Share News

ఇవేం కాలువలు?

ABN , Publish Date - May 12 , 2025 | 11:51 PM

ఇవేం కాలువలు?

ఇవేం కాలువలు?
ఎమ్మిగనూరు మండలం గుడేకల్లు వద్ద అసంపూర్తిగా టీబీపీ ఎల్లెల్సీ లైనింగ్‌ పనులు

వైసీపీ హయాంలో నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వంపై రైతుల్లో ఆశలు

అత్యవసర పనులకు రూ.41.38 కోట్లతో ప్రతిపాదనలు

నిధులిస్తేనే కాలువలు బాగుపడేది

ఆయకట్టుకు పంట కాలువలు జలనాడులు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలంటే కాలువలు బాగుండాలి. అయితే గత వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం ఫలితంగా కాలువలు దెబ్బతిన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రధాన కాలువలు పూడికతో నిండిపోతున్నాయి. సాగునీరు అందని ధైన్యస్థితికి చేరాయి. కూటమి ప్రభుత్వం రావడంతో కాల్వల మరమ్మతులపై రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అత్యవసర పనులకు తక్షణమే రూ.41.38 కోట్లు నిధులు ఇవ్వాలని జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నిధులిస్తే కాలువలు కొంతైనా బాగుపడుతాయి. లేదంటే పంట చేలు తడిపేందుకు అన్నదాతలకు క‘న్నీటి’ కష్టాలు తప్పవు.

కర్నూలు, మే 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్టు, కర్నూలు-కడప (కేసీ) కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్పార్బీసీ) పరిధిలో 5.05 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందిచాల్సి ఉంది. పంట చేలకు జలనాడులైన కాలువలు పూర్తిగా అధ్వానంగా మారాయి. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు నిధులతో మరమ్మతులు చేపట్టారు. తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ఐదేళ్ల పాటు కాలువలు, ప్రాజెక్టు నిర్వహణపై అంతులేని నిర్లక్ష్యాన్ని చూపింది. దీంతో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు శిథిలావస్థకు చేరాయి. పలు ప్రాంతాల్లో పూడిక, ముళ్ల పొదలతో నిండిపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆయకట్లు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వేసవిలో డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు మరమ్మతులు చేపడితే జూన్‌ నుంచి మొదలయ్యే ఖరీఫ్‌లో ఆయకట్టుకు సాఫీగా సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశిస్తున్నారు.

రూ.41.38 కోట్లతో ప్రతిపాదనలు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మైనర్‌ ఇగిరిగేషన్‌ పర్యవేక్షణలోని చెరువులు, తూములు, కాలువలు సహా టీబీపీ ఎల్లెల్సీ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టు, కేసీ కెనాల్‌, గురురా ఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని పంటల కాలువలు, డిస్ట్రీబ్యూటరీలు, తూముల అత్యవసర మరమ్మతుల కోసం రూ.41.38 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరుతూ జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. వాస్తవంగా పూర్థిస్థాయిలో మరమ్మతులకు రూ.1,558 కోట్లు అవసరం ఉందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఆ మొత్తంలో ప్రభుత్వం నిధులు ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి ఉంది. దీంతో ఖరీఫ్‌ సీజన్‌లో ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు ఇవ్వాలంటే 547 పనులకు రూ.41.38 కోట్లు ఇవ్వాల్సిన అత్యవసరం ఉందని ఇంజనీర్లు అంటున్నారు. జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని కాలువల మరమ్మతులపై దృష్టి సారించాలి. ఆ దిశగా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనపై ఒత్తిడి తీసుకురావాల్సి అవసరం ఉంది.

వాస్తవ పరిస్థితులివీ..

తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ద్వారా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్‌, రబీలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు పట్టణాలు సహా 195 గ్రామాలకు తాగునీరు అందించాలి. 1955లో నిర్మించిన ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ, పంట కాలువలు అధ్వానంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఆనవాళ్లు కోల్పోయాయి. పూర్థిస్తాయిలో మరమ్మతులు, పునర్నిర్మాణం చేయాలంటే రూ.350 కోట్లు అవసరం ఉంది. అత్యవసరమైన 110 పనులకు రూ.8.54 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన పంపారు.

కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరం, నంద్యాల, నందికొట్కూరు పట్టణాలు, వివిధ గ్రామాలకు తాగునీరు అందించే కేసీ కాలువ అధ్వానస్థితికి చేరింది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ‘సిప్‌’ కింద రూ.563 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు ఇవ్వాడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే.. 85 శాతం నిధులు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 15 శాతం వాటా గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో నిధులు ఆగిపోయాయి. తక్షణ మరమ్మతులకు 221 పనులకు రూ.15 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు.

నంద్యాల జిల్లాలో 1.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఎస్సార్బీసీ కాలువ అసంపూర్తి వల్ల 1.55 లక్షల ఎకరాలకే ఆయకట్టు స్థిరీకరించారు. బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించే ఈ కాలువ మరమ్మతులు, అసంపూర్తి పనులు కోసం రూ.270-300 కోట్లు కావలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. అయితే అత్యవసర మరమ్మతులకు 64 పనులకు 4.84 కోట్లు ఇవ్వాలని ఇంజనీర్లు కోరుతున్నారు.

తెలుగుగంగా కాలువ ద్వారా ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆత్మకూరు, నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ పట్టణాలు సహా పలు గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటికే 40 కి.మీలు లైనింగ్‌ పనులు చేశారు. మరో 45-50 కి.మీలు లైనింగ్‌, పంట కాలువలు ఆధునీకరణ కోసం దాదాపు రూ.250 కోట్లకు పైగా అవసరం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు ఇవ్వాలంటే తాత్కాలిక మరమ్మతుల కోసం 67 పనులకు రూ.8.19 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు.

ప్రాజెక్టు వారిగా ఆయకట్టు (లక్షల ఎకరాల్లో), అత్యవసర మరమ్మతులకు ప్రతిపాదనలు. రూ.కోట్లల్లో

సాగునీటి కాలువ ఆయకట్టు పనులు కావాల్సిన

నిధులు

మైనర్‌ ఇరిగేషన్‌, కర్నూలు -- 24 1.39

మైనర్‌ ఇరిగేషన్‌, నంద్యాల -- 49 2.68

టీబీపీ ఎల్లెల్సీ 1.51 110 8.53

కేసీ కాలువ 1.75 221 15.00

తెలుగుగంగా కాలువ 1.24 67 8.20

ఎస్సార్బీసీ కాలువ 1.55 64 4.84

గురురాఘవేంద్ర ప్రాజెక్టు -- 12 0.74

మొత్తం 5.05 547 41.38

ప్రతిపాదనలు పంపించాం

ఉమ్మడి జిల్లాల్లో కేసీ కాలువ, ఎస్‌ఆర్‌బీసీ, టీబీపీ ఎల్లెల్సీ, తెలుగుగంగ కాలువలు సహా మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన 547 మరమ్మతు పనులకు రూ.41.38 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు చేపడుతాం. వచ్చే ఖరీఫ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.

- కబీర్‌బాషా, చీఫ్‌ ఇంజనీరు, ఉమ్మడి జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌, కర్నూలు

Updated Date - May 12 , 2025 | 11:51 PM