Share News

Maoist Leader encounter: మావోయిస్టు జగన్‌పై వందకుపైగా కేసులు

ABN , Publish Date - May 09 , 2025 | 05:31 AM

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌ పై 100కి పైగా కేసులు, రూ.20 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో ఏకే47లు, నగదు, సాహిత్యం సహా కీలక సామగ్రి స్వాధీనం చేసుకున్నారు

Maoist Leader encounter: మావోయిస్టు జగన్‌పై వందకుపైగా కేసులు

  • ఆయనపై 20 లక్షల రివార్డు

  • ఘటనా స్థలంలో 2 ఏకే 47లు, 303 రైఫిల్‌, 98 వేల నగదు స్వాధీనం

  • మీడియాతో అల్లూరి ఎస్పీ అమిత్‌ బర్దర్‌

రంపచోడవరం, మే 8(ఆంధ్రజ్యోతి): ‘అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవవరం మండలంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టు నేతల్లో ఒకరు కాకూరి పండన్న ఎలియాస్‌ జగన్‌. ఆయన తలపై 20 లక్షల రివార్డు ఉంది. ఆయనపై 100కు పైగా కేసులున్నాయి’ అని ఆ జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలిపారు. గురువారం ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం రంపచోడవరంలో మీడియాతో మాట్లాడారు. ‘మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో విస్తృతంగా గాలింపు చేపట్టాం. వై.రామవరం మండలం దుమకొండ-గంగకొండ అటవీ ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు సాగించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన వారిలో ఒకరు కాకూరు పండన్న ఎలియాస్‌ జగన్‌గా గుర్తించాం.


ఏవోబీ పరిధిలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఈయన అనేక నేరాలకు పాల్పడ్డారు. వాటిలో 100కు పైగా కేసుల్లో ఈయన కీలక నిందితుడిగా ఉన్నారు. జగన్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ(ఎ్‌సజడ్‌సీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరో మావోయిస్టును వాగపొడియామి అలియాస్‌ రమేశ్‌గా గుర్తించామన్నారు. ఈయనపై 30కి పైగా కేసులున్నాయి. రూ.5 లక్షల మేర రివార్డు ఉంది. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 తుపాకీలు, ఒక 303 రైఫిల్‌, తుపాకీ గుళ్ల మ్యాగ్‌జైన్‌లు, చిన్నకత్తి, రూ.98 వేల నగదు, కిట్‌ బ్యాగ్‌లు, 3 జతల కళ్లద్దాలు, మావోయిస్టు సాహిత్యం, యూనిఫాం, ఇతర వస్తువులు ఉన్నాయి. ఈ ఘటనపై వై.రామవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాం’ అని ఎస్పీ తెలిపారు. కాగా, జగన్‌, రమేశ్‌ మృత దేహాలకు శుక్రవారం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల బంధువులు వస్తే వారికి భౌతిక కాయాలను అప్పగించే అవకాశం ఉంది.

Updated Date - May 09 , 2025 | 05:31 AM