Share News

బకాయిలు అందేనా..?

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:56 PM

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పంట దిగుబడులు కొన్న రోజునే రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వ నిబంధన. అతిక్రమిస్తే వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకుంటారు.

బకాయిలు అందేనా..?
ఓర్వకల్లుకు చెందిన ఓ రైతు ధర వచ్చినప్పుడు అమ్మకోవచ్చని ఉర్దూ విశ్వవిద్యాలయం అసంపూర్తి భవనాల్లో ఆరబోశారు. ధర లేక మార్కెట్‌కు తీసుకెళ్లకపోవడంతో ఇలా మొలకలు వచ్చాయి.

మూడు నెలలుగా ఎదురుచూపులు

ఉల్లి రైతులకు అందని డబ్బులు

పెరిగిపోతున్న వడ్డీలు

రూ.17కోట్లకు గాను చెల్లించింది రూ.10కోట్లే

మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

ఆందోళనలో అన్నదాతలు

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పంట దిగుబడులు కొన్న రోజునే రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వ నిబంధన. అతిక్రమిస్తే వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకుంటారు. అదే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసి మూడు నెలలైనా డబ్బులివ్వకపోతే ఏమనాలి? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? సమాధానం లేని ప్రశ్నలు. ధరలు పతనమై దిక్కులు చూస్తున్న ఉల్లి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసింది. వారం పది రోజుల్లోగా కొనుగోలు చేసిన ఉల్లి డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి అధికారులు మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయి డబ్బులు రాక, పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చినవారికి సమాధానం చెప్పలేక కష్టజీవులు ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది 57,700 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఎకరాకు పెట్టుబడి రూపంలో రూ.లక్షకు పైగా ఖర్చు వస్తుందని రైతులు అంటున్నారు. ఉల్లి సాగు చేసిన వారిలో మెజార్టీగా కౌలు రైతులే ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలో అగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. అరకొర పంటను కర్నూలు మార్కెట్‌కు తీసుకొస్తే.. ధరలు పతనమై కష్టజీవులు దిక్కులు చూడాల్సి వచ్చింది. క్వింటా రూ.250 నుంచి రూ.750కు మించి కొనుగోలు చేసే నాథుడే లేడు. పైగా నాణ్యత లేదంటూ టెండరు కూడా వేయకపోతే కొందరు రైతులు రోడ్డున పారబోశారు. పంటకోత, రవాణా ఖర్చులు కూడా రాకపోగా హమా లీ ఖర్చులు అదనంగా భరించాల్సి రావడంతో రైతులు పొలంలోనే వదిలేశారు. ఉల్లి రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు క్వింటా రూ.1,200కు కొనుగోలు చేపట్టింది. కొంతైనా డబ్బులు చేతికొస్తాయని, పెట్టుబడి వడ్డీలైన కట్టవచ్చనే ఆశతో మళ్లీ అప్పులు చేసి పంట కోసి మార్కెట్‌కు తెచ్చారు. ఏపీ మార్కెట్‌ ఫెడ్‌ కేంద్రాల్లో అమ్మకాలు చేశారు. వారం పది రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఆశించిన మట్టిమనుషులకు నిరాశే మిగిలింది.

ఇచ్చింది రూ.10కోట్లే

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఆగస్టు 31నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ నేరుగా కొనుగోలు చేసింది. ఏపీ మార్క్‌ఫెడ్‌, లైసెన్సుడ్‌ వ్యాపారులు కలిపి 2,800 మంది రైతుల నుంచి 1.55లక్షల క్వింటాళ్లు ఉల్లి సేకరించారు. రైతుల ఖాతాలో రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతుల నుంచి పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఈ-క్రాప్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకున్నారు. నెలలు గడిస్తున్నా ఉల్లి డబ్బు మాత్రం ఖాతాలో జమ కాలేదు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు గ్రామీణ బ్యాంకులు విలీనంతో కొత్త బ్యాంక్‌ ఖాతాలు రావడంతో సమస్య వచ్చిందంటూ రైతులకు అర్థం కాని సమాధానం చెబుతూ వచ్చారు. అక్టోబరు ఆఖరు వరకు కేవలం 350 మంది రైతులకు రూ.2.11 కోట్టు మాత్రమే చెల్లించారు. 2,445 మంది రైతులకు రూ.14.89 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉల్లి రైతుల కన్నీటి వ్యథలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్‌ స్పందించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీతో మాట్లాడారు. ఎట్టకేలకు రూ.8కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. ఇప్పటికీ 1,100మంది రైతులకు రూ.7కోట్లు చెల్లించాల్సి ఉంది. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఉల్లి బోనస్‌ వచ్చేనా?

భారీ వర్షాలు ఉల్లి రైతులను కష్టాల్లోకి నెట్టేశాయి. ఉల్లిగడ్డలు కుళ్లిపోయి దిగు బడులు తగ్గాయి. ఈసమయంలో ఉల్లి రైతులకు అండగా ఉంటాం.. హెక్టారుకు రూ.50వేలు బోనస్‌ ఇస్తామని సీఎం చంద్రబాబు, పాలక పెద్దలు ప్రకటించారు. ఉద్యానవన శాఖ అధికారులు 57,700 ఎకరాల్లో ఉల్లి సాగుచేశారని, 35వేల మంది రైతులకు రూ.99.50కోట్లు ఉల్లి బోనస్‌ చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించారు. బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసి నెలలు గడిచింది. ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖకు వెళ్లాయి. బోనస్‌ డబ్బులు మాత్రం విడుదల చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉల్లి బకాయి రూ.7కోట్లతో పాటు బోనస్‌ డబ్బులు తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. ఈవిషయాన్ని ఉద్యానవన శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఉల్లి బోనస్‌ డబ్బుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొనడం కొసమెరుపు.

Updated Date - Nov 26 , 2025 | 11:56 PM