Share News

గంగమ్మ చెరువుకు దిక్కెవరు?

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:16 AM

కర్నూలు మండలం బి. తాండ్రపాడు గ్రామాన్ని ఆనుకొని పురాతన గంగమ్మ చెరువు ఉంది. వర్షాకాలంలో నిండుకుండలా కళకళలాడేది

గంగమ్మ చెరువుకు దిక్కెవరు?
బి. తాండ్రపాడు గంగమ్మ చెరువు

వైసీపీ హయాంలో 12 ఎకరాలు పూడ్చేసి కబ్జా

నాడు చక్రం తిప్పిన నంబరు-2గా ఉన్న ఓ మంత్రి

ఆయన ఒత్తిడితో విచారణ నివేదికలే మార్చేసిన నాటి ఉన్నతాధికారి..?

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన మాజీ ఎంపీపీ డి. రాజవర్ధన్‌

చెరువు పునరుద్ధరణ చర్యలేమయ్యేను?

కర్నూలు మండలం బి. తాండ్రపాడు గ్రామాన్ని ఆనుకొని పురాతన గంగమ్మ చెరువు ఉంది. వర్షాకాలంలో నిండుకుండలా కళకళలాడేది. ఈ చెరువు వల్ల భూగర్భ జలాలు పెరిగి.. మూడు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉండే బోరుబావులు రీచార్జ్‌ అయ్యేవి. సాగునీటి అవసరం తీరేది. పశువుల దాహం తీర్చే జలపుంతలా గంగమ్మ చెరువు ఆదుకొనేది. ఇదంతా ఒకప్పటి మాట. కర్నూలు నగర విస్తీర్ణం పెరగడంతో చెరువు పరిసరాల్లో రియల్‌ వెంచర్లు వెలిశాయి. ఎకరం రూ.10 కోట్లకు పైగా పలుకుతోంది. వైసీపీ హయాంలో చెరువుపై అక్రమార్కులు కన్ను పడింది. అప్పటి ప్రభుత్వంలో నెంబరు-2గా చెలామణి అయిన ఓ మంత్రి అండదండలతో ఏకంగా 12 ఎకరాలకు పైగా చెరువును మట్టితో పూడ్చేశారు. ఆ స్థలం విలువ రూ.120 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆ భూమి చెరువుకు సంబంధించిందని కాదని, పట్టా భూమి.. అని రెవిన్యూ అధికారులు అక్రమార్కులకే వంత పాడారు. ఇప్పుడు గంగమ్మ చెరువు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

కర్నూలు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మండలం బి. తాండ్రపాడు గ్రామాన్ని ఆనుకొని (కర్నూలు నగర శివారు) సర్వే నంబర్లు 76, 77, 78, 79, 80, 81/1, 299, 301, 309, 310 పరిధిలో 53.86 ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ చెరువు ఉంది. జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం చెరువు పూర్తి నిల్వ నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌) 310.180 మీటర్లు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 12.309 ఎంసీఎఫ్‌టీ. బి. తాండ్రపాడు గ్రామానికి చెందిన 62 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ చెరువు ఆనుకొని వందల ఎకరాల్లో జగన్నాథగట్టు ఉండడంతో వర్షాకాలం ఆ గట్టుపై పడిన వర్షం చెరువులో చేరుతుంది. ఒక్క వర్షం కురిసినా చెరువు నిండుతుంది. ఆయకట్టు పొలాలకు నీరు అందించడమేగాక భూగర్భ జలాలు కూడా ఈ చెరువు వల్ల పెరుగుతాయి. చెరువు దిగువన 3-4 కిలోమీటర్ల వరకు బోరుబావులు రీచార్జ్‌ అవుతాయని ఇరిగేషన్‌ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో ఉన్న గంగమ్మ చెరువును 2005 ఆగస్టు 23న చిన్ననీటి పారుదల శాఖకు అప్పగించారు. 20 ఏళ్లుగా మైనర్‌ ఇరిగేషన్‌ పర్యవేక్షణలో కొనసాగుతోంది. తూములు, కాలువలు కూడా ఉన్నాయి. ఈ చెరువు మరమ్మతు పనులు కూడా చేశారు. చెరువును పూర్తిస్థాయిలో ఆధునికీకరణ కోసం 2015 జూలై 21న రూ.90 లక్షలు నిధులు మంజూరు చేస్తూ అప్పటి ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ జీవో ఆర్‌టీ నంబరు.479 జారీచేశారు. అయితే.. వివిధ కారణాల వల్ల పనులు మొదలు కాలేదు. ఆయకట్టుతో పాటు బి. తాండ్రపాడు గ్రామంతో పాటు నగరంలోని వివిధ కాలనీల పశువులకు దాహం తీర్చేందుకు ఆధారంగా ఉంది. చెరువు పరిసరాల్లో రియల్‌ వెంచర్లు వేయ డంతో చెరువు ఆయకట్టు కూడా కుచించుకు పోయింది. ఈ చెరువుకు సమీపంలోనే రాయలసీమ యూనివర్సిటీ, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ, ట్రిపుల్‌ ఐటీ ఎండీ కళాశాలతో పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. భూగర్భ జలాలు పెరిగి ఆయా కాలనీలకు దాహం తీరుస్తుందని ఇంజనీర్లు అంటున్నారు.

