Share News

Liquor Commission: మద్యం సొమ్ముల గ్రౌండ్‌ ఫోర్స్‌

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:50 AM

ఏపీ 03 బీఎఫ్‌ 0099. ఇది బెంజ్‌ కారు! వైజాగ్‌కు చెందిన వ్యక్తి పేరిట ఇది రిజిస్టర్‌ అయ్యింది. కానీ అందులోని ఫోన్‌ నంబర్‌ మాత్రం జగన్‌కు బాగా సన్నిహితుడైన, ఇప్పటికే మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడిదని తేలింది.

Liquor Commission: మద్యం  సొమ్ముల  గ్రౌండ్‌ ఫోర్స్‌

  • ఫీల్డ్‌ మానిటర్స్‌...

  • ఫీల్డ్‌ మానిటరింగ్‌ ఏజెన్సీ...

  • క్యాష్‌ పికప్‌ ఎగ్జిక్యూటివ్స్‌...

  • క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌...

  • ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ...

  • గ్రౌండ్‌ ఫోర్స్‌...

ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కావు! ప్రైవేటు ఏజెన్సీలోని విభాగాలూ కావు! వైఎస్‌ జగన్‌ హయాంలో మద్యం కమీషన్లను ఫిక్స్‌ చేసి, వాటిని వసూలు చేసి, డబ్బును ఒకచోట భద్రపరిచి, తిరిగి ‘నిర్దిష్ట’ గమ్యస్థానాలకు చేర్చేందుకు ‘ఏ1’ రాజ్‌ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న, ఉపయోగించుకున్న వ్యవస్థలు! ఇందులో... ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఏవో) వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైనది కావడం గమనార్హం. దీనిని కూడా ‘మద్యం స్కామ్‌’ కోసం ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.

కారు ఎవరిది?

ఏపీ 03 బీఎఫ్‌ 0099. ఇది బెంజ్‌ కారు! వైజాగ్‌కు చెందిన వ్యక్తి పేరిట ఇది రిజిస్టర్‌ అయ్యింది. కానీ అందులోని ఫోన్‌ నంబర్‌ మాత్రం జగన్‌కు బాగా సన్నిహితుడైన, ఇప్పటికే మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడిదని తేలింది.

  • రాజ్‌ కసిరెడ్డి ఆధ్వర్యంలో పలువురి సారథ్యం ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జాగ్రత్తలు

  • తాడేపల్లి కేంద్రంగా ‘క్యాష్‌ డీలింగ్స్‌’

  • ఫ్లాటు అద్దెకు తీసుకున్న ప్రణయ్‌ ప్రకాశ్‌

  • అక్కడికే అట్టపెట్టెల్లో లక్షల్లో డబ్బులు

  • చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు

  • వైసీపీ ఓటమితో అందరిలోనూ గుబులు

  • ఫోన్లు తీసేసుకున్న రాజ్‌ కసిరెడ్డి

  • ఆఫ్రికాలో కంపెనీపై ప్రణయ్‌తో చెవిరెడ్డి చర్చలు వాంగ్మూలంలో కీలక వివరాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): మద్యం ముడుపుల వసూలు నుంచి వాటిని గమ్యస్థానం చేర్చే దాకా... అంతా ఒక పకడ్బందీ వ్యవస్థ! కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఒక ‘గ్రౌండ్‌ ఫోర్స్‌’ పని చేసింది. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపులు ఎన్నికలముందు నేరుగా ‘తాడేపల్లి’లోని ఒక ఫ్లాటుకు చేరాయి! అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులకు కార్లలో తరలి వెళ్లాయి. ఈ ‘క్యాష్‌ హ్యాండ్లింగ్‌’లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌! రాజ్‌ కసిరెడ్డి (ఏ1) ఏర్పాటు చేసుకున్న బృందంలోని ప్రణయ్‌ ప్రకాశ్‌... ఈ కేసులో దర్యాప్తు ప్రారంభం కాగానే విదేశాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు చెక్కేశారు. ‘సిట్‌’ ఆయనను ఇక్కడికి రప్పించింది. న్యాయమూర్తి ముందు ప్రకాశ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో అత్యంత కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.


కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ చెన్నై ఐఐటీ గ్రాడ్యుయేట్‌. అక్కడే తిరుపతికి చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆయనకు క్లాస్‌మేట్‌. అప్పటికే జగన్‌కు ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్‌ కసిరెడ్డితో కిరణ్‌కు సాన్నిహిత్యం ఉంది. దీంతో తనకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కిరణ్‌ను ప్రణయ్‌ కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులో కొలువు ఇప్పిస్తానంటూ ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఏవో)లో ప్రణయ్‌ని చేర్పించాడు. విశాఖలోని ఎఫ్‌ఏవో కాల్‌ సెంటర్‌లో సుమారు వందమంది పని చేసేవారు. అంతకుముందు హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి కార్యాలయంలో కూడా ప్రణయ్‌ రెండు నెలలు పని చేశారు. ముడుపుల సమాచారాన్ని పక్కాగా సేకరించి, ఆ కంపెనీలకు మాత్రమే మద్యం ఆర్డర్లు వెళ్లేలా ఏర్పాటు చేసిన ‘ఫీల్డ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ’ను ప్రణయ్‌కి అప్పగించారు. ఆయనకు పీకే కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ప్రతి నెలా జీతం వచ్చేది. డేటా ఆపరేటర్‌ సైఫ్‌ ద్వారా సమాచారం సేకరించడం, ఎక్సైజ్‌ అధికారితో సత్యప్రసాద్‌ సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు ప్రణయ్‌ నిర్వహించారు.


