Share News

ఎందుకీ వివక్ష..

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:35 PM

ఎందుకీ వివక్ష..

ఎందుకీ వివక్ష..
అసంపూర్తిగా హంద్రీ నీవా పత్తికొండ జలాశయం

అసంపూర్తిగా పందికోన జలాశయం, కుడి, ఎడమ కాలువ

రూ.210 కోట్లు ఇస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు

ప్రతిపాదనల ఫైలు వెనక్కి

రెండుగా విడదీసి మళ్లీ ప్రతిపాదనలు తయారు చేయమని సూచన

అనంతపురం జిల్లాకు ఐదు ప్రాజెక్టులకు రూ.2,310 కోట్లు

కర్నూలు జిల్లాపై ఎందుకు నిర్లక్ష్యం

ఏమాత్రం పట్టించుకోని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు

హంద్రీ నీవా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పందికోన జలాశయం, కుడి ఎడమ కాలువలపై పదేళ్ల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అది సాకారం కావాలంటే రూ.210 కోట్లు ఇవ్వాలి. ఈ మేరకు ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. నిధులు ఇవ్వకపోగా రిజర్వాయరుకు, కాలువలకు వేర్వేరుగా రెండు ప్రతిపాదనలు పంపాలని ఉచిత సలహా ఇచ్చి ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. అదే అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా ప్రాజెక్టుకు అనుబంధంగా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు రూ.2,310 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమే. కరువు, వలసలతో తల్లడిల్లే కర్నూలు జిల్లాపై ఎందుకీ వివక్ష చూపడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు మేల్కొనాలి.. సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయినా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాలని రైతులు కోరుతున్నారు. నిధులిస్తే ఈ వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉంది. ప్రతిపాదనలతో కాలయాపన చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

కర్నూలు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 8 టీఎంసీలు వాడుకొని నందికొట్కూరు, పాణ్యం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. 0.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కృష్ణగిరి జలాశయం కింద 5.100 ఎకరాలు, 1.126 టీఎంసీల సామర్థ్యంతో పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ కింద 10,774 ఎకరాలకు, ఎడమ కాలువ కింద 50,626 ఎకరాలు కలిపి 61,400 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తే పత్తికొండ, దేవనకొండ, ఆస్పరి మండలాలు పచ్చని పైర్లతో సస్యశ్యామలమవుతాయి. కరువు, వలసలు నివారించే అవకాశం ఉంది. అయితే జలాశయం, కుడి, ఎడమ ప్రధాన కాలువలు, పంట కాలువలు అసంపూర్తిగా వదిలేశారు. ఫలితంగా 16-18 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందని దైన్యపరిస్థితి ఉంది. ఏళ్లు గడిచిపోతున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్పా అసంపూర్తి పనులపై పాలకులు దృష్టి సారించడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు. ఫలితంగా కళ్ల ముందే కృష్ణా జలాలు తరలిపోతున్నా కరువు రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు.

విడివిడిగా ప్రతిపాదనలు పంపండి..!

వైసీపీ హయాంలో రెండు మూడు పర్యాయాలు ప్రతిపాదనలు పంపినా నాటి జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూ.3,500 కోట్లతో రికార్డు స్థాయిలో హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తి చేశారు. పదేళ్లకు పైగా అసంపూర్తిగా వదిలేసిన పందికోన జలాశయం, కుడి, ఎడమ కాలువలు, పంట కాలువలు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని హంద్రీనీవా కాల్వ విస్తరణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పత్తికొండకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి రైతులు, ఇంజనీర్లు తీసుకువెళ్లారు. తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయమని ఆదేశించారు.

రిజర్వాయరు అసంపూర్తి పనులకు రూ.60 కోట్లు, కాలువల అసంపూర్తి పనులకు రూ.150 కోట్లు చొప్పున రూ.210 కోట్లు ఇస్తే అదనంగా 45 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని ప్రతిపాదనలు పంపించారు. నిధులు ఇవ్వకపోగా జలాశయానికి, కాలువలకు వేరువేరుగా రెండు ప్రతిపాదనలు తయారు చేసి పంపమని ఉచిత సలహా ఇస్తూ జలవనరుల శాఖ నుంచి ఫైలు వెనక్కి పడేశారు. నిధులు ఇవ్వకుండా కాలయాపన చేసేందుకే విడివిడిగా రెండు ప్రతిపాదనలు అంటూ మాయ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

సరిహద్దు జిల్లాకు రూ.2,310 కోట్లు

సరిహద్దు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్నా, 195 చెరువులకు హంద్రీనీవా జలాలు ఎత్తిపోసే ప్రాజెక్టుకు రూ.200 కోట్లు, రెండు టీఎంసీల సామర్థ్యంలో విస్తరించే జిల్లేడుబండ జలాశయానికి రూ.650 కోట్లు, జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రెండు టీఎంసీలు ఎత్తిపోసే అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు రూ.900 కోట్లు, జీడిపల్లి రిజర్వాయన్‌ నుంచి బైరవానితిప్ప(బీటీపీ) జలాశయానికి రెండు టీఎంసీలు ఎత్తిపోతల పథకానికి రూ.560 కోట్లు చొప్పున ఐదు ప్రాజెక్టులకు రూ.2,310 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ జిల్లా ప్రజాప్రతినిధులు పార్టీలకు అతితంగా జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించుకున్నారు. కానీ ఆ స్ఫూర్తి కర్నూలు జిల్లా ప్రతిప్రతినిధుల్లో లోపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 45 వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే పందికోన జలాశయం, కాలువల అసంపూర్తి పనులకు నిధులు ఇవ్వకపోవడం జిల్లాపై పాలకుల వివక్షే కరణమా..? జిల్లా ప్రజా ప్రతినిధుల వైఫల్యమా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి నిధులు రాబట్టేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. నేతలు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని రాయలసీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.

విడివిడిగా ప్రతిపాదనలు పంపమన్నారు

హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పందికోన జలాశయం, ఆ రిజర్వాయర్‌ కుడి, ఎడమ పంట కాలువల అసంపూర్తి పనులు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ఆ పనుల కోసం రూ.210 కోట్లు నిధులు అవసరం ఉందని ప్రతిపాదనలు తయారు చేశాం. ఒకే ప్రతిపాదన వద్దని రిజర్వాయరు, కాలువలకు విడివిడిగా రెండు ప్రతిపాదనలు తయారు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆ మేరకు మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం.

- నాగరాజు, సీఈ, హంద్రీ నీవా ప్రాజెక్టు, అనంతపురం

Updated Date - Dec 08 , 2025 | 11:35 PM