సకల సౌకర్యాలతో..
ABN , Publish Date - May 01 , 2025 | 12:22 AM
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించనుంది. విడతల వారీగా అన్నిరకాల సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంది.
నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు
పేద విద్యార్థులకు శుభవార్త
ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ సరఫరా
త్వరలో బ్యాగ్‌లు, షూస్
విద్యార్థులు పెరిగే అవకాశం
నంద్యాల, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించనుంది. విడతల వారీగా అన్నిరకాల సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా.. తాజాగా బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న 1,43,707 మంది విద్యార్థులకు దుస్తులు (యూనిఫామ్స్), టెక్స్‌బుక్స్ ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతో జిల్లా సమగ్ర శిక్షా అసిస్టేంట్ ప్రాజెక్టు డైరెక్టర్(ఏపీసీ) ప్రేమంత్ కుమార్ నేతృత్వంలో సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని బనగానపల్లి, బేతంచెర్ల పాఠశాలలో దుస్తులు, టెక్స్‌బుక్స్ (పుస్తకాలను) ఆన్‌లోడ్ చేశారు. త్వరలోనే ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కూడా రానున్నాయి. వీటితో పాటు అందరికి త్వరలో షూస్‌తో పాటు బ్యాగులు కూడా రానున్నాయి. ఏది ఏమైనా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో.. 2025-26కి సంబంధించి ప్రణాళికా బద్ధంగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం సదరు విద్యార్థులకు వరంగా మారినట్లైంది.
మొదటి విడతలో భాగంగా..
మొదటి విడతలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 6నుంచి 10వ తరగతి చదువుతున్న 1,43,707మంది విద్యార్థులకు సంబందించి.. ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున దుస్తుల మెటీరియల్ ప్రభుత్వం సరఫరా చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తూ పంపిణీ చేయడం గమనార్హం. ఆక్ప్‌ఫర్డ్ డిస్ట్నరీ కూడా విద్యార్థులకు అందించనున్నారు.
మరో వారంలో...
రెండవ విడతగా ప్రభుత్వ పాఠశా లలో 1నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బుక్స్‌తో పాటు వర్క్ బుక్స్, దుస్తులు సరఫరా చేయనున్నారు. దుస్తుల మెటీరియల్‌ను కుట్టిం చడం కోసం అయ్యే ఖర్చును కూడా ఆయా విద్యార్థుల వారీగా తల్లుల ఖాతాలకు జమచేయనున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యా ర్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించనుంది. ఇదే క్రమంలో పాఠశాలలో విద్యార్థులు చేరే సంఖ్య కూడా ఈ ఏడాది పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ పాఠశా లలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌లో సైతం ఇదే తరహాలో సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం జరుగుతోంది.
ఎంతో నాణ్యతగా ఉన్నాయి
ప్రభుత్వం విద్యార్థులకు అందించిన దుస్తుల మెటీరి యల్ ఎంతో నాణ్యతగా ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే దుస్తులు, బుక్స్ సరఫరా చేశారు. త్వరలోనే బ్యాగులు, షూష్ కూడా వస్తాయి. కార్పొరేట్ దిశగా సేవలు అభినందనీయం. - ప్రేమంత్‌కుమార్, ఏపీసీ సమగ్ర శిక్షా, నంద్యాల