అమృత్‌ధార ఏదీ?
ABN , Publish Date - May 20 , 2025 | 11:53 PM
పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కర్నూలు, నంద్యాల, ఆదోని మున్సిపాలిటీలను అమృత్ 2.0 కింద ఎంపిక చేశారు.
పట్టణ వాసులకు తీరని తాగునీటి కష్టాలు
నేటికీ శివారు కాలనీలకు ట్యాంకర్లతో నీళ్లు
అతీగతి లేకుండా ఆగిన పథకం
నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత వైసీపీ ప్రభుత్వం డీపీఆర్‌కే పరిమితం
కూటమి ప్రభుత్వంలోనైనా ముందుకు సాగేనా?
కర్నూలు న్యూసిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కర్నూలు, నంద్యాల, ఆదోని మున్సిపాలిటీలను అమృత్ 2.0 కింద ఎంపిక చేశారు. ఆయా పట్టణాల్లో పనులు చేపట్టడానికి 2023వ సంవత్సరంలో పనులకు పచ్చజెండా ఊపింది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ నిధులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవడంలో నాటి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మేధావులు చెబుతున్నారు. కనీసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించ లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. రూ.438.12 కోట్ల విలువైన ప్రాజెక్టు అతీగతి లేకుండా ఆగిపోయింది. కూటమి ప్రభుత్వమైనా దృష్టి సారించి వెంటనే డీపీఆర్‌లు సిద్ధంచేసి పనులు వేగవంతం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నగర శివారు కాలనీల్లో...
నగర పరిధిలో రూ.130 కోట్లతో పనులు ప్రతిపాదించారు. శివారు కాలనీలకు నేటికీ ట్యాంకర్లతోనే నీటి సరఫరా జరుగుతుంది. కల్లూరు పరిధిలో 16 వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. జగన్నాథగట్టు వద్ద 50 ఎంల్‌ఎడీ సామర్థ్యంతో నీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను కర్నూలు, కల్లూరు ప్రాంతాల్లో నీటి నిల్వ చేసుకునేందుకు 20 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలి. మూడు నియోజకవర్గాలకు సంబంధించి విలీనమైన మామిదాలపాడు, మునగాలపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాలతో పాటు వార్డులకు తాగునీటి సరఫరా కల్పించాల్సి ఉంది. విలీన గ్రామాలు, వార్డులను కలిపితే ఒక్కపూటకి 130 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాల్సిన చోట 95 ఎంఎల్‌డీ మాత్రమే చేస్తున్నారు. దీంతో నగరపాలక పరిధిలో నీటి కష్టాలు తొలగడం లేదు. ప్రస్తుతం అమృత్2.0 పథకంతోనైనా తాగునీటి కష్టాలు తీరాలంటే కూటమి ప్రభుత్వం డీపీఆర్‌లు పంపించాలని ప్రజలు కోరుతున్నారు. నగరపాలికతో పాటు ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లో కూడా ఇంకా డీపీఆర్ దశలోనే ఉన్నాయి. 2025-2026 సంవత్సరానికి ఈ పథకాన్ని పూర్తి చేయాల్సి ఉంది.
నంద్యాలలో రూ.174.52 కోట్లతో ఐదు పనులు ప్రతిపాదించారు. 37.22 కి.మీ. మూడు రకాల పైప్‌లైన్ నిర్మాణం, 12.50 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ తదితర పనులు చేపట్టాలన్నారు. శివారు కాలనీల పరిస్థితి నీటి సమస్య తో దయనీయ స్థితిలో ఉన్నాయి.
ఆదోని పట్టణానికి రూ.133.60కోట్లు విలువైన ఆరు పనులతో ప్రణాళికలు రూపొందించారు. శివారు కాలనీలలో తాగునీటి ఇబ్బందులు వేధిస్తున్నాయి. కొన్ని పనులు మధ్యలో ఆపేశారు.
పరిపాలన అనుమతులొచ్చాయి..
అమృత్ 2.0 పథకానికి సంబంధించి నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఇటీవల ప్రభుత్వం నుంచి డీపీఆర్‌కు సంబంధించి సవరించిన పరిపాలన అనుమ తులొచ్చాయి. ప్రస్తుతం నగర పరిధిలో 30 ఓవర్‌హెడ్ ట్యాంకులున్నాయి. ఈ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి ఇవ్వాలంటే మరో 20 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఎస్.రవీంద్రబాబు, నగర పాలక కమిషనర్, కర్నూలు