కన్నుల పండువగా మద్దమ్మ జాతర
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:46 PM
మద్దికెర గ్రామ దేవత మద్దమ్మ జాతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. మద్దమ్మ జాతర మహోత్సవం కన్నుల పండువగా అశేష జనవాహిని మధ్య జరిగింది.

అశేషంగా కదిలి వచ్చిన జనం
మద్దికెర, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : మద్దికెర గ్రామ దేవత మద్దమ్మ జాతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. మద్దమ్మ జాతర మహోత్సవం కన్నుల పండువగా అశేష జనవాహిని మధ్య జరిగింది. గురువారం తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గానికి వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి తలంబ్రాలు పోసి చదివింపులు చదివించారు. అనంతరం ఉదయం మద్దికెర గ్రామ దేవత మూలవిరాట్ మద్దమ్మవ్వకు పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మధ్యాహ్నం గ్రామానికి చెందిన జంబునాథ్‌రాయుడు, సంధ్యారాణి, శ్రీనివాసులు, ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి రథోత్సవం నిర్వహించేందుకు యాదవ రాజులుగా పిలువబడుతున్న చిన్న నగిరి, పెద్ద నగిరి యాదవరాజులు రాజు దుస్తులు ధరించుకుని తరలిరాగా రథోత్సవం ముందు హోమం నిర్వహించారు. అనంతరం రథోత్సవం ముందు యాదవ రాజులు ఉండగా అశేష జనవాహిని అమ్మవారి రథాన్ని లాగారు. రథోత్సవం ముందు హోమ పూజలు చేయగా ఉత్సవమూర్తి చిన్న మద్దమ్మను రథంలో ఏర్పాటు చేసి యాదవ వంశీకులైన చిన్న నగిరి, పెద్ద నగిరి వాసులు రథం ముందు రాజు దుస్తులతో ముందుకు రాగా రథాన్ని అశేష భక్తజన వాహని మధ్య ముందుకు లాగారు. అమ్మవారి రథోత్సవంపై భక్తులు అరటి పండ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. అనంతరం రాత్రి దేవాలయంలో చెక్కభజన కార్యక్రమాలు, ఉచిత పౌరాణిక నాటకాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ పులిశేఖర్‌గౌడు, ఎస్‌ఐ విజయకుమార్ నాయక్ బందోబస్థు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దనగిరి, చిన్ననగిరి కులస్థులు భక్తులు పాల్గొన్నారు.
ఫ మద్దమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు :
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మద్దికెర గ్రామ దేవత మద్దమ్మవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రథోత్సవానికి కాయలు కొట్టి భక్తిని చాటుకున్నారు.