Share News

వెలుగులోకి భూ కబ్జాలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:52 PM

ఆదోని అంటే గుర్తుకొచ్చేది భూ కబ్జాలే. వైసీపీ హయాంలో భూఅక్రమార్కులు పెట్రేగిపోయారు. రెవెన్యూ రికార్డులను మాయ చేశారు.

వెలుగులోకి భూ కబ్జాలు
ఆదోనిలో వివాదంగా మారిన సర్వే నంబరు 352లోని భూములు

వైసీపీ హయాంలో అక్రమాలు

ఆదోనిలో ఒకే భూమి పలువురికి రిజిసే్ట్రషన్లు

రెవెన్యూ రికార్డులు తారుమారు

సర్వే నంబరు 352 భూముల్లో అక్రమార్కుల పంజా

మంత్రులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆదోని అంటే గుర్తుకొచ్చేది భూ కబ్జాలే. వైసీపీ హయాంలో భూఅక్రమార్కులు పెట్రేగిపోయారు. రెవెన్యూ రికార్డులను మాయ చేశారు. ఒకే భూమిని పలువురు పేరిట అక్రమ రిజిసే్ట్రషన్లు చేయించారు. అప్పటి కీలక ప్రజాప్రతినిధి అండతో భూ కబ్జాలు పేట్రేగిపోయాయి. పట్టణంలో అంతర్భాగమైన సాదాపురం పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 352లో భారీఎత్తున భూ అక్రమాలు జరిగాయి. వీటిని నిగ్గుతేల్చాలంటే వైసీపీ హయాంలో వెలుగు చూసిన భూ అక్రమణలు, డబుల్‌ రిజిసే్ట్రషన్లు, ప్రభుత్వ భూ సేకరణలపై సమగ్ర విచారణ చేయించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే డాణాపురం వద్ద జగనన్న కాలనీ పేరిట జరిగిన భూ సేకరణ కుంభకోణంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజితబాషాకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదులతో భూ అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది.

ఆదోని పట్టణంలో అంతర్భాగమైన సాదాపురరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు.352, మండిగిరి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు.444 కింద ఉన్న భూముల్లో గత వైసీపీ హయాంలో భూ అక్రమార్కులు పెద్దఎత్తున రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ అక్రమాలు, కబ్జాలకు పాల్పడ్డారు.. సమగ్ర విచారణ చేసి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంత్రులు నారా లోకేశ, అనగాని సత్యప్రసాద్‌లకు ఫిర్యాదులు చేశారు. సాదాపురం రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబరు.352లో రీ-సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ ప్రకారం 38.35 ఎకరాలు విస్తీర్ణం చూపిస్తున్నారు. ఆనలైన అడంగల్‌లో 52.20 ఎకరాలు చూపిస్తోంది. రీ-సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ను కాదని 15.82 ఎకరాలు భూమి అదనంగా ఎలా వచ్చింది..? అలాగే మండిగిరి పంచాయతీ పరిధిలో సర్వే నంబరు.444 కింద రీ-సెటిల్‌మెంట్‌ రిజిసే్ట్రషన (ఆర్‌ఓఆర్‌) రికార్డుల ప్రకారం 53.58 ఎకరాల భూ విస్తీర్ణం చూపిస్తే.. ఆనలైన అడంగల్‌లో 79.5 ఎకరాలు చూపిస్తుంది. 25.92 ఎకరాలు భూమి ఆనలైనలో అదనంగా ఎలా వచ్చింది..? అన్నది వైసీపీ హయాంలో పని చేసిన రెవెన్యూ అధికారులకు తెలియాలి. ఇక్కడ ఎకరం రూ.10-15 కోట్లకు పైగా పలుకుతుంది. డబుల్‌ రిజిసే్ట్రషన్లు, మిస్సింగ్‌ రిజిసే్ట్రషన్లు, క్రయ విక్రయాల వివరాలు తారుమారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ల్యాండ్‌ కన్వర్షన, ఎనఏ చేసిన రికార్డులు లేవని, ఇప్పటికీ భూమిని లే-అవుట్లు వేసి స్థిరాస్తి వ్యాపారాలు, నిర్మాణాలు చేస్తున్నారని వివరించారు. అంతేకాదు సర్వే నంబరు.352లో తమకున్న ఎకరం భూమి అక్రమించారని, న్యాయం చేయాలని కోరుతూ బాధితులు అయ్యప్ప, ఎం.నరసింహులు జాతీయ సెడ్యూల్‌ కులాల కమిషనలో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

ఫ ఏ ఒక్కరిని వదలిపెట్టం

- పార్థసారథి, ఆదోని ఎమ్మెల్యే

వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థీకృత భూ అక్రమాలకు పాల్పడ్డారు. నేను ఎమ్మెల్యేగా ఏ వీధికి వెళ్లిన సర్వే నంబరు.352 బాధితులు ఏకరువు పెడుతున్నారు. 352, 444 సర్వే నంబర్లలో జరిగిన భూ అక్రమాలు, రికార్డుల తారుమారు, కబ్జాలపై విచారణ చేయాలని మంత్రులు నారా లోకేశ, అనగాని సత్యప్రసాద్‌లకు ఫిర్యాదు చేశాను. డాణాపురం వద్ద జగనన్న కాలనీ కోసం తీసుకున్న భూ సేకరణలో భారీ అక్రమాలు జరిగాయి. వైసీపీ నాయకులు పక్కా ప్రణాళికతో రైతులతో తక్కువ ధరకు భూములు మాట్లాడుకొని.. ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకు ఇచ్చి ఇటు రైతులు, అటు ప్రభుత్వాన్ని మోసం చేశారు. భూ అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.

Updated Date - Mar 07 , 2025 | 11:52 PM