వైసీపీ ఓటమితో జాగ్రత్తలు...

ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే రాజ్‌ కసిరెడ్డి బృందం జాగ్రత్త పడింది. ప్రణయ్‌ ప్రకాశ్‌తోపాటు వేణు, లీలా డిస్టిలరీస్‌ వ్యవహారాలు చూసిన వరుణ్‌ పురుషోత్తం, వెంకటేశ్‌ నాయుడు తదితరులను హైదరాబాద్‌లోని తన ఆఫీసుకు పిలిపించారు. అప్పటిదాకా వాళ్లు వాడిన ఫోన్లను తీసేసుకున్నారు. ప్రణయ్‌ తనకు సంబంధించి ఐఫోన్‌లు 2, శామ్‌సంగ్‌ ఫోన్‌ ఒకటి అక్కడే అప్పగించారు.


చెవిరెడ్డితో చర్చలు టూర్లు

వైసీపీ ఓటమి తర్వాత ప్రణయ్‌లోనూ ఆందోళన మొదలైంది. దీని గురించి చాణక్యను అడగ్గా మరేం ఫర్వాలేదు. దుబాయ్‌కి వచ్చేసెయ్‌. ఇబ్బంది ఉండదు’ అని చాణక్య టికెట్‌ కూడా బుక్‌ చేశారు. గత ఏడాది జూన్‌లోనే ప్రణయ్‌ దుబాయ్‌ చేరుకున్నారు. ఆ తర్వాత వరుణ్‌ కూడా అక్కడికే వచ్చారు. ముగ్గురూ ఒకే ఫ్లాట్‌లో ఉన్నారు. ఆ తర్వాత జాంబియాలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మైనింగ్‌ కంపెనీ పెడతారని, అక్కడికి వెళితే మంచి జీతంతోపాటు షేర్లు కూడా ఇస్తారని చాణక్య చెప్పడంతో ప్రణయ్‌ సరే అన్నారు. 2024 నవంబరులో జాంబియా చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్లు ఉండి.

సంక్రాంతి సమయంలో సొంత ఊరికి వచ్చారు. అప్పుడే... సీఐడీ నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. దీంతో భయపడిపోయిన ప్రణయ్‌... థాయ్‌ల్యాండ్‌కు, అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయారు. అక్కడ ఉండగానే... ఒకసారి చెవిరెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఆఫ్రికాలో కంపెనీ పెట్టేందుకు ‘అరైజ్‌’ అనే గ్రూప్‌ ప్రతినిధులు సహకరిస్తారని చెప్పారు. ఆ తర్వాత... మైనింగ్‌ వ్యాపారం గురించి ఆరా తీసేందుకు ప్రణయ్‌ జింబాబ్వే, టాంజానియాల్లో పర్యటించారు. టాంజానియాలో ఉండగానే... చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మోహిత్‌ రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు అక్కడికి వచ్చారు. మద్యం ముడుపుల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పొద్దని ప్రణయ్‌ని చెవిరెడ్డి హెచ్చరించారు. దుబాయ్‌లో ఉంటున్నా అందరికీ సింగపూర్‌లో ఉంటున్నట్లు చెప్పుకొనేవాడు. ఇవన్నీ భరించలేక... ఈనెల 18న అక్కడి నుంచి వచ్చేసి, ‘సిట్‌’ అధికారులను కలిశారు.


‘తాడేపల్లి’కి ట్రాన్స్‌ఫర్‌

ఎన్నికల్లో ఖర్చు కోసం హైదరాబాద్‌ నుంచి డబ్బు పంపడం కష్టమవుతుందని భావించి ఏడాది ముందే దీనిని తాడేపల్లికి మార్చారు. 2023లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఫోన్‌ చేసి బూనేటి చాణక్య(ఏ8)ను పరిచయం చేసి, ఇకపై ఆయన చెప్పినట్లు చెయ్యాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలో మంచి ఇల్లు అద్దెకు తీసుకోవాలని రాజ్‌ కసిరెడ్డి పంపించే డబ్బులు తీసుకుని, చాణక్య ఎవరికి చెబితే వాళ్లకు అప్పగించాలని చెప్పారు. దీంతో ప్రణయ్‌ ప్రకాశ్‌ తాడేపల్లి నవోదయ కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి ముడుపుల డబ్బులన్నీ ఆ ఫ్లాట్‌కే వచ్చేవి. ఒక్కో విడతలో రూ.20 నుంచి 25 లక్షలు అట్టపెట్టెల్లో తీసుకొచ్చి ఇచ్చేవారు. చాణక్య నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆ డబ్బులను చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మనుషులు మదన్‌, గిరి, బాలాజీ తదితరులకు అప్పగించేవారు. ఆ డబ్బులను వేర్వేరు మార్గాల్లో నియోజకవర్గాలకు చేర్చేవారని ప్రణయ్‌ పేర్కొన్నట్లు తెలిసింది. దీనివల్ల తనకు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందేమో అని ఒక దశలో ప్రణయ్‌ ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి చెప్పగా ‘మనం వైసీపీ విజయం కోసం పనిచేస్తున్నాం. మళ్లీ ప్రభుత్వం రాగానే నీకు మంచి పొజిషన్‌ ఇస్తాం’’ అని భరోసా ఇచ్చినట్లు సమాచారం

Updated Date - Jun 21 , 2025 | 06:18 AM