Farmers: మార్క్‌ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:37 AM
గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ బర్లీ పొగాకు రైతులను ఆదుకోవడానికి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాం’ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు
బాపట్ల, పర్చూరు, జూన్ 19(ఆంధ్రజ్యోతి): గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ బర్లీ పొగాకు రైతులను ఆదుకోవడానికి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాం’ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత స్థానిక వైజంక్షన్ నుంచి ప్రధాన కూడలి వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి మంత్రి ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. నల్లబర్లీ రైతులతో మాట్లాడారు. హెచ్‌డీఆర్, హెచ్‌డీఎం రకం పొగాకు క్వింటా రూ.12వేలు, హెచ్‌డీఎక్స్ రకం క్వింటా రూ.6వేల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.
కేంద్రం వాటా ఎప్పుడు జమ చేస్తే అప్పుడే రాష్ట్రం వాటా విడుదల చేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్నారు. కాగా, దుర్మార్గులకు సంతాపాలు తెలిపే పేరిట రోడ్డుమీద పడి శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని వైసీపీ కుట్ర చేస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.