Share News

ఇక ఆదోని రెండు మండలాలు?

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:41 PM

ఆదోని జిల్లా చేయాలంటూ ఒక వైపు.. పెద్దహరివాణం మండలం వద్దంటూ మరో వైపు రిలే దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, వంటా వార్పు పేరిట ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.

ఇక ఆదోని రెండు మండలాలు?
రోడ్డుపై ఆందోళన చేపట్టిన మహిళలు

17 గ్రామాలతో పెద్దహరివాణం మండలం ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

పెద్దహరివాణం వద్దంటూ రోడ్డెక్కిన వివిధ గ్రామాల ప్రజలు

కలెక్టర్‌కు 45 అభ్యంతరాలు.. ప్రభుత్వానికి నివేదిక

పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆదోని జిల్లా చేయాలంటూ ఒక వైపు.. పెద్దహరివాణం మండలం వద్దంటూ మరో వైపు రిలే దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, వంటా వార్పు పేరిట ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. పశ్చిమ ప్రాంతం సెంటిమెంట్‌ను బలంగా వినిపిస్తున్నారు. శనివారం సీఎం చంద్రబాబు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన, మార్పు చేర్పులు, వివిధ జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికలు, అభ్యంతరాలపై సమీక్షించారు. ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అయితే అది ఎలా ఉండేదీ స్పష్టత లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త జిల్లాల జోలికి వెళ్లకుండా, నవంబరు 27న ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాలను మాత్రమే చర్చించినట్లు తెలుస్తోంది. అంటే.. ఆదోని జిల్లా లేనట్లే? అని పలువురు అంటున్నారు.

కర్నూలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆదోని పశ్చిమ ప్రాంతం. ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలనే డిమాండ్‌ 73 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నా ప్రభుత్వాల దృష్టికి బలంగా వెళ్లలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో 13జిల్లాలను విభజించి 26గా విభజించింది. ఆ సమయంలో ఆదోని జిల్లా చేసేందుకు రాజకీయంగా ఎంతో అనుకూ లంగా ఉన్నా నాటి వైసీపీ ఎమ్మెల్యేలు కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు.. అప్పటి సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లలేదు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ..

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పునర్విభజన లోపాలను సరిచేయడం, రెవెన్యూ డివిజన్లు, మం డలాల పునర్విభజనకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కన్వీనర్‌గా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. అంతకు ముందే ఆదోని మండలం నాలుగు మండలాలుగా విభజించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి అసెంబ్లీలో గళం వినిపించారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన వెంటనే పెద్దహరివాణం మండలం సాధన పేరిట ఆగ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో ఆదోని కోట్ల సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. మంత్రివర్గ ఉప సంఘాన్ని కలసి పెద్దహరి వాణం మండల ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రివర్గ ఉపసంఘానికి విన్నపాలు అంద జేశారు. ఆదోని జిల్లా డిమాండ్‌ బలంగా ఉన్నా.. ఆ తీవ్రత, అవశ్యకతపై మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని పలువురు అంటున్నారు. పెద్దహరివాణం గ్రామస్తుల విన్నపాన్ని పరిశీలించిన మంత్రివర్గ ఉప సంఘం ఆదోని మండలం విభజించి 17 గ్రామాలతో పెద్దహరివాణం మండలం ఏర్పాటుకు నవంబరు 25న నివేదిక ఇచ్చింది. 27న ప్రభుత్వం ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో..

ఆదోని జిల్లా సాధన కోసం ఒక్కసారిగా ఆందోళనలు ఉప్పొంగాయి. జేఏసీ ఆధ్వ ర్యంలో ఆదోని సహా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండకు ఆందోళ నలు విస్తరించాయి. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన వెంటనే ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు మేల్కొని ఆదోని జిల్లా ఆవశ్యకతపై మంత్రివర్గ ఉప సంఘం, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఉంటే అనకూల నిర్ణయానికి అవకాశాలు ఎక్కు వగా ఉండేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆదోని జిల్లాలోనే అతిపెద్ద మండలం

