స్థూల ఉత్పాదకతలో మనమెక్కడ?
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:59 PM
జిల్లా స్థూల ఉత్పాదకత(జీడీడీపీ)లో వృద్ధిరేటులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన స్థూల విలువ జోడింపు (జీవీఏ) సాధిస్తే, వ్యవసాయ రంగంలో భారీగా తగ్గుదల కనిపించింది.
2025-26 జీడీడీపీ లక్ష్య సాధనలో కర్నూలు జిల్లా 17.. నంద్యాలకు 23వ ర్యాంకు
పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన జీవీఏ సాధిస్తే.
వ్యవసాయంలో భారీ తగ్గుదల
కర్నూలు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థూల ఉత్పాదకత(జీడీడీపీ)లో వృద్ధిరేటులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన స్థూల విలువ జోడింపు (జీవీఏ) సాధిస్తే, వ్యవసాయ రంగంలో భారీగా తగ్గుదల కనిపించింది. ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పతనం కావడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటుకు సూచిక అయినా వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాల్లో సాధించే జీడీడీఏ నిలుస్తుంది. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పాదకత (జీఎస్‌డీపీ) అంచనా వేస్తారు. ఈ అంచనా మేరకు వివిధ రంగాల్లో సాధించిన పురోగతిలో రెండు జిల్లాలు ఏ గ్రేడ్ నమోదు చేసుకున్నాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతో మెరుగైన స్థానాలు దక్కాయి. బుధవారం సీఎం చంద్రబాబు అమరావతి లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలు జీడీడీపీలో ఏ స్థాయిలో ఉన్నాయి..? వివిధ రంగాల్లో సాధించిన పురోగతి ఎంత..? వంటి అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సక్సెస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించడంలో కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు 75-100 శాతం సక్సెస్ రేటు సాధించారు. జూన్ 15 నుంచి సెప్టెంబరు 14 వరకు ఆర్థిక పరమైన, నిధులు సంబంధం లేని వ్యక్తిగత సమస్యలు కర్నూలు జిల్లాలో 5,837 ఫిర్యాదులు వస్తే 95 శాతం పరిష్కరించి వంద శాతం పాజిటీవ్ రేటు సాధించారు. నంద్యాల జిల్లాలో 4,521 సమస్యలు వస్తే మెజార్టీ సమస్యలు పరిష్కరించి 99 శాతం పాజిటీవ్ రేట్ సాధించారు.
కర్నూలుకు 17, నంద్యాల 23వ ర్యాంకు
జిల్లా ఆర్థికంగా ఏ స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందో చెప్పే సూచిక జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ). 2025-26లో జీడీడీపీ లక్ష్యం, సాధించిన పురోగతి రికార్డులు పరిశీలిస్తే, రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా బాగా వెనుకపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో జీవీఏ లక్ష్యం కర్నూలు జిల్లా రూ.61,630 కోట్లు కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.23,369 కోట్లు రాబట్టి 37.92 శాతం చేరుకున్నారు. అక్టోబరు నుంచి మార్చి 2026 వరకు రూ.38,269 కోట్లు (62.08 శాతం) సాధించాల్సి ఉంది. రాష్ట్రంలో 17వ ర్యాంకు సాధించింది. నంద్యాల జిల్లా జీవీఏ పరిశీలిస్తే, రూ.50,702 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే రూ.19,490 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. రూ.31,212 కోట్లు (61.56) మార్చి-2026లోగా సాధించాల్సి ఉంది. రాష్ట్రంలో 23వ ర్యాంకుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ‘సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు మూడు నెలల్లో ఆశాజనంగా జీవీఏ సాధించామని, వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి లక్ష్యం చేరుకునే దిశగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పతనం కావడం జిల్లా స్థూల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతోంది..’ అని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు.
పరిశ్రమలు, సేవా రంగాలు భేష్
పరిశ్రమలు, సేవా రంగాల్లో మెరుగైన జీవీఏ సాధించి జీడీడీపీ వృద్ధితో పాటు రాష్ట్ర స్థూల ఉత్పాదకత(జీఎస్‌డీపీ) వృద్ధిలో కర్నూలు, నంద్యాల జిల్లాలు తమ వంతు బాధ్యతగా నిలిచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పారిశ్రాఆమిక రంగంలో జీవీఏ లక్ష్యం, ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు, అక్టోబరు నుంచి మార్చి-2026 వరకు సాధించిన, సాధించాల్సిన రాబడి లెక్కలను విశ్లేషిస్తే.. కర్నూలు జిల్లాలో రూ.11,657 కోట్లు లక్ష్యం కాగా, గడిచిన ఆరు నెలల్లో రూ.4,981 కోట్లు (42.73 శాతం) రాబట్టింది. వచ్చే ఏడాది మార్చిలో రూ.6,676 కోట్లు (57.27 శాతం) రాబట్టాలని లక్ష్యం నిర్ణయించారు. నంద్యాల జిల్లా రూ.7,886 కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఏప్రిల్-సెప్టెంబరు వరకు ఆరు నెలల్లో రూ.3,914 కోట్లు (49.63 శాతం) సాధించి రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.3,972 కోట్లు (50.37 శాతం) రాబట్టాల్సి ఉంది. అయితే చివరి ఆరు నెలల టార్గెట్‌లో గడిచిన మూడు నెలల్లో 45-50 శాతానికి పైగా వసులు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే సేవా రంగాన్ని పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో రూ.25,927 కోట్లు లక్ష్యం కాగా, ఆరు నెలల్లో రూ.12,058 కోట్లు (46.51 శాతం) సాధిస్తే, రాబోయే మార్చి నాటికి రూ.13,869 కోట్లు (53.49 శాతం) రాబట్టాలని లక్ష్యం. నంద్యాల జిల్లాలో రూ.18,266 కోట్లు లక్ష్యం కాగా, ఆరు నెలల్లో రూ.8,181 (44.79 శాతం) సాధిస్తే, మిగిలిన ఆరు నెలల్లో రూ.10,085 కోట్లు (55.21 శాతం) రాబట్టేందుకు లక్ష్యం నిర్ధేశించారు.
