Share News

Liquor Scam Fund: అధికారం కోసం అడ్డగోలు సొమ్ము

ABN , Publish Date - Sep 16 , 2025 | 03:45 AM

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో.. సింహభాగం ఓట్లు కొనేందుకు ఖర్చు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం...

Liquor Scam Fund: అధికారం కోసం అడ్డగోలు సొమ్ము

  • మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే!

  • చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ

  • రూ.3,500 కోట్ల స్కాంలో మరో కోణం తేల్చిన సిట్‌

  • ఏసీబీ కోర్టులో మూడో చార్జిషీటు దాఖలు

  • వెంకటేశ్‌ నాయుడు, బాలాజీ, నవీన్‌ పాత్రపైనా వివరణ

  • కమీషన్లు మార్చుకోవడానికే చెవిరెడ్డి డొల్ల కంపెనీలు

  • ఆఫ్రికా దేశాల్లో ‘మైనింగ్‌’లో పెట్టుబడులకు యత్నం

  • జింబాబ్వేలో కీలక నిందితుల భేటీ

  • లావాదేవీలు, ఆస్తుల సమాచారం రాబట్టేందుకు మోహిత్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్‌ వినతి

కమీషన్లు కొట్టేసేందుకే మద్యం విధానాన్ని మార్చారు. ముడుపుల సొమ్ములతో ఓట్లు కొనేసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. డబ్బు రవాణా కోసం అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒకటా... రెండా... మద్యం ముడుపుల కేసులో ఎన్నెన్నో చిత్రాలు!

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో.. సింహభాగం ఓట్లు కొనేందుకు ఖర్చు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ-38) తన అనుచరుల ద్వారా ఎన్నోసార్లు కోట్ల రూపాయలు తరలించారని విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం దాఖలుచేసిన మూడో చార్జిషీటులో పేర్కొంది. ఆ మొత్తం నుంచే ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, నెల్లూరు జిల్లా కావలి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, ఇంకొందరికి నగదు పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేగాక లిక్కర్‌ ముడుపుల సొమ్మును వైట్‌గా మార్చుకోవడానికి తిరుపతి కేంద్రంగా చెవిరెడ్డి పలు షెల్‌ కంపెనీలు సృష్టించారని.. వాటి ద్వారా ఎలాంటి లావాదేవీలూ జరపలేదని కోర్టుకు వివరించింది. చెవిరెడ్డి అక్రమాలకు ఆయన వ్యాపార భాగస్వామి వెంకటేశ్‌ నాయుడు(ఏ-34), అనుచరులు బాలాజీ కుమార్‌ యాదవ్‌ (ఏ-35), ఎద్దల నవీన్‌ కృష్ణ (ఏ-36) ఏ విధంగా సహకరించారో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సిట్‌.. అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరు ప్రస్తావించింది. ఆగస్టు 11న దాఖలు చేసినరెండో చార్జిషీటు(మొదటి అనుబంధ చార్జిషీటు)లో మరిన్ని కీలక విషయాలు తెలిపింది. మద్యం సిండికేట్‌ ద్వారా అందుకున్న లంచం డబ్బులు స్వీకరించడం నుంచి తరలించడం వరకూ వెంకటేశ్‌ ఎలాంటి పాత్ర పోషించాడో కోర్టుకు సిట్‌ తెలిపింది. కేవలం 6 నెలల్లో అతడి నివాసానికి సుమారు 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకూ చేర్చడం.. ఆ సొమ్మును చెవిరెడ్డి చెప్పిన వ్యక్తులకు అందజేసిన వైనాన్ని వివరించింది. డబ్బులు తరలించడంలో బాలాజీకుమార్‌ యాదవ్‌ చురుగ్గా వ్యవహరించినట్లు తేల్చింది. చెవిరెడ్డి, ఇతర కీలక నిందితులైన రాజ్‌ కసిరెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు, ఎద్దల నవీన్‌కృష్ణ, హరీశ్‌, మోహిత్‌రెడ్డి తదితరులు కలిసి అక్రమంగా ఆర్జించిన సొమ్మును.. తాడేపల్లిలో ల్యాండ్‌ మార్క్‌ అపార్ట్‌మెంట్లో డి. చరిష్మా నుంచి ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని డెన్‌లో దాచి.. ప్రణయ్‌ ప్రకాశ్‌ను కాపలాగా పెట్టి.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎన్నికల్లో వినియోగించినట్లు వివరించింది. చెవిరెడ్డి ఆదేశాలతో తాడేపల్లి నుంచి అట్టపెట్టెల్లో నోట్ల కట్టలను తిరుపతి, పొదిలి, ఒంగోలు, కావలి తదితర ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డికి నవీన్‌ కృష్ణ, బాలాజీ కుమార్‌ యాదవ్‌ 2024 మార్చి మూడోవారంలో డబ్బు అందజేసినట్లు కాల్‌ డేటాతో సహా రుజువైందని సిట్‌ వివరించింది.


దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి కూడా నిధులు అందినట్లు తేల్చింది. 2023-24 మధ్య మొత్తం రూ.112 కోట్లను చెవిరెడ్డి ఆధ్వర్యంలో తరలించినట్లు తెలిపింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కృష్ణ వ్యాలీ అపార్ట్‌మెంట్లో వెంకటేశ్‌నాయుడి నివాసంలో నగదు తీసుకుని ఒంగోలులో వైసీపీ వలంటీర్లకు అందజేసినట్లు పేర్కొంది. పీవీ డిస్టిలరీస్‌, బీ9బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు ఇందులో ఎక్కువ ముడుపులు అందజేసినట్లు తెలిపింది. తుడా చైర్మన్‌ హోదాలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి వినియోగించిన అధికార వాహనం ఫార్చూనర్‌ ఏపీ39 బీవీ 3259లో డబ్బులు తీసుకెళ్లినట్లు టోల్‌గేట్ల వివరాలతోపాటు వివరించింది. వెంకటేశ్‌నాయుడు, రాజ్‌ కసిరెడ్డి పలుమార్లు హైదరాబాద్‌లో జరిపిన సమావేశాలను లొకేషన్లతో పాటు టవర్‌ డంప్‌ల ద్వారా గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరులో 2023-24లో లిక్కర్‌ గ్యాంగ్‌ సభ్యులు సైమన్‌ ప్రసన్‌, తుకేకుల ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పలుమార్లు సమావేశమై కలెక్షన్లు, డబ్బు బదిలీని సమన్వయం చేసినట్లు ఆధారాలు సైతం అందజేసింది. ఈ మొత్తం ముడుపుల వ్యవహారాలు, నగదు లావాదేవీలు, కొనుగోలు చేసిన ఇతర ఆస్తులకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు మోహిత్‌రెడ్డి(ఏ-39)ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్‌ కోరింది.

12 షెల్‌ కంపెనీలు.. 6 ఒకే అడ్ర్‌సలో..

మద్యం ముడుపుల సొమ్మును మార్చుకోవడానికి చెవిరెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుతో ఏర్పాటు చేసిన 12 షెల్‌ కంపెనీల్లో ఆరు ఒకే అడ్ర్‌స(చెవిరెడ్డి ఉండే తుమ్మలగుంట)లో ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. వాటిలో ఎలాంటి లావాదేవీలూ జరగలేదని తేల్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చెవిరెడ్డి కొనుగోలు చేసిన ఆస్తుల అసలు విలువ తేల్చడం, కొనుగోలుకు తీసుకొచ్చిన నిధుల వివరాలు రాబట్టడం, ఆయన విస్తృత నెట్‌వర్క్‌ను చేధించడం, లిక్కర్‌ ముడుపుల బాగోతాన్ని వెలికితీసే ప్రయత్నాల్లో తామున్నట్లు చెప్పింది. కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో ఓ జాబితాను కూడా కోర్టుకు సమర్పించింది. చెవిరెడ్డి సన్నిహితుడు బాలాజీ కుమార్‌ యాదవ్‌ తండ్రి కుళ్లాయప్ప పేరుతో తిరుపతి, చిత్తూరులో కొన్న ఆస్తుల వివరాలు చూపించి.. వాటిని కొనేంత ఆర్థిక సామర్థ్యం ఆయనకు లేదంది. కేవీఎస్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ బ్యాంకు ఖాతాకు 2022 అక్టోబరు వరకు పలువురు వ్యక్తులు, సంస్థలు నగదు బదిలీ చేసినట్లు సిట్‌ గుర్తించింది. మొదట థర్డ్‌ పార్టీ వ్యక్తులు/సంస్థల ఖాతాల నుంచి మోహిత్‌ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేసి, అక్కడి నుంచి కేవీఎస్‌ ఇన్‌ఫ్రాకు మళ్లించినట్లు తేలింది. లిక్కర్‌ ముడుపులతో చెవిరెడ్డి, మోహిత్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, వారి కంపెనీల పేరిట భూములు, ప్లాట్లు సహా స్థిరాస్తులు కొన్నారు. వారికి నిధులు ఎవరెవరు పంపారు.. చెవిరెడ్డి కుటుంబంతో వారికున్న సంబంధాలేంటి తదితర వాటిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని సిట్‌ పేర్కొంది.


నేరపూరిత కుట్రలో నకిలీ మొబైల్‌ కనెక్షన్లు..

