ఆ పథకాలేమయ్యాయి?
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:29 PM
ఆ పథకాలేమయ్యాయి?
సున్నా.. పావలా వడ్డీ పథకాలపై అయోమయం
ముందు రైతులు చెల్లించాలనే షరతుతో పథకాలకు దూరం
ఈ-క్రాప్‌తో చిక్కులు
గత ప్రభుత్వం బాటలోనే కూటమి ప్రభుత్వం పోతుందా?
కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 15వేల మంది రైతులు ఈ సంఘం ద్వారా పంట రుణాలు అందుకుం టున్నారు. గత వైసీపీ పాలనలో తెచ్చిన నిబంధనలతో సున్నా వడ్డీ పథకం కింద కేవలం వేయి మంది కూడా అర్హులు కాలేదు. రైతులే ముందుగా వడ్డీ చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం నిధుల లభ్యతను బట్టి ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందనే నిబంధన తీసుకురావడంతో సంఘం పరిధిలోని రైతులు నెత్తి నోరు కొట్టుకుం టున్నారు. మరో వైపు పొలాలను అభివృద్ధి చేసుకునేందుకు పాడిగేదెలు, పొట్టేళ్ల పెంపకంతో తమ జీవనాన్ని మెరుగుపరుచుకునేందుకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎత్తి వేయడంతో ఈ సంఘం కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి)
చెట్లమల్లాపురం గ్రామానికి చెందిన రైతు ఎల్లన్న మార్చి నెలాఖరులో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాడు. రెండు సంవత్సరాలైనా ఇతనికి ప్రభుత్వం నుంచి ఈ వడ్డీకి సంబంధించిన మొత్తం బ్యాంకు ఖాతాకు జమ కాలేదు. కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తమ చేతిలో ఏమీ లేదని ప్రభుత్వం సున్నా వడ్డీ మొత్తాన్ని ఎప్పుడు మీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తుందో తమకు తెలీదని ముఖం మీదనే అధికారులు చెప్పారు.
పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లో రైతులు ఖరీఫ్ పంట సాగు పూర్తి కాగానే కుటుంబ జీవనం కోసం వలస బాట పడుతున్నారు. రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను మరింతగా మెరుగులు దిద్ది ఎక్కువ మంది ప్రయోజనం అందుకునేలా చర్యలు చేపట్టాల్సిన పాలకులు లబ్ధ్దిదారుల వడపోత కోసం సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో 12 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది ప్రధాన పంటలను, కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ రైతులు పంట సాగు చేయడానికి సున్నావడ్డీ, పావలా వడ్డీ పథకాలను ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాయి.
సున్నా వడ్డీ పథకంపై నీలి నీడలు
గతంలో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పంట సాగు కోసం తీసుకుంటున్న పంట రుణాలపై ఏడు శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ తర్వాత క్రమంగా ఈ వడ్డీని కూడా పేద రైతులకు కట్టాల్సిన అవసరం లేకుండా సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ సున్నా వడ్డీ పథకం నిబంధనలను మార్చేయడంతో రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదు. ఆ ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు మొదట తాము తీసుకున్న పంట రుణంపై బ్యాంకులకు వడ్డీ చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం నిధుల అందుబాటును బట్టి రైతులు చెల్లించిన వడ్డీని తిరిగి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో తీసుకున్న పంట రుణంపై ఎంత వడ్డీ చెల్లించాలో ఆ వడ్డీని రైతులు ఆ సంవత్సరం మార్చి 31లోపు చెల్లించాలి. ఉదాహరణకు ఖరీప్‌లో పంట రుణం తీసుకున్న రైతు ఆ సంవత్సరం మార్చి నెలాఖరులోగా వడ్డీ చెల్లించాలి. గడువులోగా చెల్లించని రైతులకు సున్నా వడ్డీ పథకం వర్తించదు. అదే విదంగా రైతులు సాగు చేసిన పంటను ఖచ్చితంగా ఈక్రాఫ్‌లో నమోదు చేయించాలి. అయితే.. బ్యాంకుల్లో, సహకార సంఘాల్లో రైతులు తాము వాస్తవంగా సాగు చేసిన పంటను కాకుండా వేరే పంట సాగు చేసినట్లు ఈక్రాప్‌లో నమోదు చేయిస్తున్నారు. ఏ పంటకైతే ఎక్కువ రుణం వస్తుందో ఆ పంటనే తాము సాగు చేసినట్లు బ్యాంకులు, సహకార సంఘాల్లో నమోదు చేయిస్తున్నారు. అయితే.. రైతు సేవా కేంద్రాల్లో ఈక్రాప్ నమోదు ప్రక్రియ చేపట్టే సమయంలో ఏ పొలంలో ఏ పంట సాగు చేశారో ఆ పంటనే అఽధికారులు నమోదు చేస్తున్నారు. దీని వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుత్నుది. వాస్తవంగా సాగు చేసిన పంట ఒకటైతే.. రుణం తీసుకున్న బ్యాంకులు, సహకార సంఘాల్లో నమోదైన పంట వేరేగా ఉండటంతో ఆ రైతులకు సున్నావడ్డీ పథకం వర్తించడం లేదు. మొదట ఈ సున్నావడ్డీ పథకం అమలైన సమయంలో రైతులే వడ్డీ చెల్లించాలి.. ఈక్రాప్ జాబితాలో ఏ పంట నమోదైతేనే.. ఆ పంటకే సున్నా వడ్డీ వర్తిస్తుందని నిబంధనలు ఉండేవి కావు.. దీనివల్ల ప్రస్తుతం సున్నా వడ్డీ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో పంటలు సాగు చేస్తున్న పేద రైతులు నాలుగున్నర లక్షల మంది ఉంటే.. కేవలం వేల సంఖ్యలో రైతులకు మాత్రమే సున్నావడ్డీ పథకం అమలవుతుంది.
పావలా వడ్డీని పునరుద్ధ్దరించాలని డిమాండ్
గతంలో పావలా వడ్డీ పథకాన్ని అమలు చేసినట్లే ఇప్పుడు కూడా అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. గతంలో రూ. 3 లక్షల రుణం తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తించేది. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ పథకాన్ని మాయం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పావలా వడ్డీ పథకాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సున్నావడ్డీ పథకంపై ఇంకా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకపోవడంతో రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసేందుకు సున్నావడ్డీ పథకంతో పాటు పావలా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తాం
గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశాం. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకంపై ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చిన వెంటనే సున్నా వడ్డీ పథకం అమలుపై చర్యలు తీసుకుంటాం.
వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ
సున్నా వడ్డీ పథకం వర్తింపజేయాలి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ పథకం అరకొరగానే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నర లక్షల మంది పంట రుణాలు తీసుకుంటే కేవలం వేల సంఖ్యలోనే రైతులను లబ్ధిదారులుగా చేర్చారు. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. అలాగే పావలా వడ్డీ పథకాన్ని కూడా పునరుద్ధ్దరించాలి
రామకృష్ణ, రైతు సంఘం నాయకుడు