వైసీపీ భక్త ఎస్‌ఐపై వేటు
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:49 AM
వైసీపీ ప్రభుత్వంలో పలువురు పోలీసు అధికారులు కండువా వేసుకొని వైసీపీ నాయకుల్లా పనిచేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అయితే మరీ ఏకపక్షంగా పనిచేశారు.
ఆస్పరి ఎస్‌ఐ సీ. వెంకటనరసింహులు సస్పెండ్
చిత్తూరు జిల్లాలో చేసిన అరాచకాలు వెలుగులోకి..
అధికార అండదండలతో చిత్తూరు నుంచి కర్నూలుకు
జిల్లా దాటి వెళ్లకూడదంటూ ఆదేశాలు
ఆదోని/చిత్తూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో పలువురు పోలీసు అధికారులు కండువా వేసుకొని వైసీపీ నాయకుల్లా పనిచేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అయితే మరీ ఏకపక్షంగా పనిచేశారు. టీడీపీ శ్రేణులే లక్ష్యం చేసుకుని అక్రమ కేసులు, హత్యాయత్నం కేసుల్ని నమోదు చేసి ఇబ్బంది పెట్టిన ఆస్పరి ఎస్‌ఐ సి.వెంకట నరసింహులు మంగళవారం సస్పెండ్ అయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఎస్‌ఐ సీవీ నరసింహులు ఓ కేసులో వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను సస్పెండ్ చేసి కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సరెండర్ కావాలని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. తమకు తెలియకుండా కర్నూలు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదు అంటూ ఆదేశించారు. వైసీపీ హయాంలో పెద్దఎత్తున అరాచకాలు చేసిన అతను తెలివిగా ప్రభుత్వం మారిన వెంటనే చిత్తూరు జిల్లా నుంచి బదిలీ చేసుకుని కర్నూలు జిల్లా ఆస్పరి స్టేషన్‌కు వెళ్లారు. కానీ, అతను చిత్తూరు జిల్లా సోమలలో చేసిన అరాచకాలు వెలుగులోకి రావడం, రికార్డెడ్‌గా ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో కూడా అతడిపై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా సదరు అవినీతి ఎస్‌ఐపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారులు ఆంధ్రజ్యోతి కథనాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సస్పెన్షన్ ఉత్తర్వుల్లో వివరాలు...
సెప్టెంబరు 2023లో భార్యాభర్తలు గొడవపడి చిత్తూరు జిల్లా సోమల స్టేషన్‌కు వచ్చారు. అప్పటి ఎస్‌ఐ నరసింహులు సదరు మహిళ నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆ మహిళ డబ్బులు లేవని చెప్పడంతో కానిస్టేబుల్ ద్వారా పాన్ బ్రోకర్‌ని స్టేషన్‌కు పిలిచారు. ఆమె తాళిబొట్టును తాకట్టు పెట్టి రూ.60వేలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో ఉంది. దాన్ని వడ్డీతో సహా చెల్లించి బంగారు తాళిబొట్టును తీసుకున్నట్లు విచారణలో తేలింది.
అదే ఏడాది అదే స్టేషన్‌లో తన పొలంలోని రూ. మూడు లక్షల విలువ చేసే టమోటా పంట కోసం ఉంచిన వెదురు కర్రలు దొంగిలించారని ఓ వ్యక్తిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. వ్యక్తిపై కేసు నమోదు చేసి కేసు కోసం రాజీ చేస్తానని ఇరువర్గాల నుంచి రూ. 30వేలు నగదు తీసుకున్నట్లు తేలింది.
2023లో సోమలలో 213 ఎఫ్‌ఐఆర్ నెంబరుతో నమోదైన కేసులో యువరాజానాయుడిని స్టేషనుకు పిలిచి అత్యంత దారుణంగా తిట్టడంతోపాటు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన వీడియో వైరల్ అయింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాం కావడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
2023 డిసెంబరులో సోమల మండలం కమ్మపల్లెలో సంఘమిత్ర తొలగింపు విషయంగా ఘర్షణలు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే మహిళలను వైసీపీ వర్గీయులు కొట్టారు. మగాళ్ల దుస్తులు చించేసి మరీ దాడి చేశారు. స్థానికులు వీడియోలు తీస్తుంటే ఎస్‌ఐ లాక్కున్నారు. టీడీపీ మద్దతుదారులపై హత్యాయత్నం కేసులు పెట్టిన ఎస్‌ఐ, వైసీపీ వారిపై నామమాత్రంగా బెయిలబుల్ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదుల్ని పట్టించుకోలేదు.
ఓ గ్రామంలో వైసీపీ నేత వద్ద రూ.లక్ష లంచం తీసుకుని వారం రోజుల్లో ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే ఓ యువకుడి మీద అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
చెన్నైలో స్థిరపడిన ఓ డాక్టర్‌కు అతని బంధువుల మధ్య ఏర్పడిన భూసమస్యను పరిష్కరిస్తానని రూ.లక్ష లంచం తీసుకుని పట్టించుకోలేదని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి వద్ద మెప్పు పొందేందుకు ఓ సందర్భంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌పై తన స్టేషన్‌లోనే నోరు పారేసుకున్న విషయం తెలిసిందే.