Liquor Scam: కార్లు, ట్రక్కుల్లో కోట్లు తరలించారు
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:39 AM
మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ-38), ఆయన సన్నిహితుడు చెరుకూరు వెంకటేశ్‌నాయుడు(ఏ-34)తో కలిసి 2024లో ఓట్లు కొనేందుకు లిక్కర్ స్కాం ముడుపులను పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది.
ఒంగోలు, తిరుపతి ప్రాంతాలకు రూ.250 కోట్లు
2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచారు
తాడేపల్లి, హైదరాబాద్ నుంచే డబ్బు సరఫరా
చెవిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ-38), ఆయన సన్నిహితుడు చెరుకూరు వెంకటేశ్‌నాయుడు(ఏ-34)తో కలిసి 2024లో ఓట్లు కొనేందుకు లిక్కర్ స్కాం ముడుపులను పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. హైదరాబాద్, తాడేపల్లి నుంచి కార్లు, లారీల్లో రూ.250 కోట్లు ఒంగోలు, తిరుపతి ప్రాంతాలకు తరలించినట్లు చెవిరెడ్డి రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఒంగోలులో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. తన ఖర్చులతోపాటు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు ఈ సొమ్ము వెచ్చించారని వెల్లడించింది. చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి.. తుడా చైర్మన్‌గా అధికారిక వాహనంలో డబ్బు తరలించినట్లు తెలిపింది. చెవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వద్ద గన్‌మన్‌గా పనిచేసిన ప్రత్యక్ష సాక్షి బీఎన్‌ఎ్‌సఎస్ 183కింద న్యాయాధికారి ఎదుట ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపింది. ‘చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వెంకటేశ్‌నాయుడి నివాసం క్రిషి వ్యాలీ అపార్ట్‌మెంట్ నుంచి.. తాడేపల్లిలోని ల్యాండ్‌మార్క్ విల్లా నుంచి పలుమార్లు ఒంగోలు, తిరుపతికి డబ్బులు తరలించారు. మోహిత్‌రెడ్డి తుడా చైర్మన్ హోదాలో వినియోగించిన తెల్ల ఫార్చ్యూనర్ కారు(ఏపీ39 బీవీ3259)లో 2024 ఫిబ్రవరి 1న, మరోమారు 20న తాడేపల్లిలోని ప్రణయ్ ప్రకాశ్ ఇంటి నుంచి సుమారు 8-9 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో తీసుకుని తిరుపతికి తరలించారు.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డబ్బు రవాణా జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎన్నికల సమయంలో తరలిస్తుండగా గరికపాడు చెక్ పోస్టు వద్ద పట్టుబడిన చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ లారీ(ఏపీ03 టీఏ4566)లోని 8.37 కోట్లు సైతం చెవిరెడ్డి ఎన్నికల ఖర్చు కోసం వెంకటేశ్‌నాయుడు పంపినవే. క్రిషివ్యాలీ అపార్ట్‌మెంట్‌లోని తన నివాసాన్ని వెంకటేశ్ మద్యం ముడుపుల సేకరణ కేంద్రంగా మార్చేశారు. 2024 ఏప్రిల్ 27, 28న.. మే 6, 7,8తేదీల్లో నోట్లకట్టలతో నింపిన బాక్సులను ఎద్దుల నవీన్ కృష్ణ(ఏ-36),హరీశ్(ఏ-37)కు అందజేశాడు. ఈనగదును చెవిరెడ్డి విజయం కోసం పంపిణీ చేశారు.’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మోహిత్‌రెడ్డి అధికారిక వాహనం పలుమార్లు తిరుపతి-తాడేపల్లి మధ్య.. హైదరాబాద్-తిరుపతి మధ్య తిరిగినట్లు టోల్ గేట్లలో రికార్డులు లభించినట్లు సిట్ వెల్లడించింది. హైదరాబాద్‌లోని వెంకటేశ్‌నాయుడి ఇంటి ముందు సీసీ కెమేరాల్లోనూ ఫుటేజీ లభ్యమైంది. తుడా చైర్మన్ వాహన లాగ్ రికార్డుల్లో తిరుపతి దాటి ఆ వాహనం వెళ్లలేదని ఉంది. కానీ ఆ వాహనంలో చెవిరెడ్డి గన్‌మెన్, డ్రైవర్ ఉన్నట్లు వారి సెల్ నెంబర్ల లోకేషన్ చెబుతోంది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఆధారాల(సీడీఆర్)ను అధికారులు సేకరించారు.