Former IAS K. Dhanunjaya Reddy: మద్యం ఓ కల్పిత కేసు
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:28 AM
మద్యం కుంభకోణం.. అనేది ఓ కల్పిత కేసు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెబుతున్నా. ఈ కేసులో పత్రికలకు లీకులు ఇచ్చి సిట్ అధికారులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు
న్యాయాధికారి ముందు ధనుంజయరెడ్డి వాదన
విజయవాడ, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘‘మద్యం కుంభకోణం.. అనేది ఓ కల్పిత కేసు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెబుతున్నా. ఈ కేసులో పత్రికలకు లీకులు ఇచ్చి సిట్ అధికారులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. నా కుటుంబం బయటతిరగడానికి భయపడుతోంది.’’ అని మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి ఏసీబీ కోర్టులో వాదన వినిపించారు. ధనుంజయరెడ్డి రిమాండ్ పొడిగింపు నిమిత్తం పోలీసులు మంగళవారం ఆయనను కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుహాల్లో న్యాయాధికారికి తన ఆవేదనను చెప్పుకొన్నారు. ‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. కొంతమంది భవనాలు, టెర్ర్‌సలు ఎక్కి ఫొటోలు తీస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే పైనుంచి ఆదేశాలున్నాయని, మేం ఏం చేయగలం? అని సమాధానం చెబుతున్నారు. మేం ఇప్పటికే జైల్లో ఉన్నాం. ఇంకేం చేస్తాం?. మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. మా కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు వాడుతున్నానని పత్రికల్లో రాయించారు. నాకు శాంత్రో కారు, నా భార్యకు మరో కారు ఉన్నాయి. ఈ రెండు ఖరీదైన కార్లా?. లిక్కర్ పాలసీ విషయంలో నేను ఐదుగురితో మాట్లాడినట్టు పత్రికల్లో రాశారు. వారిలో ముగ్గురిని నేను కలిశాను. మిగిలిన ఇద్దరు ఎవరో తెలియదు. వాళ్లను నేనెప్పుడూ చూడలేదు. దీనిపై ఏ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించినా సిద్ధంగా ఉన్నా. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సిట్ ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి వార్తలు రాయిస్తోంది. గత 20 రోజుల పత్రికలను చదివితే చార్జిషీటును చదవాల్సిన అవసరం లేదు. కోర్టుకు మాకు మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. మరొకరికి చెప్పుకొనే అవకాశం అంతకన్నా లేదు. అందుకే మీకు మా బాధను చెప్పుకొంటున్నాం. ఈ విషయాలన్నీ చెప్పాను కాబట్టి ‘సిట్’ నన్ను ఇంకా టార్గెట్ చేస్తుంది. దానికి నేను సిద్ధమే’ అని అన్నారు. దీనిపై న్యాయాధికారి పి.భాస్కరరావు సిట్ దర్యాప్తు అధికారి శ్రీహరిబాబును వివరణ కోరారు. తాము ఎలాంటి సమాచారాన్నీ లీక్ చేయడం లేదని స్పష్టం చేశారు. సిట్‌కు సంబంధించిన ప్రతి సమాచారం గోప్యంగానే కోర్టుకు అందజేస్తున్నామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News