Share News

పెద్దాసుపత్రిలో శానిటేషన్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:59 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుధ్య కార్మికుడు నగేష్‌(34) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. నగరంలోని బుధవారపేటకు చెందిన నగేష్‌ ఏవన్‌ ఏజెన్సీ ఔట్‌సోర్సింగ్‌ కింద పని చేస్తూ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు

పెద్దాసుపత్రిలో శానిటేషన్‌ ఉద్యోగి మృతి
కార్మికులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

మృతదేహంతో కార్మికుల ఆందోళన

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుధ్య కార్మికుడు నగేష్‌(34) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. నగరంలోని బుధవారపేటకు చెందిన నగేష్‌ ఏవన్‌ ఏజెన్సీ ఔట్‌సోర్సింగ్‌ కింద పని చేస్తూ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. క్యాజువాల్టీలో మూడు రోజుల క్రితం చికిత్స తీసుకున్నాడు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మధ్యా హ్నం 12.46 గంటలకు క్యాజువాల్టీకి వచ్చి మృతి చెందాడు. దీనిపై పారిశుధ్య కార్మికులు, బంధువులు భగ్గుమన్నారు. ఆసుపత్రి పరిపాలన విభాగం ఎదుట మృతదేహంతో పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మృతి చెందిన కార్మికుడికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థతులు నెలకొన్నాయి. దీంతో ఘటన స్థలానికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కే వెంకటేశ్వర్లు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. అంత్యక్రియలకు ఆయన ఆర్థిక సాయం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహంతో మళ్లీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుధ్యం కార్మికుడు రంగన్న మాట్లాడుతూ పదేళ్లుగా ఈఎ్‌సఐ, పీఎ్‌ఫలు కాంట్రాక్టర్‌ కట్టడం లేదని, ఈఎ్‌సఐ రూ.3100 కట్టాల్సి ఉండగా.. రూ.450 కడుతున్నారన్నారు.

ఐదు నెలలుగా జీతాలు రాక, ఈఎ్‌సఐ కార్డు లేకపోవడంతో కార్మికుడు నాగేష్‌ అనారోగ్యంతో మృతి చెందాడని, అదే ఈఎ్‌సఐ కార్డు ఉంటే ఈఎ్‌సఐ హాస్పిటల్‌లో చికిత్స తీసుకునే వాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కార్మికులందరికీ ఈఎ్‌సఐ, పీఎఫ్‌ కట్టాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే శానిటేషన్‌ కాంట్రాక్టును రద్దు చేయాలని కోరారు. చివరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతినిధిగా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందస్వామి సోమవారం కాంట్రాక్టరుతో చర్చలు జరిపిస్తామని సూపరింటెండెంట్‌ హామీ ఇచ్చారని తెలపడంతో మృతదేహాన్ని కార్మికులు, బంధువులు మహప్రస్థానం వాహనంలో తీసుకుపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు బాషా, నాగార్జున, శివ, నాగన్న, సుజాత పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:59 PM