Share News

మాస్టర్‌ వీవర్స్‌కు.. చేయూత ఏదీ?

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:34 PM

వ్యవసాయం తరువాత అత్యంత మందికి ఉపాధి చూపిన రంగం చేనేత.

మాస్టర్‌ వీవర్స్‌కు.. చేయూత ఏదీ?
చేనేత మగ్గంపై జరీ అంచు పట్టుచీరల నేత పనిలో చేనేత కార్మికుడు

చేనేత కార్మికులకు ఉపాధి కల్పనలో కీలకం

నిర్వీర్యమవుతున్న సహకార సంఘాలు

అండగా నిలుస్తున్న మాస్టర్‌ వీవర్స్‌

ప్రభుత్వ గుర్తింపు కోసం తాపత్రయం

గుర్తింపు కార్డులు, రుణ సౌకర్యం కల్పించాలని విన్నపం

14 నెలలైనా అమలు కాని హామీ

వ్యవసాయం తరువాత అత్యంత మందికి ఉపాధి చూపిన రంగం చేనేత. మగ్గంపై ఆధారపడి ఉపాధి పొందుతూ వేలాది మంది చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మాస్టర్‌ వీవర్స్‌ (చేనేత కళకారుడు). సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి లేక వీధినపడ్డారు. ప్రభుత్వాల చేయూత కరువై అర్ధాకలితో అలమటిస్తున్న నేతలకు మాస్టర్‌ వీవర్స్‌ అండగా నిలిచారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నమ్ముకున్న చేనేతలకు భరోసా ఇచ్చారు. పట్టుచీరల క్రయవిక్రయాలు ఆగిపోయినా, చేనేత చీరల నిల్వలు పేరుకుపోయినా మగ్గం ఆపలేదు. అలాంటి మాస్టర్‌ వీవర్స్‌ను పాలకులు పట్టించుకోవడం లేదు. చేనేత జౌళి శాఖ వీరికి కనీసం గుర్తింపు కార్డులను జారీ చేయడం లేదు. వేలాది మందికి ఉపాధి కల్పించే ‘మాస్టర్‌ వీవర్స్‌’ మాత్రం పాలకులకు పట్టదు. జిల్లాలో మాస్టర్‌ వీవర్స్‌ ఆవేదనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చేనేత రంగానికి వందేళ్ల చరిత్ర ఉంది. 1938లోనే ‘ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌ దివంగత పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించారు. ఎమ్మిగనూరు, కోడు మూరు, ఆదోని, నంద వరం, నాగులదిన్నె, గుడేకల్లు, గూడూరు, నంద్యాల, కోవెలకుంట్ల, బనగానపల్లె, నంది కొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు ప్రాంతాల్లో చేనేత మగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి చేస్తూ చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబాలు 15-20వేలు వరకు ఉన్నా యని అంచనా. పాలకుల నిర్లక్ష్యం.. ప్రభుత్వాల చేయూత కరువై.. మరమగ్గాల పోటీ తట్టుకోలేక నమ్ముకున్న మగ్గాన్ని వదిలేసి వలసలు వెళ్లిన వారెందరో. ఒకనాడు వేలాది మందికి ఉపాధి కల్పించిన సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో ఆ సంఘాలు నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా మగ్గం వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కుంటున్న సమయంలో మేమున్నామంటూ చేనేతలకు మాస్టర్‌ వీవర్స్‌ అండగా నిలిచారు. పాతికేళ్లకు పైగా జరీ అంచు పట్టుచీరల తయారీలో నైపుణ్యం చాటుతూ మగువ మనసును దోచే పట్టుచీరల ఉత్పత్తిలో మాస్టర్‌ వీవర్స్‌ పాత్ర కీలకంగా మారింది.

ఒక్కో మాస్టర్‌ వీవర్‌ 25 నుంచి వందకు పైగా..

ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, నందవరం ప్రాంతాల్లో దాదాపు 125 మందికిపైగా మాస్టర్‌ వీవర్స్‌ ఉన్నారు. ఒక్కో మాస్టర్‌ వీవర్‌ 25నుంచి వందకు పైగా చేనేత మగ్గాలు కలిగి దాదాపు 5-6వేల మంది చేనేత కుటుంబాలకు ఉపాధి చూపుతున్నారు. మగ్గంపై పరోక్షంగా ఆధారపడిన డైయింగ్‌ (రంగులు) వేసే, పాగడ అతికే కార్మికులు, జరీ పాగడాలు వేసే వారు. ఇలా ఉపవృత్తి పొందుతున్న చేనేత కార్మికులు సరేసరి. మగువలు మెచ్చే డిజైన్లు తయారీ, మగ్గం, ముడి సరుకు సరఫరా మొదలు ఉత్పత్తి చేసిన జరీఅంచు పట్టు చీరలు విక్రయాలు బాధ్యత మాస్టర్‌ వీవర్స్‌దే. చీరలు అమ్ముడుపోయినా పోకపోయినా నేత కార్మికుడికి మాత్రం చీర నేసిన కూలీ డబ్బులు ఇవ్వాల్సిందే. మగ్గంపై చీర నేస్తే డిజైన్‌ను బట్టి ఒక్కో చీరకు కనిష్టంగా రూ.2,500, గరిష్టంగా రూ.6,500-7,000 వరకు చేనేతలకు కూలి చెల్లిస్తారు. ఒక చీర నేయడానికి భార్యాభర్త కష్టపడితే 5-10 రోజులు సమయం పడుతుంది. మాస్టర్‌ వీవర్స్‌ తాము బతుకుతూ వేలాది మంది చేనేత కార్మికులకు బతుకునిస్తున్నారు. అన్‌సీజన్‌లో చీరలు అమ్ముడుపోక, వ్యాపారులు మోసాలకు గురై తీవ్రంగా నష్టపోయిన మాస్టర్‌ వీవర్స్‌ ఎందరో ఉన్నారు. అయినా.. మరో వృత్తి తెలియక దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ప్రభుత్వం చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాలు అందిస్తుంది. మాస్టర్‌ వీవర్స్‌ను చేనేత కార్మికులుగా గుర్తించడం లేదు. డైయింగ్‌ కార్మికులు, వార్పు, పాగడాలు వేయడం, అతికే కార్మికులను కూడా గుర్తించపోవడంతో ప్రభుత్వ పథకాలు వారికి అందని ద్రాక్షగా మారాయి. చేనేత నైపుణ్యం ఉన్నా సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్నారు. మమ్ములను చేనేతలుగా గుర్తించండి.. ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలని విన్నపాలు బుట్టదాకాలు అవుతున్నాయి. గత ఎన్నికల ముందు ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల్లో మాస్టర్స్‌ వీవర్స్‌కు అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు. మంగళగిరి తరహాలో చేనేతలతో పాటుగా మాస్టర్‌ వీవర్స్‌ చేయూత అందిస్తామని టీడీపీ స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

ప్రధాన డిమాండ్లు ఇవే

మాస్టర్‌ వీవర్స్‌ను ప్రభుత్వం గుర్తించాలి. చేనేత జౌళి శాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీచేయాలి. అన్‌సీజన్‌ సమ యం లో పట్టుచీరలు అమ్ముడుపోక నిల్వలు పేరుకుపోతున్నాయి. నేతన్నకు ఉపాధి చూపాలంటే అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పావులావడ్డీకి స్వల్పకాలిక, దీర్ఘకాలిక బ్యాంక్‌ రుణాలు ఇచ్చి ఆర్థిక భరోసా ఇవ్వాలి. పట్టు (సిల్క్‌), రంగులు కొనుగోళ్లపై రాయితీ ఇవ్వాలి.

మాస్టర్‌ వీవర్స్‌ ఉత్పత్తి చేసే చేనేత పట్టుచీరలు, ఇతర వస్త్రాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి. సహకార సంఘాలతో సంబంధం లేకుండా పారిశ్రామికవేత్తల తరహాలో మాస్టర్‌ వీవర్స్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలి.

మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

మాస్టర్‌ వీవర్‌గా మరో 30-40 మంది చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నాం. మార్కెట్‌ పోటీని తట్టుకోవాలంటే ఆకట్టుకునే డిజైన్లు ఎంతో ముఖ్యం. చీరలు అమ్ముడుపోయినా పోక పోయినా నేత నేసిన నేతన్నకు కూలీ డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే వారి కుటుంబ పోష ణ కష్టంగా మారుతుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాణిస్తున్న మాస్టర్‌ వీవర్స్‌కు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలి.

సి. చిన్న రంగస్వామి, మాస్టర్‌ వీవర్‌, ఎమ్మిగనూరు

రాయితీపై పట్టు సరఫరా చేయాలి

మా తాతల కాలం నుంచి చేనేత వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. మాస్టర్‌ వీవర్‌గా 35ఏళ్ల నుంచి నేను ఉపాధి పొందుతూ మరో 35మంది చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నా. ప్రభుత్వం పొత్రాహం, గుర్తింపు ఇవ్వాలి. పట్టుచీరల తయారికి కీలకమైన పట్టు (సిల్క్‌), రంగులపై ప్రభుత్వం రాయితీలు ఇచ్చి మాస్టర్‌ వీవర్స్‌ను కూడా ఆదుకోవాలి.

ఎం. రాఘవేంద్ర, మాస్టర్‌ వీవర్‌, కోడుమూరు

Updated Date - Aug 18 , 2025 | 11:34 PM