వ్యవసాయ రాబడిపై ధరల ప్రభావం
మెరుగైన స్థూల విలువ జోడింపు (జీవీఏ) సాధించి జీడీడీపీ, జీఎస్‌డీపీ వృద్ధి రేటులో వ్యవసాయ రంగానిదే కీలకం. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు, పతనమైన ధరలు జీవీఏ లక్ష్య సాధనంలో అడ్డంకిగా నిలిచాయి. ఉమ్మడి జిల్లాలో ఉల్లి, పత్తి, వరి ధాన్యం, మొక్కజొన్న.. వంటి ధరలు పూర్తిగా పతనమైయ్యాయి. ఫలితంగా జీవీఏ సాధనంలో భారీగా వెనుపడాల్సి వచ్చింది. ఇతర జిల్లాలతో పోలిస్తే 19, 25వ స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈ రంగంలో జీవీఏ సాధనలో కర్నూలు జిల్లాలో రూ.19,985 కోట్లు రాబట్టాల్సి ఉంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.4,651 కోట్లు (24.50 శాతం మాత్రమే సాధించి రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. అక్టోబరు నుంచి మార్చి-2026 వరకు ఆరు నెలల్లో రూ.14,335 కోట్లు (75.50 శాతం) రాబట్టాల్సి ఉంటే అందులో 25-30 శాతం కూడా రాలేదని ఓ అధికారి తెలిపారు. నంద్యాల జిల్లా లక్ష్యం రూ.20,395 కోట్లు కాగా, తొలి ఆరు నెలల్లో రూ.5,996 కోట్లు(29.40 శాతం) సాధించి 19వ స్థానంలో నిలించింది. మిగిలిన ఆరు నెలల్లో రూ.14,399 కోట్లు (70.60 శాతం) సాధించాల్సి ఉంటే అందులో సగానికి అటుఇటుగా వచ్చిందని అధికారులు పేర్కొనడం కొసమెరుపు. అయితే ధరలు పతనం కావడంతో ఈ రంగంలో జీవీఏ లక్ష్యం 55-65 శాతానికి మించిదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయం, ఉద్యానవనం రంగాల్లో రాబడి తగ్గినా, అనుబంధ రంగాలైనా చేపలు, గుడ్లు, పాలు ఉత్పత్తి ఆశాజనంగా జీవీఏ సాధించడం కొసమెరుపు.
గృహ నిర్మాణ రంగంలో కాస్త మెరుగు
కర్నూలు జిల్లాలో పీఎంఏవై -1.0 కింద పేదలకు 65,482 పక్కా ఇళ్లు మంజూరు చేశారు. అందులో 47,682 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. 31,633 ఇళ్లను పూర్తి చేస్తే, 16,049 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం చేపట్టిన ఇళ్లలో 66 శాతం పురోగతి సాధించారు. నంద్యాల జిల్లాలో 59,564 ఇళ్లు మంజూరు చేస్తే 53,085 ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. అందులో 35,196 ఇళ్లు పూర్తి చేస్తే 17,889 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 66 శాతం పురోగతి సాధించారు. మిగిలిన మూడు నెలల్లో 34 శాతం ఇళ్లు పూర్తి చేయడం సాధ్యమా..? పలువురు సంధిస్తున్న ప్రశ్న ఇది. ఉమ్మడి జిల్లాలో ఓవరాల్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ (కేపీఐ)లో ఏ గ్రేడ్ దక్కించుకోవడం విశేషం.
2025-26 జీడీడీపీ లక్ష్యం, సాధించిన పురోగతి, సాధించాల్సిన లక్ష్యం (రూ.కోట్లల్లో)
వివరాలు కర్నూలు నంద్యాల
2025-26లో సాధించాల్సిన లక్ష్యం 61,630 50,702
ఏప్రిల్ - సెప్టెంబరు వరకు సాధించినది 23,369 19,490
శాతం 37.92 38.44
సెప్టెంబరు - మార్చి-2026 వరకు లక్ష్యం 38,261 31.212
శాతం 62.08 61.56
2025-26లో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు (రూ.కోట్లల్లో)
వివరాలు వ్యవసాయం పరిశ్రమలు సేవలు
కర్నూలు జిల్లా:
2025-26లో 19,985 11,651 25,927
సాధించాల్సిన లక్ష్యం
ఏప్రిల్ - సెప్టెంబరు 4,651 4,981 12,058
వరకు సాధించినది
శాతం 24.50 42.73 46.51
సెప్టంబరు - మార్చి-2026 14,335 6,676 13,869
వరకు లక్ష్యం
శాతం 75.50 57.27 53.49
నంద్యాల జిల్లా:
2025-26లో 20,395 7,866 18,266
సాధించాల్సిన లక్ష్యం
ఏప్రిల్ - సెప్టంబరు 5,996 3,914 8,181
వరకు సాధించినది
శాతం 29.40 49.63 44.79
సెప్టంబరు - మార్చి-2026 14,399 3,972 10,085
వరకు లక్ష్యం
శాతం 70.60 50.37 55.21