Share News

Lokesh: అందరం కలుదదాం.. ఇంటింటికి వెళ్దాం

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:30 AM

నెల రోజులు జరిగే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ పార్టీ శ్రేణులు, నేతలకు పిలుపిచ్చారు.

Lokesh: అందరం కలుదదాం.. ఇంటింటికి వెళ్దాం

  • కుటుంబ సారథుల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుల వరకు.. ‘తొలి అడుగు’ విజయవంతం చేద్దాం: లోకేశ్‌

అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): నెల రోజులు జరిగే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ పార్టీ శ్రేణులు, నేతలకు పిలుపిచ్చారు. కుటుంబ సాధికార సారథుల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్డెక్కాలని, అందరూ పాల్గొనాలని స్పష్టంచేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏడాది హనీమూన్‌ పూర్తయిందని చెప్పారు. తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని.. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని యాప్‌లో నమోదు చేయాలని.. మై టీడీపీ యాప్‌ ద్వారా మీరు చేసిన పనులు నాయకత్వానికి తెలియజేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో 94 శాతం సీట్లను ప్రజలు గెలిపించారని, దీనికి ప్రధాన కారణం.. గత పాలకుల అహంకారం, వారి పని విధానమని చెప్పారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమే.. దీనిని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘ఈ గెలువు వెనుక కార్యకర్తల కష్టం ఉంది. నేను యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు కబ్‌ (క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇది వచ్చాకే బూత్‌ స్థాయిలో పార్టీ బలోపేతమైంది’ అని చెప్పారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కమిటీల్లో యువతకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయి నుంచే మహిళలను ప్రోత్సహించేందుకు కబ్‌లో కో కన్వీనర్‌ పదవి తీసుకొచ్చామన్నారు. కమిటీలు వేసే ముందు స్థానిక నాయకత్వంతో మాట్లాడాలని సూచించారు. 90శాతం కుటుంబ సారథులు, 82శాతం బూత్‌లు, 80శాతంయూనిట్లు, 80శాతం క్లస్టర్లు పూర్తయ్యాయని.. అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. పనిచేసే వారికే ఆయా కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.


జూలై 5 నాటికి కమిటీలన్నీ పూర్తి చేయాలన్నారు. కష్టపడిన కార్యకర్తలను మరవొద్దని అందరినీ కోరుతున్నామన్నారు. వారిని విస్మరించకుండా ఉండేందుకే పరిశీలకులను వేశామని చెప్పారు. కుప్పంలో సంస్థాగత నిర్మాణం వల్లే చంద్రబాబు వరుసగా విజయం సాధిస్తున్నారని.. కచ్చితంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..

నిర్ణేతలు ప్రజలు..

ఎవరూ శాశ్వతం కాదు. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ పిలుపిచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ సీరియ్‌సగా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 164 మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచారు. మంత్రివర్గంలో 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారు. ఇక్కడున్న వారిలో చాలా మంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైన వారూ, అక్రమ కేసులు నమోదైన వారు, జైలుకెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇవాళ సెల్యూట్‌ కొడుతున్న పోలీసులే.. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించారు. పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే పట్టించుకోలేదు. మనం మాత్రం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి. మొన్న ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడాన్ని వెళ్లినప్పుడు పొగాకు రైతుల సమస్య గురించి తెలుసుకున్నాను. వెంటనే చంద్రబాబుతో పాటు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. ఈ రోజు నేను ఒక్క పెట్టుబడి తీసుకొచ్చేందుకే అహర్నిశలు కష్టపడుతున్నా. మన నియోజకవర్గ పని కోసం ఇంకెంత కష్టపడాలి? మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. పార్టీయే మనకు సుప్రీం.. దేశం, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే. అందుకే ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నిర్మించాలని చెప్పాం. జాతీయ స్థాయిలో బీజేపీకి తప్ప ఇంత పెద్ద కార్యాలయం మరే పార్టీకి లేదు. మనది ఒక వ్యవస్థ.


సీనియర్ల అనుభవం, యువత శక్తి జోడించాలి..

సీనియర్ల అనుభవాన్ని, యువత శక్తినీ జోడించాల్సిన అవసరముంది. సీనియర్లే నాలుగు దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దామాషా ప్రకారం పదవులివ్వాలి. అందరినీ కలుపుకొని పోవాలి. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం బాగా చేసిన వారిలో మంత్రి నిమ్మల రామానాయుడు నంబర్‌వన్‌గా ఉన్నారు. మంగళగిరి ఐదో స్థానంలో ఉంది. మనలో పోటీతత్వం రావాలి. బాగా పనిచేసిన కార్యకర్తలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించాలి. నా నియోజకవర్గ పర్యటనలో ముందుగా బాగా పనిచేసిన కార్యకర్తలను సత్కరిస్తాం. నెల పాటు తు.చ. తప్పకుండా అందరం డోర్‌ టు డోర్‌ వెళ్లి విజయవంతం చేద్దాం.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా..

సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తల్లికి వందనం అమలు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకుని, అహర్నిశలు కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నీ చేశామని చెప్పడం లేదు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

Updated Date - Jun 30 , 2025 | 05:39 AM