Low Pressure Forms in Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:28 AM
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది..
నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం
విశాఖపట్నం/అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం నాటికి పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. అల్పపీడనం కోస్తాకు ఆనుకుని(విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు) బంగాళాఖాతంలో కొనసాగుతున్నందున ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిభారీ, కొన్నిచోట్ల అసాధారణ వర్షాలు, పశ్చిమగోదావరి, ఏల్లూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గురువారం అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రైతులకు అందుబాటులో ఉండండి: అచ్చెన్న
అల్పపీడనం నేపథ్యంలో వర్షప్రభావిత ప్రాంత రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారీ వర్షాలు సంభవిస్తే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
రబీకి 23.08 లక్షల టన్నుల ఎరువులు: డిల్లీరావు
వచ్చే రబీ సీజన్‌లో పంటల సాగు అవసరాల కోసం రాష్ట్రానికి 23.08 లక్షల టన్నుల ఎరువుల్ని కేంద్రం కేటాయించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు బుధవారం తెలిపారు. యూరియా 9.38, డీఏపీ 2.20, కాంప్లెక్స్ 9.50, ఎంవోపీ, ఎస్‌ఎ్‌సపీ లక్ష టన్నుల చొప్పున కేటాయించినట్లు చెప్పారు.