అంబటి, శిల్పాపై పరువునష్టం దావా వేస్తా
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:19 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలపై పరువునష్టం దావా వేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలపై పరువునష్టం దావా వేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను శ్రీశైలానికి తాగి వచ్చానని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిలు ఆరోపించడం సరైనది కాదన్నారు. ‘వారేమైనా నాకు పెగ్గు కలిపారా, సోడా పోశారా..’ అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆరోజు తాను దోర్నాల చెక్‌పోస్టు వద్ద రాత్రి 9గంటల్లోపే దాటి వచ్చానని తాను శ్రీశైలానికి సుమారు 10గంటలకు చేరుకునే సమయానికి అటవీ మార్గంలో తనకు పలు వాహనాలు ఎదురయ్యాయన్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న అటవీ సిబ్బంది డబ్బులు వసూళ్లు చేసి చెక్‌పోస్టు నుంచి అనుమతించినట్లు తన దృష్టికి రావడంతో శిఖరం చెక్‌పోస్టు వద్ద పనిచేస్తున్న సిబ్బందిని విచారించి వారి ఫొటోలను తాను స్వయంగా తీశానని చెప్పారు. అదేక్రమంలో తమ పార్టీ కార్యకర్త అయిన ఇస్మాయిల్ అనే సిబ్బందితో చనువుగా మాట్లాడే క్రమంలో తాను కొట్టానని కొందరు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా చేస్తానని హెచ్చరించారు. అటవీ శాఖలో జరిగిన అవినీతి, చెంచులపై వేధింపులపై నివేదిక తయారు చేస్తున్నాన న్నారు. ఆ నివేదికను త్వరలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేస్తానని తెలిపారు.