Man Donates Organs: తాను మరణించి.. ముగ్గురిని బతికించాడు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:16 AM
రోడ్డు ప్రమాదం విషాదం నింపినా.. చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేశాడో వ్యక్తి. బాపట్ల జిల్లా ..
అవయవాలను దానం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు
నాగుపాలెం (పర్చూరు), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం విషాదం నింపినా.. చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేశాడో వ్యక్తి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలేనికి చెందిన ముద్దన వెంకటరావు (62) ఈ నెల 9న చిలకలూరిపేట నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా తిమ్మరాజుపాలెం సమీపంలో గేదె అడ్డురావడంతో ప్రమాదానికి గురయ్యారు. గుంటూరులోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో శస్త్రచికిత్స చేసినా సహకరించక బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్య నిపుణులు కుటుంబ సభ్యులకు తెలిపారు. రోడ్డు ప్రమాదం తమ కుటుంబంలో విషాదం నింపినా మృతుని ద్వారా మేలు చేకూరాలని వారు భావించారు. వెంకటరావు అవయవాలను దానం చేస్తామని వైద్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వైద్య బృందం బెంగళూరు నుంచి మంగళవారం గుంటూరు వైద్యశాలకు వచ్చి వెంకటరావు కళ్లు, కిడ్నీ, లివర్ సేకరించింది. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.