దళిత యువకుడిపై వైసీపీ క్రూరత్వం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:59 PM
: తిరుపతిలో దళిత యువకుడిపై భూమన కరుణాకరరెడ్డి అనుచరుడు, వైసీపీ నాయకుడి దాడి క్రూరమైందని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటే శ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు
కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో దళిత యువకుడిపై భూమన కరుణాకరరెడ్డి అనుచరుడు, వైసీపీ నాయకుడి దాడి క్రూరమైందని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటే శ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. డీసీఎంహెచ్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, బేతం కృష్ణుడు పాల్గొన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ దాడి చేసిన వైసీపీ రౌడీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు తీవ్రంగా ఉండేవని, వాటన్నింటికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఉన్న ద్వేషమే కారణమన్నారు. కేవలం ఓట్ల కోసం వారిని ఉపయోగించుకున్న జగన్, వారిపై దాడులను ప్రొత్సహించారన్నారు. తిరుపతిలో దళిత యువకునిపై భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు, అనుచరుల దాడి క్షమించరానిదన్నారు.
వైసీపీ దళిత వ్యతిరేకి : తిక్కారెడ్డి
వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నామనే బ్రమలోనే ఇంకా దాడులు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ ప్రజలు గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ది రాలేదని మండిపడ్డారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దళిత యువకుడిపై జరిపిన దాడి సిగ్గుచే టన్నారు. వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పకనే వారి చేష్టలు రుజువు చేశాయన్నారు. అరాచక సంఘటనలను ప్రభుత్వం ఉపే క్షించబోదని, నిందితులకు కఠిన శిక్షపడాలని డిమాండ్ చేశారు.
దళితులను టార్గెట్ చేసుకున్న వైసీపీ : బస్తిపాటి
వైసీపీ మొదటి నుంచి దళితులను టార్గెట్ చేస్తూనే ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నా రు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు నేటికీ అదే పంథాను కొనసాగిస్తు న్నారని మండిపడ్డారు. గతంలో మాస్కులు అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్‌పై దాడిచేసి ఆయన చావుకు కారణమన్నారు. మరో దళిత డ్రైవర్‌ను హత మార్చి శవాన్ని డోర్ డెలివరీ చేశారన్నారు. తాజాగా బైక్ అద్దె చెల్లించలేదని పవన్‌కు మార్ అనే యువకుడిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు.