కృష్ణా నదిలో.. బయటపడుతున్న సంగమేశ్వరాలయం
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:32 AM
డ్యాంలో నీటిమట్టం 838 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది. మరో అడుగు తగ్గితే ఆలయానికి వెళ్లే మార్గం కూడా సుగమం కానుంది. వచ్చే సోమవారం పూజలు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆత్మకూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లలితా సంగమేశ్వరాలయం కృష్ణా నదీజలాల నుంచి నెమ్మదిగా బయటపడుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 841.10 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 61.9240 టీఎంసీలు ఉన్నాయి. ఇంకోవైపు.. తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం 14,126 క్యూసెక్కుల నీటిని వాడుతోంది. నీటి విడుదల ఇదే తరహాలో కొనసాగితే.. మరో 2-3 రోజుల్లోనే ఆలయ ప్రాంగణంలో నీరంతా అడుగంటిపోయి గర్భాలయంలోని వేపదారు శివలింగ దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంది. డ్యాంలో నీటిమట్టం 838 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది.
మరో అడుగు తగ్గితే ఆలయానికి వెళ్లే మార్గం కూడా సుగమం కానుంది. వచ్చే సోమవారం పూజలు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023లో జూలై చివరి వారంలో నీటమునిగిన సంగమేశ్వరుడు అదే ఏడాది డిసెంబరులో జలదిగ్బంధం వీడి భక్తుల పూజలందుకున్నాడు. అయితే 2024 జూలై 23న నీటమునిగిన సంగమేశ్వరాలయం ఈ ఏడాది దాదాపు 115రోజుల ఆలస్యంగా బయటపడుతుండడం గమనార్హం.శ్రీశైలం జలాశయంలో 838 అడుగులకు నీటినిల్వలు చేరితే సంగమేశ్వరం గర్భాలయంలోకి నదీజలాలు ప్రవేశిస్తాయి.