రాజ్‌ కసిరెడ్డితో పాటు పలువురు నిందితులు తమ పేర్లతో కాకుండా మారు పేర్లతో సిమ్‌ కనెక్షన్లు తీసుకున్నట్లు సిట్‌ గుర్తించింది. కసిరెడ్డి వాడిన సిమ్‌ రాజమండ్రికి చెందిన లీలాప్రసాద్‌ పేరుతో ఉందని, కోసంగి చినబాబు పేరుతో మరొకటి వాడినట్లు తేల్చింది. వాసుదేవరెడ్డి(ఏ2) చిప్పిరి మహబూబ్‌ బాషా, వెంకట సుబ్బారావు పేర్లతో ఉన్న సిమ్‌లు వాడారు. సజ్జల శ్రీధర్‌ రెడ్డి ఎనుముల వెంకటనారాయణ పేరుతో, బూనేటి చాణక్య ఇమ్మానుయేల్‌, ప్రసన్న లక్ష్మి, సునీల్‌ కుమార్‌ పేర్లతో, సైఫ్‌ అహ్మద్‌.. శరణమ్మ పేరుతో, పురుషోత్తం వరుణ్‌.. మునగ శైలజ పేరుతో, సైమన్‌ ప్రసన్‌.. నరసింహుడు, స్వప్న పేర్లతో సిమ్స్‌ తీసుకుని వినియోగించినట్లు తెలిపింది. తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి అక్రమ కార్యకలాపాలకు వాడారని తేల్చింది. మొత్తం 48 మంది సాక్షుల వాంగ్మూలాలను జత చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు 4 రోజుల ముందు అంటే.. ఆ ఏడాది మే 9న గరికపాడు చెక్‌పోస్టు వద్ద రూ.8,36,73,000 సీజ్‌ చేశారని.. హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి వెళ్తుండగా ఆ వాహనాన్ని తనిఖీచేసినప్పుడు ఆ సొమ్ము, కుట్రకోణం బయటపడ్డాయని సిట్‌ తెలిపింది.

లిక్కర్‌ సొమ్ముతో ఆఫ్రికాలో మైనింగ్‌ పెట్టుబడులు

లిక్కర్‌ ముడుపులను ఆఫ్రికా దేశాలకు తరలించిన విషయాన్ని ప్రణయ్‌ ప్రకాశ్‌ వాంగ్మూలం స్పష్టం చేస్తోందని సిట్‌ తెలిపింది. ‘బూనేటి చాణక్య ఆదేశాలతో ప్రణయ్‌ ప్రకాశ్‌ తొలుత దుబాయ్‌ నుంచి జింబాబ్వే, టాంజానియా దేశాలకు వెళ్లాడు. అక్కడి నుంచే జాంబియా, ఇతర ఆఫ్రికన్‌ దేశాల్లో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాడు. అక్కడ నెల రోజులు మకాం వేసి.. మైనింగ్‌ వెంచర్లలో పెట్టుబడుల అవకాశాల గురించి ఆరా తీశాడు. 2025 జనవరిలో కూడా చాణక్య ఆదేశాల మేరకు ప్రణయ్‌ ప్రకాశ్‌ రెండోసారి విదేశీ పర్యటన చేపట్టాడు. ఈసారి అతని వెంట భూ విజ్ఞాన శాస్త్రవేత్త ఘోర్పడె మనోహరరావు కూడా ఉన్నారు. ఇద్దరూ జింబాబ్వే వెళ్లి సుమారు 17 రోజులు ఉన్నారు. అక్కడ వీరిని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, వెంకటేశ్‌నాయుడు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని లిక్కర్‌ ముడుపులను విదేశాలకు తరలించి పెట్టుబడులు పెట్టేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ నిందితులంతా అక్కడ కలిసినట్లు ఇది స్పష్టం చేస్తోంది’ అని చార్జిషీటులో వివరించింది.


చెరుకూరు వెంకటేశ్‌నాయుడు (ఏ-34)

లిక్కర్‌ సిండికేట్‌ ద్వారా అందిన ముడుపులను పంచడం, దాచడంలో ఇతడిది కీలక పాత్ర. 2024 అసెంబ్లీ/సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఏ-1 కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏ-8 బూనేటి చాణక్య, ఏ-30 పైలా దిలీ్‌పల నుంచి రూ.8-9 కోట్ల చొప్పున భారీ మొత్తాలు వెంకటేశ్‌నాయుడికి అందాయి. ఈ మొత్తమే రూ.200-250 కోట్ల వరకు ఉంటుంది. ఆ నగదును సరఫరా చేయడానికి ముందు తన ఇంట్లోనే సురక్షితంగా దాచిఉంచేవాడు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి( ఏ-38)కి ఆ నగదును చేర్చేవాడు. ఆ మొత్తాన్ని చెవిరెడ్డి ఎన్నికల ప్రలోభాలకు ఉపయోగించేవారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి నగదు రవాణాలో ఎద్దల నవీన్‌కృష్ణ(ఏ-36)తో కలిసి కీలక పాత్ర పోషించాడు. వెంకటేశ్‌ సహకారం లేకుండా ఇంత భారీ మొత్తాలు సాఫీగా సరఫరా అయ్యేవి కావు.

