Lovers Tragedy Near Peracherla Station: పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:24 PM
పెద్దల నిర్ణయం కారణంగా విడిపోయి బతకటం కష్టమని భావించారు ఓ ప్రేమజంట. విడిపోయి బతకటం కంటే కలిసి చావటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోక పోవటంతో ప్రేమికులు ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకి చెందిన గోపి, తెనాలి మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రియాంక.. నరసరావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. కాలేజీలో ఏర్పడ్డ పరిచయం కొంత కాలానికే ప్రేమగా మారింది. వీరి ప్రేమ సంగతి రెండు కుటుంబాల పెద్దలకు తెలిసింది.
అయితే, వారు గోపి, ప్రియాంకల పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవటంతో ఇద్దరూ బాగా కృంగిపోయారు. పెద్దల నిర్ణయం కారణంగా విడిపోయి బతకటం కష్టమని భావించారు. విడిపోయి బతకటం కంటే కలిసి చావటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మేడికొండూరు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇరు కుటుంబాల పెద్దలకు సమాచారం అందించారు. విషయం తెలియగానే గోపి, ప్రియాంకల తల్లిదండ్రులు గుండెలు అవిసేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో దమ్మాలపాడు, అత్తోట గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. అడ్డుకున్న మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే..
పాక్ ప్రధానికి ఊహించని షాక్.. పీఓకేలో తిరగబడ్డ ప్రజలు..