అధికారం లేని పదవులు ఎందుకు..?
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:40 PM
అధికారం లేని పదవులు తమకు ఎందుకుని, గత వైసీపీ ప్రభుత్వంలో మార్కెట్ కమిటీల చైర్మన్లకు ఉన్న అధికారాలన్నీ తొలగించారని ఉమ్మడి జిల్లాకు చెందిన మార్కెట్ కమిటీల చైర్మన్లు అన్నారు.
వైసీపీ పాలనలో మార్కెట్ కమిటీలన్నీ నిర్వీర్యం
ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీల చైర్మన్లు
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అధికారం లేని పదవులు తమకు ఎందుకుని, గత వైసీపీ ప్రభుత్వంలో మార్కెట్ కమిటీల చైర్మన్లకు ఉన్న అధికారాలన్నీ తొలగించారని ఉమ్మడి జిల్లాకు చెందిన మార్కెట్ కమిటీల చైర్మన్లు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని 15 మార్కెట్ కమిటీల చైర్మన్లు కర్నూలు మార్కెట్ యార్డులో సమావేశమై మాట్లాడారు. తమకు గతంలో టీడీపీ హయాంలో కొనసాగించిన అధికారాలు ఇవ్వాలని, నిర్వీర్యమైన మార్కెట్ కమిటీ యార్డుల పునరుజ్జీవనం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొర పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మార్కెట్ కమిటీల చైర్మన్లకు ఇవ్వాల్సిన అధికారాలు, రైతులకు కల్పించాల్సిన ప్రయోజనాలు, వసతుల గురించి సమావేశంలో చర్చించారు. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత లింక్ రోడ్లపై మార్కెట్ కమిటీల పాలక మండలికి అధికారాలు కల్పించాలని చైర్మన్లు రైతులకు, ప్రజలకు కూటమి ప్రభుత్వంలో రైతుల కోసం అమలు చేస్తున్న ప్రయోజనాలు, పథకాలు, కార్యక్రమాల గురించి అందరికీ తెలియాలంటే మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలం కేవలం ఒక సంవత్సరంతో సరిపుచ్చకుండా మూడు సంవత్సరాలకు పొడిగించాలని ముఖ్యమంత్రికి పంపిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీల చైర్మన్లకు చెక్‌పవర్ ఇచ్చారనీ, వైసీపీ పాలనలో ఆ అధికారాన్ని రద్దు చేయడం వల్ల కేవలం చైర్మన్లు అలంకార ప్రాయంగా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్కెట్ కమిటీల చైర్మన్లకు నెలకు రూ.30వేల వేతనం అందిస్తున్నారని, అదే మొత్తాన్ని ఏపీలో కూడా అందించాలని ప్రముఖ దేవాలయాల్లో ప్రొటోకాల్ కల్పించి గౌరవాన్ని అందించాలని మొర పెట్టుకున్నారు. సమావేశంలో కర్నూలు మార్కెట్ కమిటటీ చైర్‌పర్సన్ గోల్కొండ అజ్మిత్‌బీ, పాణ్యం మార్కెట్ చైర్‌పర్సన్ గీతా, సుజాతమ్మ, హరిబాబు, నబీ రసూల్, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.