ఆదోనికి ఎగనామం!
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:49 AM
ఆదోనికి ఎగనామం!
జిల్లా ఏర్పాటుకు ఒప్పుకోని ప్రభుత్వం
ప్రజల ఆకాంక్ష పట్టించుకోని రాజకీయ నేతలు
ప్రత్యేక జిల్లా చేస్తే పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి అవకాశం
కొరవడిన రాజకీయ నేతల ప్రయత్నాలు
పెద్ద హరివాణం మండలంతో సరిపుచ్చిన మంత్రివర్గ ఉప సంఘం
ఆదోని చారిత్రాత్మకంగా, రాజకీయంగా ఘన చరిత్ర కలిగిన పట్టణం. 160 ఏళ్ల క్రితం 1865లోనే నాటి బ్రిటీష్ పాలకులు మున్సి పాలిటీగా ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాల్లో తొలి మున్సిపాలిటీ ఇది. స్వాతం త్య్రం తరువాత ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కేంద్రం.
జిల్లా కేంద్రం కర్నూలుకు 102 కిలో మీటర్ల దూరంలో ఉంది. కలెక్టరేట్, జిల్లా కార్యాలయాల్లో పనుల కోసం వెళ్లాలంటే ప్రజలకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఆదోని జిల్లా చేయాలని 2022లోనే ప్రజలు డిమాండ్ చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం లోనైనా జిల్లా అవుతుందని ఆకాంక్షించారు.
ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రా లయం, పత్తికొండ నియోజకవర్గాల కేంద్రా లు, వివిధ గ్రామాల నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి 72 నుంచి 150 కిలో మీటర్లు దూరం అవుతుంది. అదే ఆదోని జిల్లా చేస్తే సగటున 25-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రజలకు ఇది ఎంతో ప్రయో జనకరం.
నంద్యాల జిల్లాలో కలిపిన నంది కొట్కూరు, డోన్ నియోజకవర్గాల ప్రజలు తమను కర్నూలు జిల్లాలో కలపాలని డి మాండ్ చేస్తున్నారు. ప్రజల సౌలభ్యం కోసం ఆ రెండు నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో విలీనం చేసి, ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే నిత్యం కరువుతో తల్లడిల్లే పశ్చిమ పల్లెసీమల్లో అభివృద్ధి వేగం పెరిగే అవకాశాలు మెండుగా ఉండేవి.
కర్నూలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన ప్రధాన లక్ష్యం పరిపాలన సౌలభ్యం. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు. పశ్చిమ ప్రాంతం పల్లెసీమ ప్రజలు వివిధ పనుల కోసం దాదాపు 100-150 కిలో మీటర్లు దూరంలోని ఉన్న కర్నూలుకు వెళ్లాల్సిందే. ఆదోని కేంద్రంగా జిల్లా చేస్తే కర్నూలు పూర్వవైభవం కోల్పోతుందనే సాకుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాత రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలుపుతూ ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజకీయ నాయకుల నుంచి ఆశించిన మద్దతు కరువైంది. ఫలితంగా మంత్రివర్గ ఉప సంఘం కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాత్రం అప్పుడప్పుడు తన గళం వినిపించారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు మంత్రివర్గ ఉప సంఘం వద్ద తమ గళం ఏమాత్రం వినిపించకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆదోని జిల్లా ఆకాంక్ష సాకారం కావాలంటే ప్రజా ఆందోళనకు తోడుగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తీసుకు వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. గత వైసీపీ హయాంలో చేసి అడ్డగోలు విభజనను సరిదిద్ది ఆదోని జిల్లాను చేసేందుకు మంత్రివర్గం ఉప సంఘం ప్రతిపాదించక పోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఆదోని జిల్లా డిమాండ్ ఈనాటిది కాదు
కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ ఈనాటి కాదు. 72-75 ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత కూడా ఆదోని డివిజన్ కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉండేది. 1952లో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత బళ్లారి నుంచి ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాలను కర్నూలు జిల్లాలో విలీనం చేశారు. ఆ సమయంలో ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కర్ణాటకలోనే ఉంచాలని ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఈశ్వరయ్యస్వామి, జె. నరసింహమూర్తి ఆచారి, కౌతాళం మండల పరిధిలోని బదినేహాల్‌కు చెందిన రంగన్నగౌడ్, ఎమ్మిగనూరుకు చెందిన వై.గాదిలింగన్నగౌడ్ డిమాండ్ చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అప్పట్లో వారి డిమాండ్ సాకారం కాలేదు. 1968-68లో ప్రకాశం జిల్లా ఏర్పటు చేసిన సమయంలో కూడా అనంతపురం జిల్లా గుంతకల్లు, ఆదోని డివిజన్ కలిపి ఆదోని లేదా గుంతకల్లు కేంద్రంగా జిల్లా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దివంగత టీజీ వసంత గుప్త జిల్లా సమితి అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో కూడా ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఈ తరువాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాల విభజనకు కసరత్తు మొదలు పెట్టినప్పటి నుంచి నంద్యాలతో పాటుగా ఆదోని జిల్లా చేయాలని ప్రజలు ఆందోళనలకు దిగారు. ఇలా 72 ఏళ్లుగా ఆదోని జిల్లా కోసం ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు తప్పా పాలకులు ఆలకించడం లేదు.
