Share News

Lokesh Invites Investors: ఏపీకి స్వాగతం

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:43 AM

ఆంధ్రప్రదేశ్‌లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రిస్టేజ్‌, సత్వ గ్రూపుల అధినేతలను ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు. బెంగళూరులో విభిన్న రంగాల పారిశ్రామిక నిపుణులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఎంజీ రోడ్డులోని ప్రిస్టేజ్‌ కార్యాలయాన్ని సందర్శించారు.

Lokesh Invites Investors: ఏపీకి స్వాగతం

  • స్థిరాస్తి రంగంలో పెట్టుబడులతో రండి

  • ప్రిస్టేజ్‌, సత్వ అధినేతలకు లోకేశ్‌ ఆహ్వానం

  • బెంగళూరులో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ

  • సిలికాన్‌ వ్యాలీలా 6 నెలల్లో క్వాంటమ్‌ వ్యాలీ

  • ఐటీ హబ్‌గా విశాఖ మహానగరం

  • ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూస్తోంది

  • పెట్టుబడులకు ఇదే సరైన సమయం: లోకేశ్‌

బెంగళూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రిస్టేజ్‌, సత్వ గ్రూపుల అధినేతలను ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు. బెంగళూరులో విభిన్న రంగాల పారిశ్రామిక నిపుణులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఎంజీ రోడ్డులోని ప్రిస్టేజ్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ గ్రూప్‌ చైర్మన్‌ ఇర్ఫాన్‌ రజాక్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయాద్‌ నోమాన్‌తో చర్చలు జరిపారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని లోకేశ్‌ వారికి వివరించారు. రాజధాని అమరావతి పనులు రూ.65 వేల కోట్లతో శరవేగంగా సాగుతున్నాయని, గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతోందని తెలిపారు. రిలయన్స్‌, రెన్యూ వంటి సంస్థలు రాయలసీమలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. గత ఏడాదిలో రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలెపర్స్‌ కంపెనీగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన ప్రిస్టేజ్‌ను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్లగ్‌ అండ్‌ ప్లే మోడల్‌, ప్రీ-బిల్డ్‌ మౌలిక సదుపాయాల్లో పేరొందిన సత్వ గ్రూప్‌ ఎండీ విజయ్‌ అగర్వాల్‌తోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అనుకూలంగా ఉందని, పెట్టుబడులు పెట్టాలని కోరారు. రియల్‌ ఎస్టేట్‌, వాణిజ్య, రెసిడెన్షియల్‌, విద్య, ఉన్నత విద్య, డీ అండ్‌ బీ సొల్యూషన్స్‌, హాస్పిటాలిటీ, రిటైల్‌, కో-లివింగ్‌, కో-వర్కింగ్‌ అండ్‌ డేటాసెంటర్‌లు ఏపీకి రానున్నాయని వివరించారు. సత్వ గ్రూప్‌ ఎండీ సానుకూలంగా స్పందించారు. విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 30 ఎకరాల్లో దాదాపు 1,500 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. వీటివల్ల 2,500 ఉద్యోగాలు దక్కుతాయి.


అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ గేమ్‌ చేంజర్‌

అమరావతిలో మరో ఆరు నెలల్లో క్వాంటమ్‌వ్యాలీ అందుబాటులోకి వస్తుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. జీసీసీ గ్లోబల్‌ లీడర్లతో రోడ్‌షోలో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. మాన్యతా ఎంబసీ బిజినెస్‌ పార్క్‌లో పలువురు ప్రముఖులతో చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్‌వైపు చూస్తోందని, పెట్టుబడులకు ఇదే సరైన సమయమని అన్నారు. అమరావతిలో మరో ఆరు నెలల్లో క్వాంటమ్‌ వ్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు. ఇది భారత సాంకేతిక విప్లవంలో గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందని చెప్పారు.. ఈ రోడ్‌షోలో లోవ్స్‌ ఇండియా ఎండీ అంకూర్‌ మిట్టర్‌, రోల్స్‌ రాయ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరిహరన్‌ గణేశన్‌, షాక్స్‌ గ్లోబల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మధు నటేశన్‌, జేసీ పెన్నీ ఇండియా ఎండీ కౌశిక్‌ దాస్‌, లులు లెమన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సైఫ్‌ అహ్మద్‌ షరీఫ్‌, విక్టోరియా సీక్రెట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వసుధారిణి శ్రీనివాసన్‌, నాసుని ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ పెద్ద రెడ్డెప్ప, ఏఎన్‌జే సీఎ్‌ఫవో కవితా రమేశ్‌, ఆస్ట్రల్‌ ల్యాబ్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివానంద్‌ ఆర్‌ కోటేశ్వర్‌, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సీఈవో లలితా ఇంద్రకంటి పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 04:45 AM