Share News

Bail Arguments Postponed: లిక్కర్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:01 AM

మద్యం కుంభకోణంలో 12 మంది నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. 26వ తేదీ వరకు వారి ..

Bail Arguments Postponed: లిక్కర్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

26 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు.. కసిరెడ్డి బెయిల్‌పై వాదనలు 18కి వాయిదా

  • కోర్టు హాల్‌ వద్ద వైసీపీ శ్రేణుల హడావుడి

  • అసహనం వ్యక్తం చేసిన న్యాయవాదులు

  • పోలీసులపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిందులు

విజయవాడ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో 12 మంది నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. 26వ తేదీ వరకు వారి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయవాధికారి పి.భాస్కరరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారం నుంచి ఎంపీ మిఽథున్‌రెడ్డి, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణ, విజయవాడ జిల్లా జైలు నుంచి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, పైలా దిలీప్‌, బూనేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడును వేర్వేరు వాహనాల్లో కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్‌ ఉత్తర్వులకు ముందు నిందితులు వారి సమస్యలను న్యాయాధికారికి వివరించారు. తన వెన్నెముక నొప్పికి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అవసరమని చెవిరెడ్డి చెప్పారు. కేసుకు సంబంధంలేని పోలీసులు తన తల్లిని బెదిరిస్తున్నారని పైలా దిలీప్‌ న్యాయాధికారికి తెలిపారు. కాగా, సిట్‌ అధికారులు సీజ్‌ చేసిన రూ. 11 కోట్లపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నగదు విషయంలో కోర్టు ఆదేశాలను సిట్‌ అధికారులు పాటించడం లేదంటూ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సంబంధించి పిటిషన్‌ దాఖలు చేయాలని న్యాయాధికారి వారికి సూచించారు. కాగా, రాజ్‌ కసిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను కోర్టు 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్‌పై ప్రాసిక్యూషన్‌ వాదనలు గురువారానికి టవాయిదా పడ్డాయి.

మిథున్‌తో ములాఖత్‌కు మరో ఇద్దరు లాయర్లు

ఎంపీ ీమిథున్‌రెడ్డితో ములాఖత్‌ అయ్యేందుకు మరో ఇద్దరు న్యాయవాదులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నలుగురు న్యాయవాదులకు ఈ అనుమతి ఉంది. రాజమహేంద్రవరంలో ఉండే ఇద్దరు న్యాయవాదులు ములాఖత్‌ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్‌రెడ్డి తరఫున న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. స్థానికంగా ఉండే సాదిక్‌ హుస్సేన్‌, సాయి భాస్కర్‌ శంకర్‌ పేర్లను జాబితాలో చేర్చారు. తనకు ఇంటి నుంచి రోజుకు రెండుపూటల భోజనం తెచ్చేలా అనుమతి ఇవ్వాలని మిథున్‌రెడ్డి న్యాయాధికారిని కోరారు.


అటుఇటూ మూసేశారు

వైసీపీ శ్రేణులతో కోర్టు కారిడార్‌ నిండిపోయింది. మద్యం కేసు నిందితులు బుధవారం కోర్టుకు హాజరైనప్పుడు తమ అభిమాన నేతల్ని కలవడానికి నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు కోర్టు వద్దకు వచ్చారు. ఽన్యాయవాదులు,కోర్టు సిబ్బందికి మాత్రమే అనుమతి ఉండే కారిడార్‌ను కూడావారు ఆక్రమించారు.దీనిపై న్యాయవాదులు అసహనం వ్యక్తం చేశారు.

మీ అందరి సంగతి చూస్తా: చెవిరెడ్డి

‘‘అందరినీ ఒకే వాహనంలో ఎందుకు ఎక్కించడం లేదు. మేము నక్సలైట్లమా? ఎన్‌కౌంటర్‌ చేయండి. అధికారంలోకి వచ్చాక మీ అందరిసంగతి చూస్తా.’’ అంటూ ఎస్కార్ట్‌ పోలీసులపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిందులు తొక్కారు. కోర్టులో హాజరు పరిచి బయటకు తీసుకువచ్చాక నిందితులను మళ్లీ జైలుకు తరలించారు. ఈక్రమంలో మిగతా నిందితులున్న వాహనంలో కాకుండా వేరే వాహనం ఎక్కాలని వెంకటేశ్‌ నాయుడు, చెవిరెడ్డికి పోలీసులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఎస్కార్ట్‌ సిబ్బందిపై రుసురుసలాడారు. చెవిరెడ్డి వ్యాఖ్యలతో ఓ ఇన్‌స్పెక్టర్‌ మనస్తాపానికి లోనయ్యారని తెలిసింది.

Updated Date - Aug 14 , 2025 | 04:01 AM