మద్దతు ధర ఏదీ..?
ABN , Publish Date - May 15 , 2025 | 12:05 AM
మద్దతు ధర ఏదీ..?
కల్లాల్లోనే వరి ధాన్యం
ప్రారంభించని కొనుగోలు కేంద్రాలు
పెరిగిన పెట్టుబడులు ఫ నష్టాల్లో అన్నదాతలు
హాలహర్వి, మే 14 (ఆంధ్రజ్యోతి): అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. అకాలవర్షాలు.. పాలకుల నిర్లక్ష్యం.. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ రైతుల కళ్లల్లో కన్నీటిని మిగిలిస్తున్నాయి. ఈ యేడాది రబీలో ఎల్లెల్సీ ఆయకట్టు కింద సాగుచేసిన రైతులు నష్టాలు బాట పట్టారు. జిల్లాలో సాగుచేసిన 80 వేల ఎకరాల్లో వరి పంట ధాన్యం కల్లాల్లోనే కొనేవారు లేక మిగిలిపోయింది. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్న ఆశలు అడియాశలయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట అమ్ముకోలేక నలిగిపోతున్నారు. గత్యంతరం లేక వచ్చిన వ్యాపారులకు బలవంతంగా వరి ధాన్యాన్ని అమ్మేసుకుని రైతులు నష్టాల పాలు అవుతున్నారు.
పెరిగిన కూలీల ధరలు
ఈ యేడాది కూలీల ధరలు విపరీతంగా పెరిగాయి. వరి నాటు వేసేటప్పుడు ఎకరాకు రూ.5 వేలు చేశారు. పెరిగిన పురుగు మందులు, రసాయన ఎరువులు కలిపి ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడులు వచ్చాయి. వీటితోపాటు దిగుబడులు తగ్గడంతో 35 బస్తాలు మించలేదు. కౌలు రైతులకు మరింత నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొనుగోలు కేంద్రాలు లేక..
రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులకు విక్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం తేమ ఉన్నాయని బరువు అని, తాలు మట్టి ఉన్నాయంటూ 73 కిలోల బస్తాకు మూడు కిలోల తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. కంప్యూటర్ కాటా లేకపో వడంతో తూకాల్లోనూ మోసాలు ఉన్నాయి. దీం తో ఒక బస్తాకు నాలుగైదు కిలోల తరుగు పేరుతో దగా చేస్తున్నారు. ధర సైతం రూ.1800 నుంచి రూ.1850కి కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు.
యంత్రాల కోసం..
అకాల వర్షాలు, ఈదురుగాలులు వరి రైతు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. త్వరగా కోతలు కోసుకోవాలంటే యంత్రాల కోసం ఎదురుచూ డాల్సిన పరిస్థితి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక ధరలకు యంత్రాలను తీసుకొచ్చి వరి కోతలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈదురుగాలులకు వరి పంట అంతా నేలకు ఒరగడంతో ఎకరా వరి కోత గంటకు పూర్తి కావాల్సిందిపోయి ఏకంగా గంటన్నర వరకు సమయం పట్టే పరిస్థితి నెలకొంది. దీన్ని అదునుగా భావించిన దళారులు వరికోత యంత్రాల రేట్లను పెంచేశారు. రూ.2500 ఉం డాల్సిన ధర గంటకు రూ.3200 పెంచేశారు. వరి కోతలన్నీ ఒకేసారి రావడంతో యంత్రా లకు మరింత డిమాండ్ పెరిగింది.
ఆత్మహత్యలే శరణ్యం
రైతుల ప్రభుత్వం ఆదుకోవాలి. లేందంటే ఆత్మహత్యలే శరణ్యం. రబీలో పండించిన వరి పంటను కొనేవారు లేరు. వాతావరణ పరిస్థితుల వల్ల మేమే బలవంతంగా దళారులు ఆశ్రయించి నష్టాలకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
- వీరేశప్ప, రైతు, గూళ్యం
కొనుగోలు కేంద్రాలకు అనుమతులు లేవు
రబీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. దళారుల వల్ల వాస్తవంగా రైతులకు నష్టం జరుగుతుంది.
- శివశంకర్, వ్యవసాయాధికారి, హాలహర్వి