Share News

దుప్పట్లు ఏవీ..?

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:15 AM

బాలికల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.. విద్యార్థినుల సంక్షేమానికి నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అంతంత మాత్రమే అమలు అవుతోంది. విద్యార్థినుల కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారు.

దుప్పట్లు ఏవీ..?

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్ల హాస్టళ్లలో అందని బెడ్‌షీట్లు

ఇంటి నుంచి తెచ్చుకుంటున్న విద్యార్థినులు

కాస్మెటిక్‌ చార్జీలకు మంగళం

తల్లిదండ్రులపై అదనపు భారం

బాలికల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.. విద్యార్థినుల సంక్షేమానికి నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అంతంత మాత్రమే అమలు అవుతోంది. విద్యార్థినుల కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారు. ఎప్పుడో పాఠశా లలు ప్రారంభించినప్పుడు ఇచ్చిన బెడ్‌షీట్లే వాడాల్సిన దుస్థితి నెలకొంది. ఏళ్లకు ఏళ్లుగా వాటిని వినియోగిస్తుండటంతో అవి పూర్తిగా పాడైపోయాయి. దీంతో చాలా మంది విద్యార్థినులు ఇళ్ల నుంచి బెడ్‌షీట్లు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం హాస్టళ్లకి అవసరమైన వంట సామగ్రి, వస్తువులను సరఫరా చేసింది. అయితే బెడ్‌షీట్లు ఇవ్వడం మాత్రం మరిచారు. గతంలో కాస్మెటిక్‌ చార్జీలను ఇచ్చేవారు. వాటికి కూడా ప్రస్తుతం మంగళం పాడారు.

ఆలూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బాలికల విద్యకు ప్రోత్సహిస్తున్నా వారికి అందాల్సిన సంక్షేమం మాత్రం అందడం లేదు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), మోడల్‌ స్కూల్‌ గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థినులు దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో ఈ స్కూళ్లు ప్రారం భించిన కాలంలో ఇచ్చిన బెడ్‌షీట్లు ఇంకా వాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దుప్పట్లు సరఫరా కాలేదు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, గురుకులం వంటి సంక్షేమ హాస్టళ్లకు ప్రతియేటా బెడ్‌ సీట్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా ఈ రెండు బాలికల హాస్టళ్లకు మాత్రం సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థినులు ఇళ్ల నుంచే బెడ్‌షీట్లు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే హాస్టళ్లకి అవసరమైన వంట సామగ్రి, వస్తువులను సరఫరా చేసింది. అయితే విద్యార్థినులకు అవసరమైన వాటిని మాత్రం సరఫరా చేయడం మరిచింది. జిల్లాలో 26 కేజీబీవీ బాలికల విద్యాలయలు ఉండగా 7075 మంది విద్యార్థినులు, మోడల్‌ స్కూల్‌ (కేజీబీవీ టైప్‌-4) బాలికల హాస్టళ్లు 16 ఉండగా అందులో 1416 మంది విద్యార్థినులు వసతి పొందు తున్నారు.

ఆరేళ్లుగా నిలిపివేశారు..

గతంలో కేజీబీవీ, మోడల్‌ హాస్టల్స్‌ విద్యార్థినులకు ప్రతినెలా కాస్మెటిక్‌ చార్జీల కోసం ఒక్కో విద్యార్థికి రూ.100 చొప్పున మంజూరు చేసేది. వాటిలో స్నానం సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరినూనె, స్టే ఫ్రీ, టూత్‌ పేస్ట్‌, ఫేస్‌ పౌడర్‌, కలిపి మొత్తం ఆరు రకాల వస్తువులు సరఫరా చేసేవారు. వాటిని కూడా ఆరేళ్లుగా నిలిపివేయడంతో ప్రతినెలా తల్లిదండ్రులపై భారం పడుతుంది. కూటమి ప్రభుత్వంలోనైనా విద్యార్థినులకు అవసరమైన బెడ్‌ షీట్లు, కాస్మెటిక్‌ చార్జీలు మంజూరయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్‌ హాస్టళ్లకి త్వరలోనే బెడ్స్‌ పంపిణీ చేస్తాం. ఇక బెడ్‌ షీట్లు, కాస్మోటిక్‌ చార్జీల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

స్నేహలత, జీసీడీవో సమగ్రశిక్ష, కర్నూలు

మంత్రి నారా లోకేశ్‌ దృష్టి సారించాలి..

ప్రభుత్వం ప్రతియేటా ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు బెడ్‌ షీట్లు సరఫరా చేస్తున్నా కేజీబీవీ, మోడల్‌ గర్ల్స్‌ హాస్టళ్ల విద్యార్థినులకు మాత్రం సరఫరా చేయడం లేదు. కాస్మోటిక్‌ చార్జీలకు మంగళం పలకడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడుతుంది. మంత్రి నారా లోకేశ్‌ దృష్టి సారించి విద్యార్థులకు బెడ్‌షీట్లు, కాస్మోటిక్‌ చార్జీలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి.

మునిస్వామి, పీడీఎస్‌యూ తాలూకా కార్యదర్శి, ఆలూరు

Updated Date - Aug 11 , 2025 | 12:15 AM