రోడ్డు భద్రత ఏదీ?
ABN , Publish Date - May 05 , 2025 | 12:57 AM
రోడ్డుపైకి వచ్చిన మనిషి సురక్షితంగా ఇంటికి చేరతాడన్న భరోసా నానాటికీ తగ్గిపోతోంది.
రక్తమోడుతున్న రహదారులు
సిద్ధాపురం, ఎర్రకోట ఘటనల్లో ఏడుగురు మృతి
ఏప్రిల్ నెలలోనే 15మంది దుర్మరణం
ప్రకటనలకే పరిమితమైన ప్రమాదాల నివారణ చర్యలు
వీధిన పడుతున్న కుటుంబాలు
రోడ్డుపైకి వచ్చిన మనిషి సురక్షితంగా ఇంటికి చేరతాడన్న భరోసా నానాటికీ తగ్గిపోతోంది. ఏ మూల మలుపులో ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో.. ఎక్కడ ఏ గుంత నోరుతెరిచి నిలువునా మింగేస్తుందో తెలియని పరిస్థితి. రెప్పపాటులో సంభవిస్తున్న రోడ్డుప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అనాథలుగా మార్చేస్తున్నాయి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు హడావుడి చేయడం.. ఆ తరువాత షరా మాములే. రెండు రోజుల వ్యవధిలో ఆత్మకూరు, ఎర్రగోట వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదాల్లో ఏడుగురు అనంతలోకాలకు చేరారు. ఏప్రిల్ నెలలోనే సుమారు 15మందిని ప్రమాదం రూపంలో రహదారులు కబళించాయి. ప్రమాదాలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నా.. వైఫల్యం చెందుతున్నారు. ఈ వైఫల్యానికి కారకులు ఎవరు..? నిత్యం రక్తమోడుతున్న రోడ్ల మూలంగా వీధిన పడుతున్న అభాగ్యులకు అండగా నిలిచేదెవరు? భరించలేని వైద్య ఖర్చులు, ఉపాధి కోల్పోవడంతో క్షతగాత్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వారిలో అత్యధికులు పేదలు, మధ్యతరగతి ప్రజలే. వారి బాగోగులు చూసేదెవరు..? ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 4 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువుకట్ట వద్ద కర్నూలు- గుంటూరు వయా ఆత్మకూరు, దోర్నాల జాతీయ రహదారిపై బొలెరో గూడ్స్ వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈఘట నలో ఆదోని, ఎర్రబాడుకు చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం అని ప్రాథ మికంగా తేల్చేశారు. అయితే.. రాయలసీమ నుంచి రాజధాని అమరావతికి వెళ్లే కీలకమైన జాతీయ రహదారి సింగిల్ రోడ్డు ఇది. ఎదురుగా వస్తున్న ఓ వాహనానికి సైడ్ ఇవ్వబోతూ రోడ్డు దిగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.
ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సమీపంలో మలుపు వద్ద సరుకులు రవాణా చేసే అశోక్ లైలాండ్ వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో కడిమెట్ల గ్రామం, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని అంటున్నారు. మలుపు వద్ద స్పీడ్‌బ్రేకర్లు (వేగ నిరోధకాలు) ఏర్పాటు చేయ లేదు.. నిర్మాణ లోపాలు కూడా ప్రమాదాలకు కారణమని అంటున్నారు. అతివేగం వల్లనో.. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనో ప్రమాదాలు జరుగు తున్నాయనడంలో సందేహం లేదు. అయితే.. జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడం, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటులో అంతులేని అలసత్వం, పాదాచారులు రోడ్లు దాటేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతసేపు రవాణా శాఖ, పోలీసుల దృష్టంతా జనానికి జరిమానాలు వేయడంపైనే ఉండడంతో ‘రహదారి భద్రత నిబంధనల స్ఫూరి’ ప్రశ్నార్థకంగా మారుతుంది.
జనవరి నుంచి ఏప్రిల్ వరకు 58 ప్రమాదాలు
జిల్లాలో ఏడాదిలో సగటున 135-145 రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయని, 40-50 మందికిపైగా మృత్యువాత పడితే.. 150మందికి పైగా గాయా లతో బయటపడుతున్నారు. ఈఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 58 ప్రమాదాలు జరిగాయి. 24 మంది మృతిచెందగా, 110మందికి పైగా గాయపడ్డారని పోలీస్ రికార్డులు ద్వారా తెలుస్తుంది. ఒక్క ఏప్రిల్ నెలలో 10కిపైగా ప్రమాదాలు జరిగాయి. 15 మంది వరకు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల్లోనే జరిగిన ఆత్మకూరు, ఎర్రకోట ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద మృతులంతా పేదలు, మధ్యతరగతి సామాన్య ప్రజలే.
ఆటోలపై నియంత్రణ ఏదీ?
రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే మెజార్టీగా మోటార్‌బైక్, ఆటో ప్రమాదాలే అధికంగా ఉంటున్నాయి. నిబంధనల మేరకు త్రీవీలర్ ఆటోలో డ్రైవర్‌తో పాటు నలుగురు, టాటా ఏసీ (సెవన్ సీటర్) ఆటోలో డ్రైవర్‌తో పాటు ఏడుగురు ప్రయాణికులను మాత్రమే ఎక్కించుకోవాలి. 10నుంచి 25మందికిపైగా ప్రమాణికులను ఎక్కించుకుంటున్నా రవాణా, పోలీస్ శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. గూడ్స్ రవాణాచేసే ట్రాలీ ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకోరాదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు విరుద్ధంగా ట్రాలీకి మధ్యలో చెక్కపలక ఏర్పాటుచేసి దాదాపు 25మందికిపైగా ఎక్కించుకుంటున్నారు. ప్రధా నంగా జాతర్లు, వివాహాలు, గ్రామోత్సవాలకు ఇలా తరలిపోతున్నారు. ఎక్కడైనా పోలీసులు, రవాణా అధికారులు ఆపేస్తే, మా వాళ్లే వదిలేయండి.. అని ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తుండడంతో చూసీచూడనట్లు వెళ్తున్నామని ఓఅధికారి పేర్కొనడం కొసమెరుపు.
ప్రమాదాలు ఎక్కడ జరిగినా రోడ్లు భవనాలు శాఖ ఇంజనీరు, రోడ్డు రవాణా శాఖ ఎంవీఐ, పోలీస్ అధికారి ఈముగ్గురు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరి శీలించాలి. ప్రమాదానికి రోడ్డు నిర్మాణ లోపమా..? వాహన కండిషన్ లోపమా..? మానవ తప్పిదమా..? నిర్లక్ష్యమా..? త్రీమెన్ కమిటీ స్పష్టమైన వివరాలతో నివేదిక ఇవ్వాలి. ప్రతి నెల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే జిల్లా ‘రోడ్డు సేఫ్టీ కమిటీ’ సమీక్షించాలి. రహదారి డిజైన్ లోపం వల్లనే ప్రమాదం జరిగి ఉంటే తక్షణమే మరమ్మతులు చేయాలి. జాతీయ రహదారులకు అయితే రూ.10లక్షల వరకు నిధులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పీడీనే మంజూరు చేయవచ్చు. జిల్లా, రాష్ట్ర రహదారులకు అయితే ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇప్పటి వరకు రహదారి భత్రతా సమీక్షలు నామమాత్రంగానే జరిగాయనే ఆరోపణులు ఉన్నాయి.
ఆర్థికంగా చితికిపోతున్న అభాగ్యులు
నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఓ యువ రైతు ఎమ్మిగనూరులో పని ముగించుకొని మోటార్‌బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. పట్టణ శివారులో ముగతి వ్యవసాయ క్షేత్రం వద్ద ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. యువరైతు తలకు తీవ్రమైన గాయాలకు గురికాగా.. చికిత్స కోసం కర్నూలు నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రూ.36లక్షలు అప్పులు చేసి ఖర్చుచేశారు. అయినా బతికాడా అంటే అదీ లేదు. రెండు నెలలకే మృత్యుఒడి చేరారు. ఇలాంటి వారెందరో. ప్రమాదాల్లో గాయపడిన బాధితులు భరించలేని వైద్యఖర్చులు, నెలల తరబడి ఉపాధి అవ కాశాలు కోల్పోతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశంలో జరుగు తున్న రోడ్డు ప్రమాదాల మూలంగా ప్రతి ఏటా దేశం జీడీపీలో 3.14 శాతం నష్టపోతున్నామని ఓ జాతీయ సంస్థ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తుంది. బాధిత కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
మూడేళ్లలో జరిగిన ప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు గాయపడివారు
2023 135 41 119
2024 142 49 153
2025 61 31 131
మే 4 వరకు
తక్షణమే మరమ్మతులు చేయిస్తాం
జిల్లాలో ఎక్కడ ప్రమాదం జరిగినా ఆర్‌అండ్‌బీ ఇంజనీరు, ఎంవీఐ, పోలీస్ అధికారి ముగ్గురు ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి కారణాలపై నివేదిక ఇస్తారు. నెలనెల రోడ్ సేఫ్టీపై సమీక్షా చేస్తారు. రహదారి డిజైన్ లోపం వల్లనో, ఇతర రోడ్డు మరమ్మతుల కారణంగానో ప్రమాదం జరిగిందని తెలితే తక్షణమే మరమ్మతులు చేయిస్తాం. రహదారి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.
- పి.మహేశ్వరరెడ్డి, ఎస్‌ఈ, రోడ్లు భవనాలు శాఖ, కర్నూలు
అవగాహన కల్పిస్తున్నాం
రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులు, డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. మెజార్టీ ప్రమాదాలు వెమరపాటు వల్ల జరుగుతున్నవే. రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు-కోడుమూరు రహదారిలో ప్రమాద సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగినట్లు గుర్తించాం. తక్షణమే వాటిని ఏర్పాటు చేస్తాం.
- బాబుప్రసాద్, డీఎస్పీ, కర్నూలు