Share News

AP Liquor Sales : ఏరులై పారిన మద్యం

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:45 AM

తగ్గేదే..లే అన్నట్లుగా మందుబాబులు పండగ రోజుల్లో పూటుగా తాగేశారు. పండగ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో రోజుకు రూ. 150 కోట్ల చొప్పున మద్యం అమ్మినట్లు అంచనా.

AP Liquor Sales : ఏరులై పారిన మద్యం

పూటుగా తాగేశారు

సంక్రాంతి 3 రోజుల్లో 400 కోట్ల అమ్మకాలు

సాధారణం కంటే 160 కోట్లు ఎక్కువ

సంక్రాంతికి ఏరులై పారిన మద్యం

గతంలో ఎప్పుడూ లేనంతగా వినియోగం

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తగ్గేదే..లే అన్నట్లుగా మందుబాబులు పండగ రోజుల్లో పూటుగా తాగేశారు. పండగ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో రోజుకు రూ. 150 కోట్ల చొప్పున మద్యం అమ్మినట్లు అంచనా. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు రూ. 80 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ పండగ మూడు రోజుల్లో అదనంగా రూ.160 కోట్లు అమ్ముడైంది. మద్యం లైసెన్సీలు భోగి రోజున రూ.210 కోట్లు, గురువారం రూ. 220 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేశారు. సంక్రాంతి కోసం తెచ్చుకున్న సరుకు దాదాపుగా ఖాళీ అయిపోవడంతోనే షాపుల యజమానులు గురువారం భారీగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు చూస్తే 6,99,464 కేసుల లిక్కర్‌, 2,29,878 కేసుల బీరు అమ్ముడైంది. ఆరు రోజుల్లో లిక్కర్‌ అమ్మకాలు సగటు కంటే లక్ష కేసులు, బీరు కూడా దాదాపు 30 వేల కేసులు పెరిగాయి. గతంలో ఎప్పుడూ సంక్రాంతికి ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని ఎక్సైజ్‌ వర్గాలు చెప్పాయి. ప్రభుత్వం మార్పు, మద్యం ధరలు తగ్గింపు, నాణ్యమైన మద్యం సరఫరా లాంటి అంశాలు మద్యం అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈసారి కోడి పందేల బరులు పెరగడం కూడా మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. ఇతర రాష్ర్టాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాకుండా ఎక్సైజ్‌ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. దీంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.


న్యూ ఇయర్‌తో పోటీపడేలా

సాధారణంగా నూతన సంవత్సరం సమయంలో అత్యధిక స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ సారి నూతన సంవత్సర వేడుకల్లోనూ భారీగా మందు తాగారు. డిసెంబరు 31న ఒక్కరోజే రాష్ట్రంలో రూ.200 కోట్ల మద్యం తాగేశారు. 2.5 లక్షల కేసుల లిక్కర్‌, 70 వేల కేసుల బీరు అమ్ముడైంది. గతంలో ఎప్పుడూ సంక్రాంతికి న్యూఇయర్‌ స్థాయిలో అమ్మకాలు ఉండవు. ఈ ఏడాది పోటీపడేలా సంక్రాంతికి మద్యం అమ్ముడైంది. మూడు రోజుల్లో సగటున రోజుకు రూ.133 కోట్ల విక్రమాలు జరిగాయి.

పెరుగుతున్న అమ్మకాలు

వైసీపీ ప్రభుత్వంలో ఓవైపు జే బ్రాండ్లు, మరోవైపు భారీ ధరల కారణంగా మందుబాబులు నాటుసారా, గంజాయి, ఎన్‌డీపీఎల్‌ వైపు వెళ్లారు. మద్యం పేరుతో వినియోగదారులను దోపిడీ చేయకూడదని కూటమి ప్రభుత్వం పాలసీలో సమూల మార్పులు చేసింది. క్వార్టర్‌ రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా లిక్కర్‌లో 23శాతం, బీరులో 38శాతం అమ్మకాలు పెరిగాయి. కానీ ప్రభుత్వం తక్కువ ధరకే మద్యం తేవడం, కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గించడంతో విలువ కేవలం 6శాతం మాత్రమే పెరిగింది. అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పరిమాణం స్థాయిలో పెరగలేదు. ఒకవేళ పాత ధరలు, పాత బ్రాండ్లే ఉండి ఉంటే ఇప్పుడు సంక్రాంతికి అమ్మిన మద్యం పరిమాణం విలువ మరో రూ. 50 కోట్లు అదనంగా ఉండేది. దానివల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 30 అదనంగా ఆదాయం వచ్చేది.

Updated Date - Jan 17 , 2025 | 03:45 AM