బాలాజీకుమార్‌ యాదవ్‌ (ఏ-35)

చెవిరెడ్డి తరఫున అక్రమ మద్యం ముడుపుల రవాణాలో బాలాజీ క్రియాశీల పాత్ర పోషించాడు. గత ఏడాది ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ.8-9 కోట్ల భారీ కన్‌సైన్‌మెంట్లను ఎద్దల నవీన్‌ కృష్ణ (ఏ-36), హరీశ్‌ (ఏ-37)లతో కలిసి తరలించాడు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారులు అందించే ముడుపులని తెలిసీ సమన్వయంతో వాటి సరఫరాను సమన్వయం చేశాడు. పలువురి వాంగ్మూలాలు ఇదే ధ్రువీకరిస్తున్నాయి.

ఎద్దల నవీన్‌కృష్ణ (ఏ-36)

ఇతడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అనుచరుడు. అక్రమ నగదు తరలింపులో కేంద్ర బిందువుగా ఉన్నాడు. ముడుపుల ద్వారా అందిన మొత్తం తరలింపును ప్రత్యక్షంగా పర్యవేక్షించాడు. ఇందుకు బాలాజీకుమార్‌, హరీశ్‌ల సాయం తీసుకున్నాడు. ప్రతి ట్రిప్పులో హైదరాబాద్‌ నుంచి రూ.8-9 కోట్లు తిరుపతికి సురక్షితంగా చేర్చడంలో కీలక పాత్రధారి. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు సదరు నగదు కన్‌సైన్‌మెంట్లను చేరవేశాడు. గోప్యంగా, సురక్షితంగా నగదు తరలించాడు. క్రిమినల్‌ కుట్రలో ఇతడికి క్రియాశీల పాత్ర ఉందని స్పష్టమవుతోంది.


చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ-38)

రాజకీయ నాయకుడైన చెవిరెడ్డి.. మద్యం ముడుపుల ప్రధాన లబ్ధిదారు.. సరఫరాదారు కూడా. వెంకటేశ్‌నాయుడు, బాలాజీకుమార్‌ యాదవ్‌, ఎడ్ల నవీన్‌ కృష్ణ, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నుంచి రూ.వందల కోట్ల ముడుపుల నగదు అందుకున్నారు. కసిరెడ్డి, ఇతర నిందితుల ద్వారా అందుకున్న సొమ్మును ఓటర్లకు పెద్దఎత్తున నగదు పంపిణీ వంటి వాటికి ఉపయోగించారు. తన కుమారుడైన మోహిత్‌రెడ్డికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) సమకూర్చిన అధికార వాహనంలో ఆ నగదు పంపిణీ చేశారు. తద్వారా అక్రమ కార్యకలాపాలకు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారు. ముడుపుల నగదు అందుకోవడం వరకే చెవిరెడ్డి పాత్ర పరిమితం కాలేదు. ఆ సొమ్మును నియోజకవర్గాల్లో పంపిణీ చేయడం కూడా ఆయన బాధ్యతే. లిక్కర్‌ సిండికేట్‌ అక్రమ పథకానికి ఆయన కీలక రాజకీయ ప్యాట్రన్‌గా, ముఖ్య కుట్రదారుగా ఉన్నారని స్పష్టమవుతోంది.

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఏ-39)

తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి 3 అధికారిక వాహనాలను (ఏపీ39 బీవీ 3259- టయోటా ఫార్చూనర్‌), ఏపీ 39 కేఏ 0697-ఎమ్‌జీ గ్లోస్టర్‌, ఏపీ 03 సీయూ 0666- టయోటా ఇన్నోవా క్రిస్టా)లను కేటాయించారు. ఆయన ఆదేశాలతోనే ఈ వాహనాల రాకపోకల వివరాలను డ్రైవర్లు లాగ్‌ బుక్స్‌లో నమోదు చేయలేదు. ఇందుకు బాధ్యులెవరు.. కుటుంబసభ్యుల పేరిట ఉన్న కంపెనీల ద్వారా జరిగిన అనుమానాస్పద నగదు లావాదేవీల వ్యవహారంలో మోహిత్‌రెడ్డి ప్రమేయాన్ని తెలుసుకునేందుకు ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 16 , 2025 | 03:45 AM