జిల్లాలోనే ఆదోని అతిపెద్ద మండలం. 40 పంచాయతీలు, 48 గ్రామాలున్నాయి. జనాభా కూడా 2.15 లక్షలు ఉంది. దీన్ని నాలుగు మండలాలుగా విభజించాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. పెద్దహరివాణం గ్రామస్థులు మాత్రం రిలే దీక్షలతో పాటు మంత్రివర్గ ఉప సంఘాన్ని కలసి వినతులు అందజేశారు. దీంతో పెద్దహరివాణం, గణేకల్లు, ఢాణాపురం, చాగి, నారాయణపురం, నాగనాథనహల్లి, బస్సాపురం, కడితోట, జి.హోసల్లి, హనవాల్‌, మదిరె, చిన్నహరివాణం, చిన్నగోనేహాల్‌, బలదూరు, యడవల్లి, సంతేకూడ్లూరు, వి.కొండాపురం 17 గ్రామాలతో పెద్దహరివాణం కేంద్రంగా మండలం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు.

ప్రజలు రోడ్డెక్కారు

పెద్దహరివాణం వద్దంటూ మెజార్టీ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. కొత్తగా ఏర్పాటు చేసే మండలం నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితులు పరిశీలిస్తే పలు గ్రామాలకు మండలం కేంద్రం ఎంతో దూరంలో ఉంటుంది. కొత్తగా మండలం వచ్చిందనే సంతోషం కంటే ఈమండలం వద్దనే డిమాండ్‌ ఎక్కువ వినిపిస్తున్నారు. పెద్దహరివాణం వద్దని, పెద్దతుంబళం మండలం కావాలని, ఆదోని, హోళగుంద, కౌతా ళం మండలాల్లోని గ్రామాలు కలిపి పెద్దహరివాణం మండలం చేయాలంటూ కలెక్టరు ఏ.సిరికి 45కు పైగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెళ్లాయి. వాటిని పరిశీలించిన కలెక్టర్‌ పూర్తివివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై సీఎం చంద్రబాబు సమీ క్షించినట్లు తెలుస్తుంది. విస్తీర్ణంలో పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజిం చాలనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ మేరకు 17 గ్రామాలతో పెద్దహరివాణం మండలం ఏర్పాటుచేస్తారా..? ప్రజాఫిర్యాదులు, అభ్యంతరాలను పరి గణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేస్తారా? ఆదోని-1, ఆదోని-2 రెండు మండలా లుగా విభజిస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. ఈ నెల 31న మండల విభజనపై తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

చర్చకు నోచుకోని జిల్లా డిమాండ్‌

మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక మేరకు మూడు జిల్లాలు సహా రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు ప్రభుత్వం ప్రాథమిక గెజిట్‌ నోటి ఫికేషన్‌ జారీ చేసింది. ప్రజలు నుంచి అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఆదోని మండలం విభజనపై 45 అభ్యంతరాలు వచ్చాయి. సీఎం చంద్రబాబు వీటిపై ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యం తరాలను పరిగణలోకి తీసుకొని కొద్దిపాటి మార్పుచేర్పులపై చర్చించినట్లు తెలుస్తుంది. ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌లో లేని కొత్త జిల్లా డిమాండ్‌పై కనీస చర్చకు కూడా నోచుకోలేదని తెలుస్తుంది. దీంతో ఆదోని జిల్లా అంశం చర్చకు రాలేదని సమాచారం.

మూడు విన్నపాలు మాత్రమే..

ఆదోని కేంద్రంగా జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారే తప్ప జిల్లా అవశ్యకతపై కలెక్టరుకు పెద్దఎత్తున విన్నపాలు ఇవ్వలేదని తెలుస్తుంది. ఆదోని జిల్లా కావాలంటూ కేవలం మూడు విన్నపాలు మాత్రమే వచ్చాయని కలెక్టరు ఏ.సిరి పేర్కొ నడం కొసమెరుపు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మాత్రం మం త్రివర్గ ఉప సంఘం కన్వీనర్‌, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడుతో చర్చించారు. ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌కే పరిమితమైన ప్రభుత్వం కొత్తజిల్లాలపై దృష్టి సారించలేదని తెలుస్తుంది. గతంలో పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం సున్నితమైన ఈ అంశాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణులు లేకపోలేదు.

Updated Date - Dec 27 , 2025 | 11:41 PM