారుడు 15 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పదేళ్ల క్రితం భర్త వెంకటప్పరెడ్డి కూడా అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా మిగిలారు. వయసు మీద పడుతుండడంతో.. తనకు, తన ఆస్తికి భద్రతతో పాటు, జీవిత చరమాంకంలో ఓ తోడు కావాలని, జమున అనే పెళ్లిళ్ల బ్రోకర్‌ ద్వారా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్‌ని కలిసింది. నాగమణి ఆర్థిక పరిస్థితి తెలియడంతో.. శివప్రసాద్‌ తన భార్య కరోనాతో చనిపోయినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ను చూపించాడు. తనకు పిల్లలు కూడా లేరని, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. నాగమణి ఈ మాటలు నమ్మింది. 2022లో శివప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. తనను పూర్తిగా నమ్మాక.. నాగమణిని మోసం చేయడానికి శివప్రసాద్‌ పథకం రూపొందించాడు. ఆ ప్రకారం రూ.1700 కోట్లు తనకు ఆర్బీఐ నుంచి రావాల్సి ఉందంటూ ఓ నకిలీ లెటర్‌ను చూపించాడు. ఈ నిధులు విడుదలవ్వాలంటే రూ.15కోట్లు ట్యాక్స్‌ రూపంలో చెల్లించాలని నమ్మించాడు. నాగమణి బ్యాంకు అకౌంట్‌ నుంచి శివప్రసాద్‌ అన్న చక్రవర్తి, వదిన హేమలత అకౌంట్లకు రూ.3 కోట్లు మళ్లించాడు. నాగమణికి సంబంధించిన రూ.10కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి, బెంగళూరులో రూ.15 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్‌ను విక్రయించాడు. ఆ తర్వాత ఆర్బీఐ విషయమై నాగమణి నిలదీయడంతో గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి పరారయ్యాడు. శివప్రసాద్‌ను వెతుక్కుంటూ నాగమణి శేషాపురానికి రాగా, ఆయన తన భార్య, కుమార్తె, బంధువులతో కలసి ఉండటాన్ని చూసింది. నాగమణిని చూసిన శివప్రసాద్‌ అక్కడి నుంచి కూడా పరారయ్యాడు.

Updated Date - Jul 08 , 2025 | 08:03 AM