Share News

కోరిందేమిటి? ఇచ్చిందేమిటి?

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:38 PM

ప్రజాభీష్టం మేరకే విభజన, వారి అవసరాలు, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆదోని ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది.

కోరిందేమిటి? ఇచ్చిందేమిటి?

జిల్లా అడిగితే మండలంతో సరిపెట్టిన ప్రభుత్వం

17 గ్రామాలతో కొత్తగా పెద్దహరివాణం

ఆదోని మండలం విభజన

జిల్లాలో 27కి చేరిన మండలాల సంఖ్య

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

ప్రజాభీష్టం మేరకే విభజన, వారి అవసరాలు, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆదోని ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది. ఆదోని జిల్లా కోసం ఉద్యమించిన ప్రజలకు నిరాశ మిగలగా.. అసలు కోరని పెద్దహరివాణం గ్రామాన్ని మండలంగా మార్చేశారు. 65 సంవత్సరాలుగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కన్నా ముందే ఆదోని జిల్లా డిమాండ్‌ పుట్టిందన్నది జగమెరిగిన సత్యం. కానీ ఈ డిమాండ్‌ను నాటి, నేటి పాలకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఆ కోరిక నెరవేరలేదు. ఎమ్మెల్యేలు, నాయకులు ఏకతాటిపైకి రాకపోవడంతో కరువుకు కేరాఫ్‌గా ఉన్న పశ్చిమప్రాంతం జిల్లాకు నోచుకోలేదు. మరో వాస్తవం ఏమిటంటే... ఆదోని జిల్లా ప్రస్థావన అసలు మంత్రుల కమిటీలో చర్చకే రాలేదు. ఆదోని ప్రాంత ప్రజల ఎదుట ‘ఆదోని జిల్లా తెస్తాం.. ప్రాణాలైనా అర్పిస్తాం...’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారో మరి? మొత్తం మీద తాము జిల్లా కోరితే.. ఒక్క మండలం కేటాయించి సరిపుచ్చడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు కోసం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలో ఆదోని మండలం విభజించి.. కొత్తగా 17గ్రామాలతో పెద్ద హరివాణం మండలం ఏర్పాటుకు గెజిట్‌ విడుదల చేశారు. కొత్త మండలం ఏర్పాటుపై అభ్యంతరాలకు నెల రోజుల్లోగా తెలియజేయాలని అందులో పేర్కొ న్నారు. ఆదోని జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలకు బలంగా సెంటి మెంటు ఉంది. అదే క్రమంలో 46 గ్రామాలతో అతి పెద్ద మండలంగా ఉన్న ఆదోనిని మూడు మండలాలుగా విభజించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. 65 ఏళ్ల కల ఆదోని జిల్లా సాకారం చేయాలంటూ రిలే నిరా హారదీక్షలు చేస్తున్నారు. జిల్లా విషయమే మంత్రివర్గ ఉపసంఘం పట్టించుకోలేదు. ఆ ప్రతిపాదనే తీసుకురాలేదు. అంతేగాకుండా ఆదోని, ఆదోని అర్బన్‌, పెద్దహరివాణం, పెద్ద తుంబళం నాలుగు మండలాలుగా విభజించాలని ప్రజలు, రాజకీయ నాయకులు కోరారు. ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా పెద్దహరివాణం కేంద్రంగా 17 గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం కొసమెరుపు. ఇక ఆదోని మండలంలో 29 గ్రామాలు మిగులుతున్నాయి. జిల్లాలో అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోని, పెద్దహరివాణం మండలాలుగా విడిపోవడంతో జిల్లాలో మండలాల సంఖ్య 26 నుంచి 27కు చేరనుంది.

మండల విభజనలో లోపించిన పారదర్శకత

ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివాణం మండలం చేయడం అభినందనీయమే. అయితే మండల నైసర్గిక స్వరూపాన్ని పరిశీలిస్తే.. పలు గ్రామాలకు మండలం అత్యంత దూరంగా ఉంటుంది. ఆదోనికి పెద్దహరివాణం దాదాపు 20కిలో మీటర్ల దూరంలో ఉంది. కొత్తగా ఏర్పడిన మండలంలోకి ఆదోనికి 3, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపురం, చాగి, ధనాపురం, నాగనాతనహల్లి, మదిరే, కడితోట గ్రామాలను కల్పడం విమర్శలకు తావిస్తోంది. ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే ఆదోనికి చేరుకుని అక్కడి నుంచి పెద్దహరివాణం వెళ్లాల్సి ఉంటుంది. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన మండలం వల్ల పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే హోళగుంద, ఆదోని మండలాల్లోని గ్రామాలతో పెద్దహరివాణం మండలం ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద తుంబళం, ఆదోని మూడు మండలాలు విభజించి ఉంటే అందరికీ ఆమోదయోగ్యకరంగా ఉండేదని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనా సౌలభ్యం ప్రజల వద్దకు పాలన అందించేలా మూడు మండలాలుగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఆదోని మండలం పరిధిలోకి వచ్చే గ్రామాలు

ఆదోని

కల్లుబావి

వెంగళాపురం

పర్వతాపురం

మండిగిరి

ఎస్‌.కొండాపురం

ఇస్వి

గోనబావి

దిబ్బనకల్లు

నెట్టేకల్లు

ఆరేకల్లు

బైచిగేరి

సలకలకొండ

విరూపాపురం

దొడ్డనగేరి

సాంబగల్లు

హువ్వనూరు

కపటి

బాసరకోడు

చిన్న పెండేకల్లు

బల్లేకల్లు

మాత్రికి

పాండవగల్లు

దయ్యాలగుడ్డం

కుప్పగల్లు

జాలిమంచి

సుల్తానాపురం

పెసలబండ

పెద్ద తుంబళం

పెద్దహరివాణం మండలంలోకి వచ్చే గ్రామాలు

పెద్దహరివాణం

సంతకూడ్లూరు

యడవల్లి

బళదూరు

చిన్నగోనేహాలు

చిన్నహరివానం

మదిరే

కడితోట

హనవాలు

జి.హోసల్లి

బస్సాపురం

వి.కొండాపురం

నాగనాథనహల్లి

నారాయణపురం

ఛాగి

ధనాపురం

గణేకల్‌

Updated Date - Nov 27 , 2025 | 11:38 PM