Share News

జ్వరంతో వస్తే.. ప్రాణాలు తీశారు..

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:11 AM

జ్వరంతో వచ్చిన రోగిని ప్రాణాలు తీశారు కర్నూలులోని శ్రీచక్ర హాస్పిటల్‌ వైద్యులు. వారి నిర్లక్ష్యంగా కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పో యింది. దీంతో రోగి బంధువులు ఆగ్రహంతో గురువారం ఉదయం హాస్పిటల్‌ ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు.

 జ్వరంతో వస్తే..  ప్రాణాలు తీశారు..
మృతురాలి బంధువుల దాడిలో ధ్వంసమైన ఆసుపత్రి అద్దాలు

హాస్పిటల్‌ ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం

కరెంటు స్తంభం ఎక్కిన రోగి బంధువు

శ్రీచక్ర హాస్పిటల్‌ వద్ద ఉద్రిక్తత

విచారణ జరపాలని మృతురాలి భర్త డిమాండ్‌

కర్నూలు హాస్పిటల్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జ్వరంతో వచ్చిన రోగిని ప్రాణాలు తీశారు కర్నూలులోని శ్రీచక్ర హాస్పిటల్‌ వైద్యులు. వారి నిర్లక్ష్యంగా కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పో యింది. దీంతో రోగి బంధువులు ఆగ్రహంతో గురువారం ఉదయం హాస్పిటల్‌ ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో హాస్పిటల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోగి బంధువు ఒక్కరు కరెంటు స్తంభం ఎక్కారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా పామిడికి చెందిన అనిత(21)కు కల్లూరు ఎస్టేట్‌కు చెందిన నాగేంద్రప్రసాద్‌తో ఏడాది క్రితం పెళ్లయింది. ఈ నెల 15వ తేదీన తీవ్ర చలి జ్వరం రావడంతో రోగిని భర్త సమీపంలో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్‌ తీసుకువచ్చారు. ఫ్లూయిడ్స్‌ ఎక్కించి రెండు గంటలు వైద్యులు చికిత్స అందించి మందులు రాసి పంపించారు. 16వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో అపస్మారక స్థితిలో రోగిని భర్త తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి చూడగా.. రోగి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. రోగిని అడ్మిషన్‌ చేసుకోకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భర్త ఆరోపించారు.

హాస్పిటల్‌ సిబ్బందితో వాగ్వాదం

వైద్యులు నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందిందంటూ బంధువులు గురువారం ఉదయం హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. హాస్పిటల్‌ సిబ్బందితో వాగ్వాదం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసి బంధువులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనిత మృతదేహాన్ని శవపరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మందు వికటించడంతోనే..

వైద్యులు ఇచ్చిన మందులు వికటించడంతోనే నా భార్య మృతి చెందింది. ఈ నెల 15వ తేదీ చలిజ్వరంతో క్యాజువాల్టీకి తీసుకు వచ్చా. వైద్యులు ఫ్లూయిడ్స్‌ పెట్టి మందులు రాసి ఇచ్చారు. మళ్లీ 16వ తేదీ రాత్రి 11గంటలకు రోగిని తీసుకువచ్చాం. వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం చేయాలని బతిమాలినా పట్టించుకోలేదు. రాసిన మందులకు బదులు మరో రకం మందులు ఇచ్చారు. తక్షణమే దీనిపై విచారణ జరిపించి హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలి. ఫ నాగేంద్ర ప్రసాద్‌, మృతురాలి భర్త

అనిత మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదు

ఫ ఐఎంఏ, అప్నా యూనియన్‌ నాయకులు

శ్రీచక్ర హాస్పిటల్‌లో రోగి అనిత మృతిచెందడంలో వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఐఎంఏ అప్నా యూనియన్‌ నాయ కులు, శ్రీచక్ర హాస్పిటల్‌ యజమాని డా.విజయకుమా ర్‌రెడ్డి తెలి పారు. గురువారం మధ్యాహ్నం ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డా.రామచంద్రనాయుడు, డాఎస్‌వీ రామ్మోహన్‌ రెడ్డి, అప్నా అధ్యక్ష, కార్యదర్శులు డా.వేణుగోపాల్‌, డా.బీజీ రాహుల్‌, సీనియర్‌ నాయకులు డా.బాల మద్దయ్యలతో కలిసి డా.విజయకుమార్‌రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బ్రాడ్‌ డెత్‌ అయిన రోగిని సరిగ్గా చూడలేదని చెప్పడం సరికా దన్నారు. హాస్పిటల్‌ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మందులు వికటించడం అవాస్తవమన్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 ్డగంటల సమయంలో రోగికి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిపారు.

Updated Date - Jul 18 , 2025 | 12:11 AM