‘యువత’ పోరు ఎక్కడ?
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:05 AM
‘యువత’ పోరు ఎక్కడ?
కనబడని విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు
అందరూ వైసీపీ నాయకులు, కార్యకర్తలే..
నంద్యాల నూనెపల్లె, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): యువత పోరులో విద్యార్థులు, నిరుద్యోగులు కనపడలేదు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు, నిరుద్యోగులు దగా పడ్డారని యువత పోరు పేరిట కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచారు. అయితే అందుకు భిన్నంగా బుధవారం చేపట్టిన యువత పోరులో విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు కనిపించకపోవడం గమనార్హం. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన మాజీలు, ద్వితీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారు. బుధవారం ఉదయం స్థానిక నూనెపల్లె సెంటర్‌లో వైసీపీ నాయకుల హడావుడితో స్థానికులకు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అయిదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు ఏమి చేయకపోగా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసినా అర్థం పర్థంలేని కార్యక్రమాలు దేనికంటూ ప్రజలు పెదవి విరిచారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, ప్రతి ఏడాది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టి ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత వైసీపీకి బుద్ధి చెప్పినా మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.
పోరులో పాల్గొన్న వైసీపీ మాజీలు, నాయకులు
యువత పోరులో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన యువత పోరు కార్యక్రమం జరిగింది. కూటమి పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటూ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఇంచార్జి డా.సుధీర్, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షుడు అమిర్‌బాషా తదితర నాయకులు, కార్యకర్తలు నూనెపల్లె నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలో భారీఎత్తున పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. వైసీపీ శ్రేణులను నిలువరించారు. కేవలం ప్రధాన నాయకులనే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో మాజీ ఎంపీతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, నంద్యాల మున్సిపల్ చైర్మన్లు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్‌లకు మాత్రమే కలెక్టర్ చాంబర్‌లోకి అనుమతించారు. కలెక్టర్‌కు వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆవరణలో మీడియాతో మాట్లాడారు.