గల్లంతు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:54 AM
కృష్ణాడెల్టాలోని దివిసీమ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రపు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకురాకుండా పంట కాలువల్లో ఏర్పాటు చేసిన అవుట్ ఫాల్ స్లూయిస్‌లు అనేక చోట్ల నీటిలో కొట్టుకుపోయాయి. తిరిగి వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటల సాగు ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయింది. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాదైనా వేసవిలో కాలువల పనులు చేస్తారా లేక నీటి విడుదల సమయంలో పనులు చేపట్టి మమ అనిపిస్తారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

-నీటిలో కొట్టుకుపోయిన అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు
-దివిసీమ, మచిలీపట్నంలో పొలాల్లోకి చొచ్చుకొస్తున్న సముద్రపు నీరు
-వేలాది ఎకరాల్లో నిలిచిపోయిన పంటల సాగు
-అభివృద్ధికి నోచుకోని కాలువలతో రైతుల అవస్థలు
- ఇంకా అంచనాల దశలోనే ప్రతిపాదనలు
కృష్ణాడెల్టాలోని దివిసీమ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రపు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకురాకుండా పంట కాలువల్లో ఏర్పాటు చేసిన అవుట్ ఫాల్ స్లూయిస్‌లు అనేక చోట్ల నీటిలో కొట్టుకుపోయాయి. తిరిగి వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటల సాగు ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయింది. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాదైనా వేసవిలో కాలువల పనులు చేస్తారా లేక నీటి విడుదల సమయంలో పనులు చేపట్టి మమ అనిపిస్తారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
కృష్ణాడెల్టాలో రబీ సీజన్‌లో వరిసాగు కోసం కాలువలకు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఈఏడాది కాలువల నిర్వహణ పనులు చేస్తారని ఆశించారు. ఆరుతడి పంటగా మినుము సాగు చేశారు. ప్రస్తుతం మినుముతీత పనులు పూర్తయ్యేదశలో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో తీరప్రాంతంలో ఆలస్యంగా వరినాట్లు వేసిన పొలాల్లో వరిపంటను కాపాడేందుకు గత నెల 26వ తేదీ వరకు విడతల వారీగా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాలువలకు నీటిని నిలిపివేశారు. ఈ నెలాఖరుకు గానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ తీర ప్రాంతంలోని తాగునీటి చెరువులను నింపేందుకు కాలువలకు నీటిని విడుదల చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.
ఏటా నష్టపోతున్న పంటలు
కృష్ణాడెల్టాలోఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరినాట్లు వేసే జూలై, ఆగస్టు నెలల్లో వరిపైరు నీటమునిగి, పంట చేతికొచ్చే నవంబరు, డిసెంబరు నెలల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాకు చెందిన రైతులు వేలాది ఎకరాల్లో పంటను ఏటా నష్టపోతున్నారు. రైతులు పంటలు నష్టపోకుండా ఉండాలంటే ఈ ఏడాదైనా కాలువలు నిర్వహణ పనులు ఈ వేసవిలో పూర్తిచేసేందుకు త్వరితగతిన అంచనాలు తయారు చేసి అనుమతులు ఇవ్వాలి. ఇటీవల కలెక్టర్ బాలాజీ నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కాలువల నిర్వహణ పనులకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలు ఎక్కడ అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. దివిసీమ ప్రాంతంలో సాగు నీటి సంఘాల ద్వారా ఈ పనులకు సంబంధించిన అంచనాలను తయారు చేశారు. మచిలీపట్నం, గుడివాడ డివిజన్‌లో ఈ పనుల అంచనాలు ఇంకా కొలిక్కిరాలేదని, ఆ పనిలోనే ఉన్నామని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. వేసవిలో మురుగు కాలువల్లోకి కత్తెరపోటు సమయంలో వచ్చే ఉప్పునీటి ప్రభావంతో ఎక్కువశాతం గుర్రపుడెక్క, తూడు, నాచు చనిపోతుంది. ఇంకా మిగిలిన తూడు, గుర్రపుడెక్కలను నిర్మూలించేందుకుు రసాయనాలు పిచికారీ చేస్తారు. ప్రధాన కాలువలు, బ్రాంచ్ కాలువలకు ఉన్న డ్రాప్‌లు, రెగ్యులేటర్లకు కనీస మరమ్మతులతోపాటు సాగునీటి సంఘాల సూచనలతో ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ వేసవిలో కాలువలలో పూడికతీత, కాలువగట్ల బలోపేతం వంటి పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.
అవుట్ ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణంపై నిర్లక్ష్యం
దివిసీమ ప్రాంతంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో ఏడు అవుట్ ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణం చేసేందుకు రూ.38.75 కోట్లతో అంచనాలు రూపొందించారు. రెండు నెలల క్రితం సాంకేతిక నిపుణులు అవుట్‌ఫాల్ స్లూయిస్‌లను పరిశీలించారు. తుది అంచనాలను రూపొందించి, అవుట్ ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణాకి అనుమతులు ఇస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దివిసీమ ప్రాంతంలో పాడైన అవుట్ ఫాల్ స్లూయిస్‌లను బాగుచేయాలని కోరారు. అవుట్ ఫాల్ స్లూయిస్‌లు పాడవడంతో గత ఐదారు సంవత్సరాలుగా కోడూరు మండలం హంసలదీవి, ఇరాలి, తదితర గ్రామాల్లోని పొలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకువస్తుండటంతో ఐదు వేల ఎకరాల్లో వరినాట్లు వేయకుండా రైతులు క్రాప్‌హాలీడే ప్రకటించాల్సి వచ్చింది..
మరమ్మతులకు నోచుకోని న్యూకోన డ్రెయిన్ అవుట్‌ఫాల్
మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లి నెలకుర్రు, ఎన్-గొల్లపాలెం, తుమ్మలచెరువు, తుమ్మలపాలెం, చిన్నాపురం, కోన, వాడపాలెం, వెంకటదుర్గాంబపురం, కొత్తపల్లె తుమ్మలపాలెం, వాడగొయ్యి, పెదయాదర, కమ్మవారిచెరువు గ్రామాల పరిధిలోని పొలాల్లోని మురుగు నీటిని డేగలకోడు, యాదర డ్రెయిన్, వాడగొయ్యి డ్రెయిన్, మంగల్లంకకోడు, మధ్యకాలువల ద్వారా కోన-వాడపాలెం గ్రామాల మధ్య సముద్రపు కరకట్ట వద్ద అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల ద్వారా సముద్రంలోకి వదులుతారు. కరకట్ట కింద ఆరుఖానాలతో పాత అవుట్ ఫాల్‌స్లూయిస్ పాడవడంతో ఎనిమిదేళ్ల క్రితం మరో అవుట్‌ఫాల్ స్లూయిస్‌ను నిర్మించారు. పాత, కొత్తఅవుట్‌ఫాల్ స్లూయిస్‌ల గేట్ల్లు పాడైపోయి నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఈ రెండింటి నుంచి పొలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకువచ్చి 12 గ్రామాల పరిధిలోని 4,500 ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వేసవిలోనైనా ఈ స్లూయిస్ గేట్లకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.