వైసీపీ రావడంతో అక్రమార్కులు కన్నేశారు

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అక్రమార్కుల కన్ను గంగమ్మ చెరువుపై పడింది. ఎప్పుడో 1932 - 1946 మధ్యలో ఈ చెరువు భూముల్లో క్రయ విక్రయాలు జరిగాయనే రికార్డులు తెరపైకి తీసుకొచ్చారు. తాము కొనుగోలు చేశామని కర్నూలు, హైదరాబాద్‌కు చెందిన కొందరు ఏకంగా చెరువు ఫోర్‌షోర్‌ ఏరియాను అక్రమించి దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో మట్టి, ఎర్రగరుసుతో 1.20 మీటర్లు నుంచి 1.50 మీటర్ల వరకు పూడ్చేశారు. రియల్‌ వెంచర్లు వేసేందుకు సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నెంబరు-2గా చెలామణి అవుతున్న ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి ఓ మంత్రి, జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అక్రమార్కులకు అండగా నిలిచారు. ఇంకేముంది అధికారులు సైతం వారికే వంతపాడారు. ఆయకట్టు రైతులు చెరువును కాపాడమని చేసిన ఫిర్యాదులను ఆధికారులు పట్టించుకోలేదు. పోలీసులు బెదిరించడంతో బి. తాండ్రపాడు గ్రామస్తులు, రైతులు ఏమీ చేయలేకపోయారు. గరుసుతో పూడ్చేసిన చెరువు భూభాగంలోకి ఇతరులు ఎవరు రాకుండా చుట్టూ పిల్లర్లు పాతి, ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు చెరువు ఆక్రమణను ప్రత్యేక్షంగా చూసి వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫలించిన రాజవర్ధన్‌రెడ్డి పోరాటం

ఆక్రమణల నుంచి బి. తాండ్రపాడు చెరువును, పర్యావరణాన్ని సంరక్షించాలని కోరుతూ టీడీపీ యువ నాయకుడు, కర్నూలు మాజీ ఎంపీపీ డి. రాజవర్థన్‌ రెడ్డి 2021లో చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌) ఆశ్రమించారు. ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ అప్టికేషన్‌ నంబరు-193/2021(ఎస్‌జడ్‌) విచారణ చేపట్టింది. విచారణ సాగుతుండగానే రాజవర్థన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన తండ్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు, కేడీసీసీబీ చైర్మన్‌ డి. విష్ణువర్ధన్‌రెడ్డి కేసును కొనసాగించాడు. కర్నూలుకు చెందిన న్యాయవాదులు బి. మోహన్‌కృష్ణ, సాయిసత్య బలమైన వాదనలు వినిపించారు. అదే సమయంల్‌ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు కర్నూలు ఆర్డీవో, తహసీల్దారు, కర్నూలు మైనర్‌ ఇరిగేషన్‌ డివిజన్‌ ఈఈ, సబ్‌ డివిజన్‌ డీఈఈ, ఏఈ కమిటీ గ్రామస్థులతో కలసి క్షేత్రస్థాయిలో విచారించింది. రెవెన్యూ రికార్డులు కూడా పరిశీలించింది. పూర్తి వివరాలతో విచారణ నివేదికను గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు పంపించారు. అయితే.. ఈ నివేదిక తయారీలో వైసీపీ హయాంలోని కీలక మంత్రి ఒకరు ఒత్తిడి వల్ల అప్పటి జిల్లాకు చెందిన ఓ కీలకమైన ఉన్నతాధికారి నివేదికను పలుమార్లు మార్చి తయారు చేయించారనే ఆరోపణులు అప్పట్లో వెల్లువెత్తాయి. చెరువు పట్టా భూమినా, క్రయ విక్రయాలు జరిగాయా..? అన్న రెవెన్యూ రికార్డులు పక్కన పెడితే.. గంగమ్మ చెరువు విస్తీర్ణం 53.86 ఎకరాలు వర్గీకరణలో ప్రభుత్వ డ్రై భూమిగా చూపుతూ.. రిమార్క్‌ కాలంలో ఆర్‌ఎస్‌ఆర్‌-28 ప్రకారం ఇతరుల పేర్లు ఉన్నాయని నివేదికలో చూపారు. అలాగే.. చెరువు కింద 62 ఎకరాలు ఆయకట్టు ఉంటే.. నగరం పెరగడంతో 25-30 ఎకరాలకు తగ్గిందని చూపారు. బోరుబావుల రీచార్జ్‌, పశువులకు తాగునీరు ఆధారమని వివరించారు. చెరువు వల్ల 3-4 కి.మీల వరకు భూగర్భ జలాలు పెరుగుతున్నా యని, పరిసరాల్లో పలు ఉన్న విద్యా సంస్థలు ఉన్నాయని వివరించారు. సుదీర్ఘ విచారణ అనంతరం గంగమ్మ చెరువు అక్రమంగా పూడ్చివేతలను తొలగించడంతో పాటు చెరువును పునరుద్ధరించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం

బి. తాండ్రపాడు గంగమ్మ చెరువులో ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధరించమని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గంగమ్మ చెరువును పునరుద్ధరణ చర్యలు తీసుకుంటాం.

బాలచంద్రారెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, కర్నూలు

Updated Date - Jul 06 , 2025 | 12:16 AM