Share News

గుండెకు చికిత్స ఏదీ..?

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:10 AM

నంద్యాల జిల్లాగా అవతరించినా.. నేటికీ జిల్లా వాసులకు వైద్య సేవలు అంతంత మాత్రమే. ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్‌)గా స్థాయిని పెంచారు. అయినా నిర్లక్ష్యపు నీడలో జీజీహెచ్‌ కొట్టుమిట్టాడుతోంది.

గుండెకు  చికిత్స ఏదీ..?
నంద్యాల, వైద్యశాల, ఆసుపత్రిలోని ఐసీయూ వార్డు

నంద్యాల జిల్లాగా అవతరించినా.. నేటికీ జిల్లా వాసులకు వైద్య సేవలు అంతంత మాత్రమే. ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్‌)గా స్థాయిని పెంచారు. అయినా నిర్లక్ష్యపు నీడలో జీజీహెచ్‌ కొట్టుమిట్టాడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సిందే. కనీసం కార్డియాలజీ డిపార్ట్‌మెంటు లేదు. కార్డియాలజిస్టు ఊసే లేదు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తాత్కాలిక వైద్యంచేసి కర్నూలుకు రెఫర్‌ చేస్తున్నారు. జిల్లాలో హృద్రోగ బాధితులు అధికంగా ఉన్నట్లు ఇటీవలే సర్వేలో వెల్లడైంది. ఈ ఆసుపత్రిలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.

కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లేని జీజీహెచ్‌.. ఊసే లేని కార్డియాలజిస్టులు

హృద్రోగులకు తప్పని తిప్పలు

అత్యవసరమైతే ప్రైవేటుకు వెళ్లాల్సిందే..

ఆస్పత్రి స్థాయి పెరిగినా.. నిర్లక్ష్యం

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పేరుకే ప్రభుత్వ సర్వజన వైద్యశాల. అక్కడ వైద్యసేవలు మాత్రం అంతంత మాత్రమే. ముఖ్యంగా గుండె చికిత్సకు సంబంధించి ఎలాంటి వైద్యం ఇక్కడ అందదు. అత్యవసరమైతే ప్రాణా లు అనంత వాయువుల్లో కలవాల్సిందే. గుండె సంబంధిత వ్యాధుల రోగులు జీజీహెచ్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారు. జీజీహెచ్‌లో కార్డియాలజి డిపార్ట్‌మెంట్‌ లేకపోవడమేకాక గుండె వైద్యనిపుణులు ఒక్కరూ కూడా లేరు. దీంతో గుండె సంబంధిత రోగులను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకొని ఎమర్జెన్సీ వార్డులో తాత్కాలిక చికిత్సలు నిర్వహించి కర్నూలుకు పంపుతున్నారు. కొందరు వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర నిమిత్తం ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.

జీజీహెచ్‌కు గుండెకు సంబంధించిన రోగులు వెళ్లినా వారికి ఎమర్జెన్సీగా ఇంజెక్షన్‌ టెనెక్టిక్‌ ప్లేస్‌ను ఇంజెక్షన్‌ వేసి కార్డియాలజిస్ట్‌ సూచనల మేరకు రోగులకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఈఇంజెక్షన్‌ విలువ దాదాపు రూ.40వేల వరకు ఉంటుంది. ఇది రోగులకు నంద్యాల జీజీహెచ్‌లో ఉచితంగానే అందిస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రమైన తర్వాత జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)గా మార్చారు. అయితే జిల్లా కేంద్రంలో కార్డియాలజి డిపార్ట్‌మెంట్‌ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రికి నంద్యాల పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారు. ఇటీవల రాష్ట్ర సర్వేలో నంద్యాల జిల్లాలో గుండెవ్యాధి గ్రస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇంత ప్రాధాన్యత ఉన్న కార్డియాలజి విభాగం ఏర్పాటుచేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. ఆస్పత్రి స్థాయిని పెంచారేగాని వైద్యులను నియమించడంలో మరిచిపోయారని పలువురు విమర్శిస్తున్నారు.

ఈనెల 25వ తేది యాల్లూరు గ్రామానికి చెందిన వెంకటేష్‌ నంద్యాల జీజీహెచ్‌కు చికిత్స కోసం వచ్చాడు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్న వెంకటే్‌షకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఎమర్జెన్సీగా రాత్రికిర్రాతే వెంకటే్‌షను కర్నూలుకు తీసుకుపోయారు. పేద కుటుంబానికి చెందిన వెంకటేష్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లలేక కర్నూలు జీజీహెచ్‌కు వెళ్లాడు. ప్రతిరోజు నంద్యాల జీజీహెచ్‌కు 10నుంచి 15మంది గుండె సంబంధిత రోగులు వస్తుంటారు. ఆస్పత్రి స్థాయి పెరగడంతో రోగులు హుటాహుటిన గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స ఉంటుందని ఆస్పత్రికి వస్తున్నారు. తీరా ఆస్పత్రికి వచ్చిన తర్వాత గుండెవైద్య నిపుణులు లేరని తెలియడంతో ఎక్కడికివెళ్లాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ విభాగం నంద్యాల జీజీహెచ్‌లో ఏర్పాటు చేయాలని సర్వత్రా కోరుతున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:10 AM