AP Education: ఆనర్స్ డిగ్రీపై రివర్స్!
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:30 AM
పూర్వపు విధానంలోనే మూడేళ్ల డిగ్రీ పూర్తికాగానే సర్టిఫికెట్ తీసుకుని బయటికొచ్చేస్తున్నారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అసలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులనే అందించడం లేదు.

డిగ్రీ నాలుగో ఏడాదిపై విద్యార్థులు, కాలేజీల అనాసక్తి
వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావుడిగా అమల్లోకి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీపై రాష్ట్ర విద్యార్థుల్లో ఎక్కడా ఆసక్తి కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు డిగ్రీ చదువుతుంటే వారిలో పట్టుమని వెయ్యి మంది కూడా నాలుగో ఏడాది డిగ్రీలో కొనసాగట్లేదు. పూర్వపు విధానంలోనే మూడేళ్ల డిగ్రీ పూర్తికాగానే సర్టిఫికెట్ తీసుకుని బయటికొచ్చేస్తున్నారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అసలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులనే అందించడం లేదు. ప్రభుత్వ కాలేజీల్లో కొన్ని చోట్ల కోర్సులు ఉన్నా విద్యార్థులు చదివేందుకు ముందుకు రావట్లేదు. డిగ్రీ అంటే కచ్చితంగా మూడేళ్లు చదవాలి. అయితే, జాతీయ విద్యా విధానం-2020లో నాలుగేళ్ల డిగ్రీ విధానం తెరపైకి వచ్చింది. నాలుగేళ్లలో ఎప్పుడైనా బయటికి వచ్చేలా కొత్త డిగ్రీ విధానం తీసుకొచ్చారు. డిగ్రీ ఒక్క ఏడాది మాత్రమే చదివితే దాన్ని సర్టిఫికెట్ కోర్సుగా భావిస్తారు. రెండేళ్లు చదివి బయటికొస్తే దానిని డిప్లొమా కోర్సు అంటారు. మూడేళ్లు పూర్తిచేస్తే డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది. నాలుగో ఏడాది కూడా కోర్సులో కొనసాగి పూర్తిచేస్తే విద్యార్థికి ఆనర్స్ డిగ్రీ దక్కుతుంది. దీనివల్ల పీజీలో నేరుగా రెండో సంవత్సరంలో చేరొచ్చు. అలాగే నాలుగేళ్ల ఆనర్స్‌తోపాటు రీసెర్చ్ ఎంపిక చేసుకుని డిగ్రీ చదివితే ఆ విద్యార్థులు అనంతరం పీహెచ్‌డీకి వెళ్లే వెసులుబాటు ఉంది.
హడావుడిగా అమలు
జాతీయ విద్యా విధానంలో ఆనర్స్ డిగ్రీ ఐచ్చికం అయినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం హడావుడిగా అమల్లోకి తీసుకొచ్చింది. దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించకుండా నాలుగేళ్ల డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ప్రైవేట్ కాలేజీలన్నీ అనాసక్తి ప్రదర్శించాయి. 160 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 14 కాలేజీలే ఆనర్స్ డిగ్రీని అందిస్తున్నాయి. ఆ కాలేజీల్లోనూ చాలా తక్కువ మంది విద్యార్థులే నాలుగో సంవత్సరంలో కొనసాగుతున్నారు. మూడేళ్ల డిగ్రీ ఓ కాలేజీలో పూర్తిచేసి, నాలుగో సంవత్సరం కోసం ఆనర్స్ అందించే కాలేజీలో విద్యార్థులు చేరే అవకాశం ఉన్నా విద్యార్థులెవరూ ముందుకు రావట్లేదు. ఇక ఇప్పటివరకూ డిగ్రీలో మూడు సబ్జెక్టులు ఉండగా 2023-24 నుంచి సింగిల్ సబ్జెక్టు విధానాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యార్థి ఏదైనా ఒక్క సబ్జెక్టును మేజర్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవాలి. మొదటి సెమిష్టర్ అనంతరం మరో సబ్జెక్టును మైనర్‌గా ఎంచుకోవాలి. అంటే మూడు సబ్జెక్టుల స్థానంలో రెండు సబ్జెక్టులు వచ్చాయి. వీటిలోనూ మైనర్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఉండదు. దీనివల్ల అనేక కాలేజీల్లో పలు సబ్జెక్టులు తొలగించారు. అదే మూడు సబ్జెక్టుల కాంబినేషన్ విధానం ఉంటే విద్యార్థులు దేనిపై అయినా పీజీ చేయొచ్చు. ఇప్పుడు సింగిల్ మేజర్ విధానంలో మేజర్, మైనర్ సబ్జెక్టులపైనే పీజీ చేయాలి.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News