Share News

డోన్‌ ప్రజల కల నెరవేరేనా?

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:21 PM

పరిపాలన సౌలభ్యం కోసం వైసీపీ ప్రభుత్వం జిల్లా పునర్విభజన చేపట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో లాభం ఏమో కానీ డోన్‌ నియోజకవర్గ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.

డోన్‌ ప్రజల కల నెరవేరేనా?

నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్‌

ఎమ్మెల్యే కోట్ల తీవ్ర ప్రయత్నాలు

డోన్‌ నుంచి నంద్యాలకు వెళ్లాలంటే నరకయాతనే

ప్రజలకు శాపంగా మారిన గత ప్రభుత్వ నిర్ణయం

పరిపాలన సౌలభ్యం కోసం వైసీపీ ప్రభుత్వం జిల్లా పునర్విభజన చేపట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో లాభం ఏమో కానీ డోన్‌ నియోజకవర్గ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా కర్నూలు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని కోల్పోయింది. డోన్‌ నుంచి నంద్యాల వెళ్లేందుకు నియోజకవర్గ ప్రజలు సైతం ఇష్టపడటం లేదు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం.. గంటల తరబడి ప్రయాణం చేయాల్సి రావడం.. దీంతో తమను ఎలాగైనా కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని వేడుకుంటున్నారు. ఎన్నికల వేళ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సైతం హామీ ఇచ్చారు. డోన్‌, ప్యాపిలి మండలాలను కర్నూలులోనే కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధిష్ఠానం దృష్టికి సైతం ఈవిషయాన్ని తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

డోన్‌ టౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): డోన్‌, ప్యాపిలి మండలాలను కర్నూలు జిల్లాలో విలీనం చేసేందుకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కృషిచేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని అమలుచేస్తే కోట్ల కుటుంబంపై నియోజకవర్గ ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగే అవకాశముంది. విలీన ప్రక్రియను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే కోట్ల అధిష్ఠానం వద్ద గట్టిగానే కృషిచేస్తున్నట్లు తెలిసింది.

50 కిలోమీటర్ల దూరంలో ఉన్న..

50కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లేందుకు హైవే కూడా ఉంది. డోన్‌ నుంచి కర్నూలుకు ఒక గంట ప్రయాణం. డోన్‌ నుంచి నంద్యాలకు 80కిలోమీటర్లు ప్రయాణ కష్టాలతో ఇబ్బందులు పడాల్సిందే. డోన్‌ నుంచి బస్సులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. డోన్‌ నుంచి నంద్యాలకు వెళ్లాలంటే 3గంటలకు పైగానే ప్ర యాణం. నంద్యాలకు వెళ్లాలంటే డోన్‌, ప్యాపిలి మండలాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైతుల ఇబ్బందులు, నంద్యాల కలెక్టరేట్‌కు వెళ్లాలన్నా ప్రజలు, ఉద్యోగుల తిప్పలు వర్ణణాతీతం.

అడ్డగోలుగా విభజన

డోన్‌ నియోజకవర్గంలో బేతంచెర్ల, ప్యాపిలి, డోన్‌ మండలాలు ఉన్నాయి. మొత్తంగా నియో జకవర్గలో 2లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో డోన్‌ పట్టణం, మండలంలోని ఓటర్లు 80వేలకు పైగా ఉన్నారు. గతంలో కర్నూలు జిల్లాలోనే డోన్‌ నియోజకవర్గం కొనసాగుతూ వచ్చింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2022లో ఏప్రిల్‌లో డోన్‌ నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నంద్యాల జిల్లాలో విలీనం చేశారు. కర్నూలు జిల్లాకు ఉన్న అనుబంధాన్ని డోన్‌ నియోజకవర్గం కోల్పోయింది. ప్రజలకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అడ్డగోలుగా విభజించడంతో వైసీపీ ప్రభుత్వంపై డోన్‌, ప్యాపిలి మం డలాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి బుగ్గన ఓటమి చవి చూడడానికి కారణం ఇదేనని పలువురు మేధావులు, సంఘాల నాయకులు చర్చించుకుంటున్నాయి. పరిపాలనా, ప్రజల సౌలభ్యం కోసమైనా నంద్యాల నుంచి కర్నూలులో కలపాలని, డోన్‌, ప్యాపిలి మండలాల ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఏ చిన్నసమస్య వచ్చినా..

ఏ చిన్నసమస్య వచ్చినా, మీటింగుల కోసం నంద్యాలకు వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. నంద్యాలకు వెళ్లాలంటే ఒక్కరోజంతా సమయం పడుతుంది. కలెక్టరేట్‌ స్పందనకు అర్జీలు ఇవ్వడానికి దాదాపు 90 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. రవాణా సౌకర్యాలు కూడా సక్రమంగా లేవు.

ఎస్‌.అబ్దుల్‌ రెహమాన్‌,ఆవాజ్‌ కమిటీ కార్యదర్శి, డోన్‌

రవాణా ఖర్చులు ఎక్కువయ్యాయి

ఏ చిన్నసమస్య వచ్చినా నంద్యాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు పెరిగాయి. చిన్న వ్యాపారాలు చేసుకునే వారం. నంద్యాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. కర్నూలు జిల్లాలోనే డోన్‌, ప్యాపిలి మండలాలను కొనసాగించాలి.

వెంకట సుబ్బమ్మ, పూల వ్యాపారి, డోన్‌

సీఎం దృష్టికి తీసుకెళ్లా

ప్రజల సౌలభ్యం కోసం డోన్‌, ప్యాపిలి మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగేందుకు కృషి చేస్తున్నాం. ఈవిషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు సత్యనారాయణ ప్రసాద్‌, నాదెండ్ల మనోహర్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, అనిత, నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకెళ్లాను. సానుకూలంగా స్పందించారు.

కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, డోన్‌

Updated Date - Nov 09 , 2025 | 11:21 PM