Share News

రథసారథి ఎవరో?

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:18 PM

టీడీపీ జిల్లా సారథిగా ఎవరన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానం కోసం ‘త్రీమెన్‌ కమిటీ’కి 12 దరఖాస్తులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రథసారథి ఎవరో?

టీడీపీ అధ్యక్ష అధ్యక్ష స్థానానికి డిమాండ్‌

12 మంది దరఖాస్తులు

నంద్యాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా సారథిగా ఎవరన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానం కోసం ‘త్రీమెన్‌ కమిటీ’కి 12 దరఖాస్తులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో త్రీమెన్‌ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గుంటూరు మేయర్‌ వెలగమూడి నాని, ఏపీఎ్‌సఆర్టీసీ కడప జోన్‌ చైర్మన్‌ పూల నాగరాజులు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపీ, ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌గౌడ్‌, హైకోర్టు న్యాయవాది ఆళ్లగడ్డకు చెందిన గోగిశెట్టి నరసింహారావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫీరోజ్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తులసీరెడ్డి, సీనియర్‌ న్యాయవాది, మాజీ కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామచంద్రరావు, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ మహే్‌షనాయుడు, కాకరవాడ చిన్న వెంకటస్వామి, భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఊహించని రీతిలో డజనుమంది అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోవడంతో త్రీమెన్‌ కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో బలమైన పోటీ మాత్రం గోగిశెట్టి నరసింహారావు, ఎన్‌ఎండీ ఫిరోజ్‌, రాజశేఖర్‌గౌడ్‌, ధర్మవరం సుబ్బారెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, తులసీరెడ్డి, రామచంద్రరావు మధ్య నెలకొంది. మొత్తం మీద దరఖాస్తులను స్వీకరించిన త్రీమెన్‌ కమిటీ ముగ్గురి పేర్లను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలియజేశారు.

Updated Date - Aug 26 , 2025 | 11:18 PM