కూలీ పనులకు వెళ్తూ.. మృత్యు ఒడికి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:45 AM
పత్తి కోత పనులకు వెళ్తూ.. ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు
ఆటోను ఢీకొట్టిన మినీ బస్సు
ఇద్దరు కూలీలు దుర్మరణం
12 మందికి గాయాలు
వీరిలో నలుగురి పరిస్థితి విషమం
కోటేకల్ గ్రామ సమీపంలో ఘటన
ఎమ్మిగనూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పత్తి కోత పనులకు వెళ్తూ.. ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. ఆదోని మం డలం కపటి గ్రామానికి చెందిన డ్రైవర్ కన్నయ్యతో పాటు 13మంది వ్యవసాయ కూలీలు చాకలి వెంకటేశ్వరి, చాకలి శిరీష, బోయ గుండమ్మ, బోయ శాంతి, గోల్ల కవిత, బోయ అనుసూయ, చాకలి నాగలక్ష్మి, బోయ అంజలి, బోయ కొండ నరసమ్మ, బోయ రంగవేణి, సాయి చరణ్, చాకలి మహాదేవి ఆటోలో పత్తికోత పనుల కోసం మంత్రాలయం మండలం కలుదేవకుంట గ్రామానికి బయలుదేరారు. ఆటో కోటేకల్లు గ్రామ సమీపంలో 167 జాతీయ రహదారి టర్నింగ్‌లో వస్తుండగా వెనుకవైపు నుంచి వేగంగా వస్తున్న మినీబస్సు ఆటోను ఢీకొట్టింది. ఆవేగానికి ఆటో ఎగిరి మూడు పల్టీలు కొట్టింది. అందులోఉన్న కూలీలు ఒక్కసారిగా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో కూలీలకు రక్తగాయాలయ్యాయి. ఒక్కసారిగా ఆటో ప్రమాదానికి గురికావడం, అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురుగా పడి రక్తగాయాలు కావడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆప్రాంతం క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటింది. గా యాలపాలైన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మిన్నంటిన రోదనలు
ఉదయాన్నే కూలీ పనుల కోసమని మంత్రాలయం మండలం కలుకుంట గ్రామానికి బయలుదేరిన కూలీలకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే ఆదోని మండలం కపటి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆటోలో 14మంది ఉండడంతో ఎవరెవరికి ఏమైందోనని ఆయా కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో రంగవేణితో పాటు నాగలక్ష్మి మృతి చెందడం, మిగతా వారికి తీవ్ర రక్తగాయాలు కావడంతో వారివారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలివచ్చారు. మృతుల, క్షతగాత్రుల బంధువుల రోదనలతో మిన్నంటింది. ఇద్దరు కూలీలు మరణించడంతో కపటి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
అక్కడికక్కడే మృతిచెందగా..
రోడ్డు ప్రమాదంలో ఆదోని మండలం కపటికి చెందిన బోయ రంగవేణి(16) అక్కడిక్కడే మృతి చెందింది. గొల్ల నాగలక్ష్మి అలియాస్ సరస్వతి (28)తో పాటు మరో నలుగురికి తీవ్ర రక్తగాయాలయ్యయి. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్సకోసం కర్నూలుకు తరలించారు. నాగలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగలక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.