దద్దనాల దుస్థితి మారదా?
ABN , Publish Date - May 24 , 2025 | 11:39 PM
బనగానపల్లె నియోజకవర్గంలోని ఒకే ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు దద్దనాల ప్రాజెక్టు. దీని కింద ప్రత్యక్షంగా 1516 ఎకరాలకు పరోక్షంగా పదివేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
14 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రధాన గేట్లు, పూడిక గేట్లు
10 అడుగులకు చేరిన పూడిక
రూ.2 కోట్లతో ప్రాజెక్టు ఆధునికీకరణకు ప్రతిపాదనలు
కూటమి ప్రభుత్వంపైనే అన్నదాతల ఆశలు
బనగానపల్లె, మే 24: బనగానపల్లె నియోజకవర్గంలోని ఒకే ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు దద్దనాల ప్రాజెక్టు. దీని కింద ప్రత్యక్షంగా 1516 ఎకరాలకు పరోక్షంగా పదివేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 15 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతోంది. గతంలో ప్రాజెక్టులోకి నీరురాక ఒట్టిపోయింది. 14ఏళ్లుగా ప్రధాన గేట్లు, పూడిక గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. అయితే ఇందులో ఓ గేటు మరమ్మతు చేశారు. ప్రాజెక్టు మరో ప్రధాన గేటు ఒకటి, రెండుపూడిక గేట్లు, పంటపొలాలకు నీటిని వదిలే స్లూయిస్ గేట్లు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు.
దద్దనాల ప్రాజెక్టు
దద్దనాల ప్రాజెక్టును బనగానపల్లె మండలం పాతపాడు గ్రామ సమీపంలో రెండు ఎరమల్ల కొండల మధ్య నిర్మించారు. 150 ఎకరాల విస్తీర్ణంలో 0.02 టీఎంసీల నీటి నిల్వ చేసే విధంగా ప్రాజెక్టును నిర్మించారు. 1516 ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు సమస్య శాశ్వతంగా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. 12 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల వలన దద్దనాల ప్రాజెక్టు ఓటికుండలా మారిపోయింది. ఏనాడూ ఈ ప్రాజెక్టు నిండిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద కొండలపై వచ్చే వర్షపునీటికి అడ్డుకట్ట వేస్తూ పెద్ద చెక్‌డ్యాంను నిర్మిం చారు. అప్పట్నుంచి వర్షపునీరు ఆ చెక్‌డ్యాంలోని వెళ్లిపోతుండడంతో దద్దనాల ప్రాజెక్టుకు నీరు అందే పరిస్థితి లేకపోయింది. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎస్సార్బీసీ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం మం జూరు చేయించి పనులు పూర్తి చేయడంతో గత 6ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిండుకుండలా ఉంది.
14 ఏళ్లుగా మరమ్మతులకు..
దద్దనాల ప్రాజెక్టుకు గతంలో వర్షపు నీరు సరిగ్గా రాకపోవడం, ప్రాజెక్టు నిండకపోవడంతో మైనర్ ఇరిగేషన్ అధికారులు ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం మానేశారు. 14 ఏళ్ళుగా ఒక ప్రధాన గేటు, పూడిక గేట్లు, పంట పొలాలకు నీరు అందించే స్లూయిస్ గేట్లు పూర్తిగా పనిచేయడం లేదు. గత నాలుగేళ్ల క్రితం ప్రధాన గేట్లకు మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినా ఒక గేటు మాత్రమే మరమ్మతులకు నోచుకుంది. ఒక్క గేటు మాత్రం నేటికీ మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే పూడికగేట్లు, స్లూయిస్ గేట్లు కూడా మరమ్మతులకు నోచుకోలేదు. ప్రాజెక్టులో నీరు రాకపోవడంతో 10 అడుగులకు పైగా లోతు పూడిక తో నిండిపోయింది.
దెబ్బతిన్న పంటకాల్వలు, ప్రాజెక్టు ఫ్లాట్ ఫాం
గత 14ఏళ్లుగా ఒక ప్రధాన గేటు, పూడిక గేట్లు, పంటకాల్వలు దెబ్బతిన్నాయి. పంట కాల్వలు ముళ్ల కంపలతో నిండిపోయాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాట్‌ఫారం కనీస మరమ్మతులకు నో చుకోలేదు. కనీసం పంటలు పండించుకుందామన్నా పంటకాల్వలు లేక రైతులు బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. అధికారికంగా సుమారు 1516 ఎకరాలకు పంటకాల్వలు లేవు. ఉన్నవి శిథిలమయ్యాయి. పంటకాల్వలు ముళ్ల కంపలతో నిండి పోయాయి.
ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం రూ.2 కోట్లతో ప్రతిపాదనలు
దద్దనాల ప్రాజెక్టు గేట్లు, పూడికగేట్లు, ప్లాట్‌ఫారం, కాల్వల నిర్మాణం, లైనింగ్, శిథిలావస్థకు చేరుకున్న కాల్వల మరమ్మతులు జనరేటర్ ఇతర పనులకు రూ.2 కోట్లతో పూర్తి స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిధులు మంజూరైన వెంటనే దద్దనాల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆధునికీకరించడానికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం.
- రామ్మోహన్‌రెడ్డి, ఏఈ, మైనర్ ఇరిగేషన్