తాజా కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడంతో ఆదోని జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రజల ఆకాంక్ష, ఆశలు అడియాశలుగా మారాయి.
జిల్లా డిమాండ్ ఎందుకంటే..
ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు జిల్లా కేంద్రం కర్నూలుకు దూరంగా ఉండడమే కాకుండా అభివృద్ధి దూరంగా ఉన్నాయి. నిత్యం కరువు, వలసలతో గ్రామీణ ప్రజలు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా మెజార్టీ పల్లెసీమలు తాగునీటి కోసం తల్లడిల్లాల్సిన దైన్యపరిస్థితి ఉంది. అదే ఈ ప్రాంతమే ఓ జిల్లాగా ఏర్పడితే అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతాయి.
జిల్లా కేంద్రానికి 100-150 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుంది. అత్యవసరం, ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్పా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షణకు రావడం లేదని అంటున్నారు. కొన్ని శాఖల అధికారులు నెలలో ఒకటి రెండు రోజులు కూడా వచ్చిన దాఖలాలు లేవని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అదే ఆదోని జిల్లా అయితే.. జిల్లా కేంద్రం నుంచి ఏ గ్రామానికి వెళ్లాలన్నా గంటకు మించి సమయం పట్టదు. దీంతో పర్యవేక్షణ పెరిగి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, పాలన అందుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రాతిపదికన అభివృద్ధి అజెండా చేపడితే ఆదోని ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక, వాణిజ్య పరంగా రెండో ముంబాయిగా పేరుగాంచిన ఆదోనికి మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం లేకపోలేదు.
ఎమ్మిగనూరు జెర్సీ పశుక్షేత్రం పరిధిలో దాదాపు 1,500 ఎకరాలకు పైగా పశుసంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ప్రాంతం జిల్లా అయితే పారిశ్రామికంగా, జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. ఒకే వేళ జిల్లా స్థాయి పరిపాలన కార్యాలయాలు ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉంటుంది.
రాజకీయ అభివృద్ధి కూడా సాధ్యమే. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆదోని జిల్లా నుంచి ఒకరు మంత్రివర్గంలో ఉంటారు. ఐదు నియోజకవర్గాలే కావడంతో అభివృద్ధికి నిధుల సమస్య కొంతవరకు తీరుతుంది. అంతేకాదు భవిషత్తులో విశ్వవిద్యాలయం సహా కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అడిగింది జిల్లా.. ఇచ్చింది మండలం!
ఆదోని జిల్లా సహా ఆదోని నియోజకవర్గానికి ఆదోని, ఆదోని అర్బన్, పెద్దతుంబళం, పెద్దహరివాణం నాలుగు మండలాలుగా విభజించాలని ఇక్కడి ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంత్రివర్గ ఉప సంఘానికి వినతి ప్రతం ఇచ్చారు. నాలుగు మండలాల ఏర్పాటు ఆవశ్యకతపై పక్కా వివరాలు, అంకెలతో పాటు నివేదికలు ఇచ్చారు. పెద్దహరివాణం మండలం ఒక్కటే ఏర్పాటుకు మంత్రివర్గం నివేదిక ఇచ్చింది. ఇప్పటికైనా ఐదు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతితంగా సీఎం చంద్రబాబును ఒప్పించి ఆదోని జిల్లా సహా ఆదోని నియోజకవర్గం కనీసం మూడు మండలాలుగా విభజించేలా ప్రయత్నాలు చేయాలని పలువురు కోరుతున్నారు.