TDP Mahanadu: తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం 6 శాసనాలు
ABN , Publish Date - May 28 , 2025 | 05:15 AM
పార్టీ భవిష్యత్తు దృష్ట్యా మహానాడులో ఆరు శాసనాలను ప్రతిపాదించిన లోకేశ్, ప్రజలతో పాటు కార్యకర్తల భవితవ్యాన్ని మార్చేందుకు కొత్త ప్రణాళికలు ప్రకటించారు. టీడీపీని వచ్చే 40 ఏళ్ల పాటు ముందుకు నడిపించే మార్గసూచిగా ఈ శాసనాలు కీలకమని చెప్పారు.
మహానాడులో లోకేశ్ ప్రతిపాదన
అన్ని రంగాల్లో తెలుగువారు ముందుండాలి
యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తల కోసం ప్రణాళికల రూపకల్పన
ఈ మార్గాన్నే ఎంచుకోవాలని పిలుపు
(మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)
మారుతున్న కాలానికి, అవసరాలకు, ఆలోచనా విధానానికి అనుగుణంగా ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇందుకోసం మహానాడులో ఆరు శాసనాలను ప్రతిపాదించారు. కడప మహానాడు వేదికపై తొలిరోజు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తబలం గొప్పది. కుల, మత, ప్రాంతీయ అజెండాలతో ఎన్నో పార్టీలు పుట్టినా తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన టీడీపీ. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పార్టీని మరో 40ఏళ్లు నడిపించడానికి కీలక నిర్ణయాలపై చర్చించాలి. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చింది. దీనికోసం ‘తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత’ అనే ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నాను. ఈరోజు మేమంతా ఈవేదిక మీద ఉన్నామంటే దానికి కారణం టీడీపీ కార్యకర్త చెమట చుక్కలే. కార్యకర్తలు.. నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగండి.

టీడీపీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీకి లేనివిధంగా కోటి మంది సభ్యత్వం టీడీపీకే సొంతం. కార్యకర్తలను ఆదుకునేందుకు, ఆర్థిక స్వాతంత్య్రం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ ఆరు శాసనాలు కీలకమైనవి. ఇవి చెప్పిన మార్గాన్నే మనం ఎంచుకోవాలి. నేను ప్రతిపాదిస్తున్నాను. మీరు బలపరచండి’ అని లోకేశ్ కోరారు.
ఇవీ శాసనాలు తెలుగుజాతి విశ్వఖ్యాతి
తెలుగువారికి టీడీపీ వల్ల ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి సీఎం అయ్యారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది మన చంద్రన్న. అన్ని రంగాల్లో మన తెలుగువారు ముందుండాలి. దీనిని అజెండాగా పెట్టుకుని మనమంతా పనిచేయాలి.
యువగళం
పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నాం. కూటమిలో 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది తొలిసారి గెలిచినవారే. కేబినెట్‌లో 25 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా నియమితులయ్యారు. గతంలో ప్రముఖ పరిశ్రమలను తరిమేస్తే.. కూటమి వచ్చాక అనేక పరిశ్రమలను తీసుకొచ్చాం. మెగా డీఎస్సీ ద్వారా వచ్చే నెలలోగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలిస్తే దూసుకుపోతారు. అన్ని రంగాల్లో ఉపాధి కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం.
స్త్రీ శక్తి
ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లుల్ని అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటికి గెంటేశారు. ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్, యూనివర్సిటీ ఇచ్చింది టీడీపీ. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ పదవుల్లో సమాన బాధ్యత, భద్రత కల్పించాలి.
పేదల సేవలో- సోషల్ రీఇంజనీరింగ్
పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్ర్తాలు, పక్కాగృహాలు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రూ.4 వేల పెన్షన్‌ను చంద్రన్న ఇస్తున్నారు. డ్వాక్రా, దీపం, అన్నక్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్నే. వచ్చే నెలలో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నాం. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది టీడీపీతోనే. ప్రతి వర్గానికీ న్యాయం చేసేందుకు సోషల్ రీఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
అన్నదాతకు అండగా..
రైతులు లేకుంటే సమాజమే లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే పార్టీ టీడీపీ. అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రన్న వరకు రైతుల జీవితాలను మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీలు, హార్టికల్చర్‌ను ప్రోత్సహించింది టీడీపీనే. అన్నదాతకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పొగాకు, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు చంద్రన్న. బంగారం పండించే శక్తి మన రైతుల వద్ద ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలు చేయాలి.

కార్యకర్తే అధినేత
ఇది నా మనసుకు దగ్గరగా ఉండేది. అంజిరెడ్డి తాత, మంజుల, తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంజిరెడ్డిని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే తొడగొట్టి, మీసం మెలేసి ఎదురు తిరిగాడు. రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి బూత్‌లోకి వెళ్లింది మంజుల. దాడి చేస్తే రక్తం కారినా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్సుకు తాళం వేసే వరకు నిలబడింది. చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. నడివీధిలో నాటి పాలకులు తరిమి కొట్టారు. ఏకంగా కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ల నాయకుడికి జై చెప్పమంటే.. జై టీడీపీ జై చంద్రబాబు అని ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. అందుకే టీడీపీలో కార్యకర్తే అధినేత.
కడప మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది: పల్లా
‘నేను గతంలో కార్యకర్తగా మహానాడుకు హాజరయ్యాను. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హాజరుకావడం మరిచిపోలేని రోజు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు. కడప మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్ర దశ, దిశను మార్చే నిర్ణయాలు తీసుకోనున్నాం. టీడీపీలో బడుగు, బలహీనవర్గాలకు సముచిత స్థానం ఉం టుంది. లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుంది.’
9.40లక్షల కోట్ల పెట్టుబడులు: టీజీ భరత్
‘టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రానికి రూ.9.40కోట్ల పెట్టుబడులు తెచ్చాం. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడేవారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు ప్రత్యేకత. యువనేత లోకేశ్ ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు రాష్ట్రానికి మంచి దిశానిర్దేశాన్ని ఇస్తాయి.’
గొంతుపై కత్తిపెట్టినా : మంత్రి కొల్లు రవీంద్ర
‘గొంతుపై కత్తిపెట్టి బెదిరించినా భయపడకుండా ‘జై చంద్రబాబు- జై తెలుగుదేశం’ అన్న బలమైన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. కోటి మంది సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీడీపీ. అధికారంలోకి రాగానే చంద్రన్న బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాం. చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉంటారు’
మన ప్రత్యర్థి జిత్తులమారి నక్క: వర్ల రామయ్య
‘మన ప్రత్యర్థి జిత్తులమారి నక్క. కులం, మతం, ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. గత ప్రభుత్వంలో నిరంకుశ పాలన సాగింది. చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. ప్రజావ్యతిరేక పాలన సాగుతుండటంతో జగన్ తలరాతనే జనం మార్చివేశారు. గత ఏడాదిగా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది.’
టీడీపీతోనే మహిళా సాధికారత
టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. డ్వాక్రా సంఘాలు, వెలుగు, దీపం పథకాలను తెచ్చింది చంద్రబాబే అన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో వాటా, రిజర్వేషన్లు కల్పించింది ఎన్టీఆర్, చంద్రబాబులే అన్నారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ స్త్రీలను అగౌరవంగా, హేళనగా చూసి ఇబ్బందులు పెట్టడంతోనే వైసీపీకి పుట్టగతులు లేకుండాపోయాయని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News