Share News

ఆక్రమణలు ఆగేనా?

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:41 PM

నదీతీరాలను రక్షిత, నియంత్రిత, హెచ్చరిక మూడుజోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. ప్రవహించే నదుల నుంచి 100 మీటర్ల వరకు ‘నో డెవలప్‌మెంట్‌ జోన్‌’గా ప్రకటించింది.

ఆక్రమణలు ఆగేనా?
నగరం మధ్యలో హంద్రీ నది

హంద్రీ కబ్జాలు తొలిగేనా?

మూడు జోన్లుగా నదీతీరాలు

రక్షిత, నియంత్రిక, హెచ్చరిక జోన్లుగా గుర్తింపు

నదులకు 100 మీటర్ల వరకు ‘నో డెవలప్‌మెంట్‌ జోన్‌’

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

నదీతీరాలను రక్షిత, నియంత్రిత, హెచ్చరిక మూడుజోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. ప్రవహించే నదుల నుంచి 100 మీటర్ల వరకు ‘నో డెవలప్‌మెంట్‌ జోన్‌’గా ప్రకటించింది. నదులకు వచ్చే వరద తీవ్రతను బట్టి 500 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. అందుకు అనుగుణంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ‘ఫ్లడ్‌ ప్లెయిన్‌ జోనింగ్‌’ పేరిట వరద ప్రవాహ ప్రాంతాల్లో సాంకేతిక మార్గదర్శకాలు జారీ చేసింది. వరద తీవ్రత నదుల్లో తుంగభద్ర, హంద్రీ కూడా ఉన్నాయని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్న హంద్రీ తీరంలో సెంటు స్థలం రూ.లక్షల్లో పలుకుతుంది. అక్రమార్కులకు కన్నేసి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించడంలో జలవనరులు , రెవెన్యూ, నగరపాలక శాఖల నిర్లక్ష్యం శాపంగా మారింది. 2007, 2009 లాంటి వరదలొస్తే ప్రజలకు రక్షణ ఏదీ..? కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనైనా హంద్రీ నది ఆక్రమణలకు అడ్డుకట్ట పడేనా..? ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం మధ్యలో 5.40 కిలోమీటర్లు హంద్రీ నది ప్రవహిస్తుంది. నదీతీరం ఇరువైపుల ఆక్రమణలకు గురైంది. గరిష్ఠ వరద ప్రవాహ అంచుల (మ్యాగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవల్‌-ఎంఎఫ్‌ఎల్‌) నుంచి 50 మీటర్లు (150 అడు గులు) వరకు బఫర్‌ జోన్‌గా, వక్కెరు వాగు తీరం వెడల్పు (బఫర్‌ జోన్‌) 30-50 అడు గుల వరకు ఉంటుందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. స్థిరాస్తుల విలువ భారీగా పెరగ డంతో హంద్రీ, వక్కెరు వాగు సహా నగరం అంచున ప్రవహించే తుంగభద్ర మునగాల పాడు నుంచి జోహరాపురం వరకు నదీతీరాలు అక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా కబ్జా చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో నిబంధనలు తుంగలో తొక్కేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు వెంచర్లు వేయడం, ఇళ్ల నిర్మా ణాలు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. జేసీ బి.నవ్య ఆదేశాల మేరకు రెవెన్యూ, జలవనరుల శాఖ అఽధికారులు సంయుక్తంగా సర్వే చేసి హంద్రీ నది కుడిగట్టు వెంబడి 164, ఎడమ గట్టు వెంబడి 174 ఆక్రమణలు గుర్తించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు హంద్రీ సరిహద్దులు గుర్తించి.. సరిహద్దు సిమెంట్‌ పిల్లర్లు పాతారే తప్పా ఆక్రమణల జోలికి వెళ్లలేదు. దీంతో కొత్తగా భవనాలు నిర్మించిన బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు యథేచ్ఛగా స్థిరాస్తి వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి.

రక్షణ గోడ నిర్మాణం కోసం..

హంద్రీ నదీతీరం జోహరాపురం నుంచి పందిపాడు వరకు, తుంగభద్ర తీరం కుడిగుట్టు జోహరాపురం నుంచి మునగాలపాడు సమీపంలోని హైవే వరకు, వక్కేరు వాగు ఆనంద్‌ సినీ థియేటర్‌ నుంచి రేడియోస్టేషన్‌ వరకు, సుద్దవాగు సి.క్యాంప్‌ సర్కిల్‌ నుంచి జోహరాపురం వరకు రక్షణ గోడ నిర్మాణం కోసం రూ.220 కోట్లు నిధులు కేటాయించి టెండర్లు పిలిచారు. పనులు చేయకపోవడంతో ఆటెండర్లు రద్దుచేశారు. ఐదారు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే జరిగితే ప్రతి వర్షపు చుక్క వంకలు, వాగుల ద్వారా హంద్రీ నదికి చేరే అవకాశం లేకపోలేదు. మళ్లీ వరదొస్తే? నదీతీర కాలనీలకు రక్షణ ఏదీ? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మళ్లీ వరదొస్తే..

