Share News

ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోరా?

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:22 AM

వైసీపీ పాలనలో భూకబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను యధేచ్ఛగా ఆక్రమించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ విషయాలన్నీ ఆధారాలతో బైటికి వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వెరసి రెండు ప్రభుత్వాలు ఒకేలా పని చేస్తున్నాయని ఆవుకు గ్రామ కంఠంలోని చాకిరేవు తిప్ప ఆక్రమణ ఉదంతం రుజువు చేస్తోంది. దీనిపై గత నెల 14వ తేదీన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది

ఆక్రమణదారుడిపై  చర్యలు తీసుకోరా?
ఆక్రమణకు గురైన చాకిరేవు తిప్ప

చాకిరేవు తిప్ప కబ్జాదారుడికి ఓ అధికారి అండదండలు ?

చర్యలు తీసుకోడానికి వెనుకాడుతున్న అధికారులు

బనగానపల్లె, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో భూకబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను యధేచ్ఛగా ఆక్రమించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ విషయాలన్నీ ఆధారాలతో బైటికి వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వెరసి రెండు ప్రభుత్వాలు ఒకేలా పని చేస్తున్నాయని ఆవుకు గ్రామ కంఠంలోని చాకిరేవు తిప్ప ఆక్రమణ ఉదంతం రుజువు చేస్తోంది. దీనిపై గత నెల 14వ తేదీన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ వెంటనే స్పందించి వెంటనే నివేదిక ఇవ్వాలని అవుకు తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డిని ఆదేశించారు. తహసీల్దార్‌ డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులును వివరణ కోరారు. అయినా స్పందన లేదని సమాచారం. చాకిరేవు తిప్ప ఆక్రమణ వెనుక ఓ అధికారి ఉన్నారని ఇప్పుడు స్పష్టమవుతోంది.

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు గ్రామ కంఠం పరిధిలో సర్వేనెంబర్‌ 839/ఏ1, ఏ3 లో గంగమ్మ ఆలయం వద్ద 15 ఎకరాల్లో ప్రభుత్వ స్థలం చాకిరేవు తిప్ప ఉంది. అవుకు పట్టణానికి చెందిన ఓ మహిళ చాకిరేవు తిప్పలో 484 చదరపు గజాలు (10సెంట్లు) స్థలం వారసత్వంగా సంక్రమించి నట్లు ఎన్‌వోసీ పత్రాన్ని సంపాదించింది. ఆ పత్రం ఆధారంగా ఆస్తి సెటిల్‌మెంట్‌ దస్తావేజుగా తన కుమారుడికి 2024 జూన్‌ నెల 15వ తేదీన బనగానపల్లె సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ చేయించింది. ఈ డాక్యుమెంట్‌ నెంబర్లు 3843/2024, 3844/2024. సదరు మహిళ ప్రభుత్వ అధికారి సంతకాన్ని ట్యాంపరింగ్‌ చేసి, నకిలీ ఎన్‌వోసీ పత్రం సృష్టించి స్థలాన్ని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. అయినా చర్యలు తీసుకోడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రిజిస్ర్టేషన్‌ రద్దు చేసుకున్నట్లు మభ్యపెడుతున్న ఆక్రమణదారు

నకిలీ ఎన్‌వోసీతో ప్రభుత్వ స్థలం చాకిరేవు తిప్ప 10 సెంట్లు స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న బాగోతం వెలుగు చూడ టంతో భూకబ్జాదారుడు రిజిస్ర్టేషన్‌ను రద్దు చేసుకొనేందుకు పావులు కదిపాడు. జిల్లా రిజిస్ర్టార్‌ రిజిస్ర్టేషన్‌ రద్దుకు ఒప్పుకో నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికీ ఈసీలో ఆక్రమణదారుడి పేరుతోనే రిజిస్ర్టేషన్‌ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అక్రమ మార్గంలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నట్లు పూర్తి స్థాయిలో ఆధారాలతో అధికారుల దృష్టికి వచ్చి నెల రోజులు కావస్తున్నా ఆక్రమణ దారుడిపై చర్యల్లో జాప్యం జరుగుతోంది. చాకిరేపు తిప్ప సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ. 3 లక్షలు పైగానే పలుకుతోంది. అసలు ప్రభుత్వ స్థలానికి వారసత్వ హక్కు ఎలా కల్పిస్తారనేది కీలక ప్రశ్న. అప్పటి పంచాయతీ సెక్రటరీ పేరుతో జారీ అయినట్లు ఉన్న ఎన్‌వోసీ పత్రంలో పంచాయతీ కార్యాలయం రౌండు సీలు లేదు. తేదీ లేదు. కర్నూలు జిల్లాగా ఉన్నపటికీ గత ఏడాది జూన్‌ నెలలో బనగానపల్లె, అవుకు సబ్‌ రిజిస్ర్టార్‌లు కాసులకు కక్కుర్తి పడి గ్రామ కంఠం భూములను రిజిస్ర్టేషన్‌ చేయటం గమనార్హం.

చర్యలు తీసుకుంటాం

ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఆధారంగా ప్రభుత్వ స్థలమైన చాకిరేవు తిప్పను ఓ మహిళ నకిలీ ఎన్‌వోసీ ఆధారంగా తన కుమారుడికి 10 సెంట్లు స్థలం రిజిస్ర్టేషన్‌ చేయించినట్లు గుర్తించాం. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ నివేదిక కోరారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులును వివరణ అడిగాను. కానీ ఆయన నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. త్వరలో ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకుంటాం.

- మల్లికార్జునరెడ్డి, తహసీల్దార్‌, అవుకు

Updated Date - Dec 18 , 2025 | 12:22 AM