హంద్రీ నదికి 1997లో ఆగస్టు, సెప్టెంబరులో రెండుసార్లు లక్ష క్యూసెక్కులకు పైగా వరదొచ్చి నదీతీరంలో కాలనీలు ముంపునకు గురయ్యాయి. 2007లో ఏకంగా 2లక్షల క్యూసెక్కులు వరద రావడంతో కల్లూరు దగ్గర ఉన్న హైవే నుంచి జొహరాపురం వరకు విఠల్‌ నగర్‌ సహా వివిధ కాలనీలు ముంపునకు గురై ఊహించని నష్టం చవిచూశారు. 2009లో ఏకంగా 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో నదీతీరం అంచులపై ఏకంగా ఆరేడు అడుగుల ఎత్తులో వరద ప్రహించిందని ఇంజనీర్లు గుర్తు చేస్తున్నారు. పగటి పూట వరద రావడంతో ఆస్తి నష్టం తప్పా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అదే రాత్రి వరదొచ్చి ఉంటే ఊహించుకోవడానికి భయమేస్తుందని నాడు వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఇంజనీరు ఒకరు పేర్కొన్నారు.

నగరంలో ప్రవహించే హంద్రీ నదీతీరం ఇరువైపుల ఆక్రమ ణలకు అడ్డుకట్ట పడేనా? ఇప్పటికే చేసిన ఆక్రమణలు తొలగి స్తారా? నదీతీరం సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసు కుంటారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు నది సంరక్షణ చర్యలు చేపట్టకపోతే మళ్లీ వరదొస్తే ప్రజలు ముంపు బారిన పడక తప్పదు. అదే జరిగితే ఆక్రమణలకు పరోక్షంగా సహకరించిన అధికారులు, రాజకీయ నాయకులే బాధ్యత వహించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

కేంద్ర మార్గదర్శకాలు ఇవే..

నదీతీరాల నుంచి 500 మీటర్ల దూరం వరకు ల్యాండ్‌ ఫీల్డ్‌ సైట్లు, మునిసిపాలిటీ, నగరపాలక సంస్థలు, పరిశ్రమల వ్యర్థాలు వేయరాదని నిషేధాజ్ఞలున్నాయి.

ఐదేళ్లకు ఒకసారి వరదలు పునరావృతమయే ప్రాంతాలను ప్రొటెక్టెడ్‌ జోన్‌గా కేంద్రం ప్రకటించింది. తాజాగా మార్గదర్శకాలు ప్రకారం ఈజోన్‌లో శాశ్వత నిర్మాణాలు, వ్యర్థాలు వేయడం, ప్రమాదకర పదార్ధాలు నిల్వ చేయడం నిషేధం.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి, పాతికేళ్లకు ఒకసారి వరదలు వచ్చే ప్రాంతాన్ని రెగ్యులేటర్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ జోన్లో కార్యకలాపాలు కఠినంగా నియంత్రిస్తారు.

పాతికేళ్లకు ఒకసారి, అదేవిధంగా ప్రతి 100ఏళ్లకు ఒకసారి వరదలు వచ్చే ప్రాంతాన్ని వార్నింగ్‌ జోన్‌గా పేర్కొన్నారు. ఇక్కడ తక్కువ ప్రమాదకర కార్యకలాపాలకు అనుమతి ఉన్నా, వరద ముప్పు అంచనాలు వేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.

హంద్రీ నదికి 1997 నుంచి 2009 వరకు 12 ఏళ్లలో నాలుగుసార్లు భారీ వరదలు వచ్చాయి. 2007, 2009లో మూడేళ్లలో రెండుసార్లు 2-3 లక్షల క్యూసెక్కులకు పైగా వరదలు వచ్చాయి. ఎప్పుడు వరద వస్తుందో? అంటూ నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ప్రొటెక్ట్‌ జోన్‌ జాబితాలో చేర్చాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.

తుంగభద్ర నది మునగాలపాడు నుంచి జోహరాపురం వరకు కర్నూలు నగరం అంచున ప్రవహిస్తుంది. 2009లో వచ్చిన వరద ఊహకు అందనిది. ఈ నదీతీరాన్ని కూడా ప్రొటెక్టెడ్‌ జోన్‌గా గుర్తించాలని పలువురు కోరుతున్నారు. మునగాలపాడు నుంచి రోజాదర్గా వరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నదీతీరం అంచుల్లో శాశ్వత భవనాలు నిర్మాణాలు చేస్తున్నారు. అంకురంలో అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

నదీతీరంలో రహదారులు నిర్మించాలి

ప్రజలను వరద ముప్పు నుంచి రక్షించాలంటే నదీతీరాల్లో శాశ్వత భనవాలు నిర్మించకుండా చర్యలు తీసుకోవాలి. బఫర్‌ జోన్‌ ప్రాంతంలో విశాలమైన రోడ్లు నిర్మించాలి. రహదారులపై ప్రజలు, వాహనదారులు రాకపోకల వల్ల వరద ప్రమాదం గుర్తించి ముప్పు నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. నగరంలో హంద్రీ నదీతీరం ఇరువైపుల ఆక్రమణులు వాస్తవమే. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి, సరిహద్దులు గుర్తించడంతో పాటు ఆర్‌సీసీ దిమ్మెలు ఏర్పాటుచేశాం.

బి.రామకృష్ణ, డీఈఈ, ఇరిగేషన్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన్‌, కర్నూలు

Updated Date - Aug 29 , 2025 | 11:41 PM